Iran War: ఇరాన్ యుద్ధం పరిణామాలు అన్నిరంగాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. రెండువారాల కిందట ఖతార్ సహజ వాయువు ఎగుమతి కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఆదేశం ఇంధన ఉత్పత్తిని నిలిపి వేసింది. దీని ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లకు కాకుండా, ప్రపంచ సాంకేతిక సరఫరాకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ వార్.. మరొక సెక్టార్‌కు సెగ
ఎందుకంటే హీలియం అనేది అధునాతన పరిశ్రమలకు కీలకంగా మారింది. మార్చి 2 నుండి ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్ సామర్థ్యంలో 14 శాతం శాశ్వతంగా దెబ్బతిన్నట్లు సీఈఓ తెలిపారు. మరమ్మత్తులకు ఐదేళ్ల పట్టవచ్చని సమాచారం. హీలియం ఎందుకు ఉపయోగిస్తుంటారు? ఏయే రంగాల్లో దీని అవసరం ఎంత వుంది? వివిధ దేశాల్లో దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? ఇప్పుడు చూద్దాం.
బర్త్ డే పార్టీలకు విస్తారంగా హీలియం బెలూన్లు ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. గాలిలో తేలడానికి ఉపయోగపడే కీలకమైన వాయువు. సహజ వాయువు ఉత్పత్తిలో ఇది లభిస్తుంది. దీనికితోడు చిప్‌ల తయారీ, అంతరిక్ష రాకెట్లు, మెడికల్ ఇమేజింగ్‌లో కీలకమైన ముడి పదార్థం కూడా.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ప్రపంచంలో హీలియంలో మూడింట ఒక వంతు ఖతార్ సరఫరా చేస్తుంది. యుద్ధం ప్రారంభమైన కొద్దిరోజులకు ప్రొడక్షన్ ఉత్పత్తిపై క్షిపణులు పడడంతో ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచంలో అతిపెద్ద సహజ వాయువు ప్లాంట్ రాస్ లఫాన్‌పై ఇరాన్ పదేపదే డ్రోన్ దాడులు చేసింది.
అన్నిదేశాలకు దెబ్బ మీద దెబ్బ, హీలియం ఆగితే ఇబ్బందులు తప్పవు
ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ గ్యాస్ ఉత్పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. మరమ్మతులకు ఏళ్లు పడుతుందని అంచనా. దీంతో వార్షిక హీలియం ఎగుమతులు 14 శాతం తగ్గుతాయని అప్పట్లో పేర్కొంది. ఇరాన్‌తో యుద్ధం ఖతార్ హీలియం ఉత్పత్తిని నిలిపి వేయడంతో ప్రపంచ టెక్ కంపెనీలకు సమస్యలు మొదలయ్యాయి. ప్రపంచ సరఫరాలో 33 శాతం రాత్రికి రాత్రే నిలిచిపోయింది. దీని కారణంగా సమస్యలు ఎదుర్కోనున్న సంస్థలను చూద్దాం.
దక్షిణ కొరియా-తన మొత్తం హీలియంలో 64.7 శాతం ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటుంది. హీలియం కొరత కారణంగా శాంసంగ్, ఎస్కే హైనిక్స్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయి.
తైవాన్-ప్రపంచంలోని చిప్‌లలో 18 శాతం తయారు చేసే TSMC కి ఇదొక నిలయం. ఆ దేశం ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. పైకి ఏ మాత్రం చెప్పకున్నా నిశ్శబ్దంగా ఆందోళన చెందుతోందని సమాచారం.
జపాన్-చిప్ ఫ్యాబ్రికేషన్, MRI తయారీకి ఒక ప్రధాన కేంద్రం. ఖతార్‌లో హీలియం సరఫరా 60 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే సరఫరాలు తొలుత ఇక్కడ అయిపోతాయి.
సింగపూర్- ఆ దేశంలో ప్రాంతీయ సెమీకండక్టర్ కేంద్రం. హీలియం కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడి ఉందని సైంటిఫిక్ అమెరికన్ ప్రముఖంగా ప్రస్తావించింది.
ఇండియా- MRI స్కానింగ్‌లో కీలకమైనది హీలియం వాయివు. ఖతార్ నుండి హీలియంను దిగుమతి చేసుకుంటున్నాయి పలు కంపెనీలు. MRI ఖర్చులు ఇప్పటికే పెరగడంతో స్కానింగ్ ప్రక్రియలో ఆలస్యం మొదలైంది. హీలియం కొరత తీవ్రంగా ఉంటే MRI స్కానింగ్ లకు ఇబ్బందులు తప్పవు. దీని ప్రభావం లక్షలాది ఆసుపత్రులపై పడడం ఖాయమని నిఫుణులు చెబుతున్నారు.
ALSO READ: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం: శత్రువుల నౌకలకు తప్ప మిగిలిన వారికి అనుమతి!
జర్మనీ- ఆ దేశంలో పారిశ్రామిక గ్యాస్ పంపిణీదారు లిండే ప్రధాన కార్యాలయానికి నిలయం. ప్రస్తుతం హీలియం స్పాట్ ధరలు 100 శాతం పెరిగాయి. లిండే, ఎయిర్ లిక్విడ్ ప్రస్తుతం సరఫరాలను రేషన్ పద్ధతిలో అందిస్తున్నాయి.
అమెరికా- అక్కడ హీలియం నిల్వలు సంవత్సరాలుగా తగ్గిపోతున్నాయి. అక్కడ చిప్ ఫ్యాబ్‌లకు ప్రమాదం పొంచి ఉంది. HP, డెల్, లెనోవో ఎంటర్‌ప్రైజ్ కొనుగోలుదారులను హెచ్చరించాయి. దీని ప్రభావంతో 15 నుంచి 20 శాతం ధరల పెంపు రానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
యూకె- MRI యంత్రాలు కలిగిన NHS ఆసుపత్రులు హీలియం కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశీయంగా హీలియం ఉత్పత్తి లేదు.
ఫ్రాన్స్-ఎయిర్ లిక్విడ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, అది హీలియంను ఉత్పత్తి చేయదు.. చేసే సామర్థ్యం లేదు. కేవలం పంపిణీ కేంద్రంగా మాత్రమే పని చేస్తుంది.
చైనా-తన చిప్ ఫ్యాబ్‌లు, MRI సౌకర్యాల కోసం హీలియంను దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సైబీరియా ప్రాంతంలో తన సొంత హీలియం అన్వేషణ కోసం ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చు.
ఆస్ట్రేలియా- ఆదేశం హీలియం ఎగుమతిదారు. అమేడియస్ బేసిన్ నుండి హీలియంను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఖతార్ స్థాయిలో సరఫరా అంతరాన్ని పూరించడానికి ఆ ఉత్పత్తి ఏ మాత్రం సరిపోవడం లేదు. హీలియం ద్వారా దాదాపు డజనుకు పైగానే దేశాలు ప్రభావితం కానున్నాయి. ప్రపంచ సరఫరాలో 33 శాతం ఉత్పత్తి ఆగిపోయింది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు. అలాగని పునఃప్రారంభానికి కాలపరిమితి కూడా లేదు.