Taiwan cheating case: ఒక రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఓ వ్యక్తిని జైల్లో పెట్టించింది. అదేంటీ.. ఇంటిని క్లీనింగ్ చేయాల్సిన రోబో క్లీనర్‌ను అలా ఎలా చేయగలగుతుంది అని అనుకుంటున్నారా? ఈ విషయంలో ఆ రోబో క్లీనర్ తప్పేం లేదు. ఓ వ్యక్తి దాన్ని క్లీనింగ్‌కు బదులుగా.. ఇంటి గుట్టును రట్టు చేయడానికి వాడటమే తప్పయ్యింది. చివరికి అతడిని జైలుపాలు చేసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే…
తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తికి తన భార్యపై అనుమానం కలిగింది. ఎలాగైనా సరే ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకున్నాడు. ఇందుకు అతడికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. రోబో క్లీనర్ సహాయంతో ఆమె గుట్టురట్టు చేయాలని అనుకున్నాడు. ఎట్టకేలకు అతడి పాచిక పారింది. ఆ రోబో క్లీనర్ సహాయంతో ఆమె ప్రియుడితో వెలగబెడుతోన్న రాసలీలలను క్లియర్‌గా రికార్డు చేశాడు. ఆ తర్వాత అతడు వారిద్దరిపై కోర్టులో కేసు వేసి పరిహారం కూడా పొందాడు. అక్కడితో అంతా బాగానే ఉంది అనుకొనేసరికి.. భార్య అతడికి ఊహించని షాకిచ్చింది.
నలుగురిలో తన పరువు తీసినందుకు ఆ భార్య ఊరుకుంటుందా. తన ప్రైవసీకి భంగం కలిగించాడంటూ ఆమె రివర్స్‌లో కౌంటర్ కేసు ఫైల్ చేసింది. ఈ కేసు విచారించిన కోర్టు.. అతడికి జైలు శిక్ష విధించింది. తైవాన్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ. వాళ్ల పేర్లయితే బయటకు వెల్లడించలేదు.. గానీ, ఈ కేసు మాత్రం భార్యభర్తలను గందరగోళానికి గురిచేసింది. భర్తను చీట్ చేసిన భార్యకు కోర్టు ఎలా సపోర్ట్ చేస్తుంది? కోర్టులే కదా.. ఆధారాలు కావాలని అడుగుతాయి. ఆధారాలిస్తే ఇలా జైల్లో పెడతారా అంటూ చర్చ సాగుతోంది.
వారిద్దరికి పెళ్లయి సుమారు ఐదేళ్లు పైనే అవుతుంది. 2021లో పెళ్లి తర్వాత బాధితుడి భార్య.. అత్తింట్లోనే భర్తతో చాలా అన్యోన్యంగా ఉండేది. ఏకాంతంగా ఎంజాయ్ చేయడం కోసం వారికి మరో ఇల్లు కూడా ఉండేది. హాలీడేస్ సమయంలో దంపతులిద్దరు అక్కడ సరదాగా గడిపేవారు. అయితే, 2023లో ఓ రోజు సెలవులను గడిపేందుకు వెళ్లిన భర్తకు బాత్ రూమ్‌లో టూత్ బ్రష్ కనిపించింది. అది ఎవరిదో తెలియక బుర్ర గోక్కున్నాడు. పార్కింగ్ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. అందులో అతడి భార్యను ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి డ్రాప్ చేసిన వ్యక్తి కనిపించాడు. దీనిపై ఆమెను నిలదీశాడు. తన తప్పు ఏం లేదని ఆమె బుకాయించింది. దీంతో క్షమించి వదిలేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
మూడు నెలల కిందట అనుకోకుండా అసలు విషయం బయటపడింది. ఓ రోజు ఇంట్లో ఉన్న రోబో వ్యాక్యూమ్ క్లీనర్‌ను మొబైల్ యాప్ ద్వారా రిమోట్‌గా ఆన్ చేసి.. దాని ద్వారా భార్యతో సరదాగా మాట్లాడాలని అతడు అనుకున్నాడు. కానీ, అనుకోకుండా ఆ వాక్యూమ్ క్లీనర్.. కెమెరా యాక్టీవ్ అయ్యింది. తన భార్య మరో వ్యక్తితో ఉన్న దృశ్యం చూసి షాకయ్యాడు. గతంలో సీసీటీవీలో కనిపించిన వ్యక్తే.. ఆమెతో రొమాన్స్ చేయడం చూసి మైండి బ్లాక్ అయ్యింది. అయితే, ఈ సారి ఆవేశపడి ఆమెను ప్రశ్నించలేదు. ఆ వీడియోలు ఎప్పటికైనా ఆధారాలుగా ఉంటాయని తన వద్దే దాచుకున్నాడు. వారి ఆగడాలు ఆగకపోవడంతో నేరుగా కోర్టును ఆశ్రయించి.. ఆ వీడియోలు బయటపెట్టాడు.
ఆ వీడియో ఆధారాలతో భార్యతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై కూడా కోర్టులో కేసు వేశాడు. తనకు జరిగిన నస్టానికి కనీసం రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశాడు. కేసును విచారించిన కోర్టు.. రూ.14.93 లక్షల వరకు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ కేసే.. అతడిని ముంచేసింది. తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు.. అతడు రికార్డు చేసిన వీడియోలే అతడిని జైలుకు పంపించాయి.
Also Read: నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే
భర్త కోర్టులో సమర్పించిన వీడియోను ఆధారంగా చేసుకుని భార్య కౌంటర్ కేసు వేసింది. తనకు, తనతోపాటు ఉన్న వ్యక్తికి తెలియకుండా తమ ఏకాంత క్షణాలను రికార్డు చేయడం నేరమని వాదించింది. తాను చేసిన పని భార్య మోసాన్ని బయటపెట్టడానికే కదా.. అని ఆ భర్త అమాయకంగా వాదించాడు. కానీ, కోర్టు అతడి వాదనను పట్టించుకోలేదు. వైవాహిక బంధంలో ఉన్నప్పటికీ.. జీవిత భాగస్వామి ప్రైవసీపై పూర్తి హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అనుమతి లేకుండా వారికి వీడియో తీయడం నేరమేనని పేర్కొంది. అతడికి 5 నెలల జైలు శిక్ష, రూ.9 లక్షల జరిమానా విధించింది.