Bangladesh – BJP: బంగ్లాదేశ్ లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో బోణి కొట్టింది. భోలా నగరం నుంచి బంగ్లాదేశ్ జమాతే -ఇ – ఇస్లామి అభ్యర్థి ఎండీ నజ్రుమ్ ఇస్లాంపై బీజేపీ అభ్యర్థి రెహమాన్ పార్థో 75,337 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీజేపీ).
బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి 12న జాతీయ ఎన్నికలు జరగ్గా.. 297 సీట్లకు సంబంధించిన ఫలితాలను ఈసీ ప్రకటించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) దాని మిత్ర పక్షాలు కలిపి ఏకంగా 212 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించాయి. BNP అధినాయకుడు తారిక్ రహ్మన్.. బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు విపక్ష జమాత్, దాని మిత్ర పక్షం 77 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం గమనార్హం. జమాత్ 68 స్థానాలు గెలవగా.. నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) ఆరు స్థానులు గెలుచుకుంది.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మెుత్తం 50 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. వీరిలో 273 మంది స్వతంత్రులు ఉన్నారు. బీఎన్‌పీ అత్యధికంగా 291 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో 83 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బీజేపీ) అభ్యర్థి పార్థో.. ఆ పార్టీ తరపున బోణి కొట్టినట్లు ప్రకటించింది. దక్షిణ బంగ్లాదేశ్ ను భోలా నగరాన్ని తిలోత్తమగా మార్చి.. ఆధునిక, అందమైన నగరంగా మారుస్తానని పార్థో ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
భోలా – బరిషర్ వంతెన నిర్మాణం, వైద్య కళాశాలల ఏర్పాటు, ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ తన ముఖ్య ప్రాధాన్యతలుగా పార్థో చెప్పుకొచ్చారు. అదే విధంగా మాధక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి.. ప్రజల ఆరోగ్యానికి, ప్రజల శాంతికి బాటలు వేస్తానని రెహమాన్ పార్థో స్పష్టం చేశారు. దీంతో అతడి హామీలపై నమ్మకం ఉంచి భోలా నగర ప్రజలు.. తాజా ఎన్నికల్లో అతడ్ని భారీ మెజారిటీతో గెలిపించారు.
బీజేపీకి చెందిన రెహమాన్ పార్థో విషయానికి వస్తే అతడు విద్యావేత్త, ప్రముఖ న్యాయవాది. బంగ్లాదేశ్ మాజీ మంత్రి నజీర్ రెహమాన్ కుమారుడు. భోలా నియోజకవర్గం నుంచి గతంలోనూ పార్లమెంటు సభ్యుడిగా అతడు వ్యవహరించారు. ఆయన ఢాకాలోని బ్రిటిష్ స్కూల్ ఆఫ్ లా కళాశాలకు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. 2008లో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో పార్థో తొలిసారి రాజకీయ ప్రవేశం చేశారు. అవామీ లీగ్ అభ్యర్థి యూసఫ్ హుస్సేన్ ను ఓడించి.. తన రాజకీయ ప్రస్థానాన్ని పార్థో ప్రారంభించారు.