Elon Musk Net Worth: ఎలన్ మస్క్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన అడుగు పెట్టని రంగం లేదు. టెస్లా నుంచి స్పేస్ ఎక్స్ వరకు.. ఎలక్ట్రిక్ కార్ల నుంచి రాకెట్స్ తయారీ వరకు, ఏఐ నుంచి సోషల్ మీడియా వరకు ఆయన ఏ పని చేసినా సంచలనమే. ప్రతి అడుగు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేలా చేస్తున్నాయి. తాజాగా మస్క్ ప్రపంచంలో ఎవరూ సాధించని అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలోనే అపర కుబేరుడిగా అవతరించాడు. ఆయన ఆస్తుల విలువ ఏకగా 700 బిలియన్ డాలర్లు దాటింది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ సుమారు రూ.63 లక్షల కోట్లు. ఇది మానవ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు.
తాజాగా డెలవేర్ సుప్రీం కోర్టు 2018 టెస్లా పే ప్యాకేజీని తిరిగి అమలు చేసే తీర్పు ఇచ్చిన తర్వాత మస్క్ ఆస్తి భారీగా పెరిగింది. ఎలన్ మస్క్ నికర ఆస్తి $749 బిలియన్లకు(67.12 లక్ష కోట్లు) చేరుకుని, చరిత్రలో $700 బిలియన్ల మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించేలా చేసింది. అంతకుముందు వారంలోనే అతను $600 బిలియన్లు(రూ.54 లక్షల కోట్లు) దాటిన మొదటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మస్క్ తన తర్వాత రెండవ స్థానంలో ఉన్న గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ కంటే దాదాపు $500 బిలియన్లు ముందు ఉన్నాడు. లారీ పేజ్ నికర ఆస్తి విలువ $265 బిలియన్లు(రూ.23.82 లక్షల కోట్లు).
టెస్లా బోర్డు 2018లో మస్క్ కు $56 బిలియన్ల(సుమారు రూ.5.02 లక్షల కోట్ల) విలువైన స్టాక్ ఆప్షన్స్ ప్యాకేజీని ఆమోదించింది. ఇది పూర్తిగా పెర్ఫార్మెన్స్ ఆధారితమైనది. మార్కెట్ క్యాప్, ఆపరేషనల్ మైల్‌స్టోన్స్ సాధిస్తే మాత్రమే వెస్ట్ అవుతుంది. మస్క్ అన్ని టార్గెట్స్ రీచ్ అయ్యాడు. కానీ, షేర్‌హోల్డర్ రిచర్డ్ టార్నెట్ కోర్టులో సూట్ వేశాడు. బోర్డులో స్వతంత్రత లోపం ఉందని వాదించాడు. డెలవేర్ చాన్సరీ కోర్టు జనవరి 2024లో ఈ ప్యాకేజీని రద్దు చేసింది. ఇదో అన్యాయమైన ప్యాకేజీగా అభిప్రాయపడింది. దీని వల్ల మస్క్ $56 బిలియన్లు కోల్పోయాడు. జూన్ 2024లో టెస్లా షేర్‌హోల్డర్లు మళ్లీ ఓటు వేసి ప్యాకేజీని ఆమోదించారు. కానీ, కోర్టులో పోరాటం కొనసాగింది.
తాజాగా డెలవేర్ సుప్రీం కోర్టు.. చాన్సరీ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరించి, ప్యాకేజీని పునరుద్ధరించింది. బోర్డు ఉల్లంఘనలు ఉన్నాయని అంగీకరించినప్పటికీ, పూర్తి రద్దు అన్యాయమని, బదులుగా $1 నామినల్ డ్యామేజెస్ మాత్రమే ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీని వల్ల మస్క్ కు $139 బిలియన్ల(సుమారు రూ.12.49 లక్షల కోట్ల) విలువైన స్టాక్ ఆప్షన్స్ తిరిగి వచ్చాయి.
మస్క్ నికర ఆస్తి సుమారు $679 బిలియన్లు కాగా, ప్యాకేజీ పునరుద్ధరణ వల్ల $139 బిలియన్లు యాడ్ అయ్యాయి. ప్రస్తుతం అతడి ఆస్తి $749 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచంలోనే $700 బిలియన్లు దాటిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందేలా చేసింది.
Read Also: 87 ఏళ్ల వయసులో తండ్రి అయిన చైనీస్ పెయింటర్, భార్య ఏజ్ 37 ఏళ్లు!