2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారతదేశ విదేశీ విధానంలో చురుకుదనం కనిపించింది. దీనికి కారణం, మోదీ హయాంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పరిస్థితులు నెలకొనడం. అందులో భాగంగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. తర్వాత, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం అటు ప్రపంచ దేశాలపైనే కాకుండా భారతదేశంపైన కూడా భారీ ప్రభావాన్ని చూపింది. మోదీ టైమ్‌లో భారతదేశ పశ్చిమాసియా విధానానికి ఒక ఫేస్‌లిఫ్ట్ అవసరమని స్పష్టమైంది. దాన్ని రీసెట్ కూడా చేశారనడంలో సందేహం లేదు. అయితే, మోదీ తర్వాతి సంవత్సరాల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి పలుమార్లు అధికారిక పర్యటనలు కూడా చేసారు. UAE, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయెల్‌లతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకోగలిగారు. ఒకవైపు అరబ్ దేశాలు, పాలస్తీనియన్లు.. మరోవైపు, ఇజ్రాయెల్ మధ్య భారత్ విదేశీ విధానం చక్కటి సమతుల్యతను సాధించిందనే చెప్పాలి.
అయితే, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మొదలైన తర్వాత కారణాలు ఏవైనా.. భారత్, ఇజ్రాయెల్ వైపు కొంచెం మొగ్గు చూపిందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, భారతదేశం ఇరు పక్షాలకు మిత్రుడిగానే కొనసాగుతుంది. నిజానికి, భారతదేశం పశ్చిమాసియా విదేశాంగ విధానాన్ని చాలా తెలివిగా కొనసాగిస్తుందనడానికి ఇది నిదర్శనం. అయితే, ఇక్కొడొక ట్విస్ట్. అక్టోబర్ 2023లో హమాస్ దాడులకు ప్రతిస్పందనగా గాజాలో ఇజ్రాయెల్ చేసిన అరాచకం, మోదీ మిడిల్ ఈస్ట్ విధానాన్ని కప్పివేసింది. ఇక ఈ ప్రాంతంలో విస్తృత యుద్ధం ముంచుకొస్తున్న కారణంగా భారత్‌కు గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, భారత్ ఊపిరి బిగబట్టి చూస్తుండగానే మధ్యప్రాచ్యం గందరగోళం అంచున కొట్టుమిట్టాడుతోంది.
ఇరాన్.. “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” అనే ఇరాన్ సహకరంతో నడుస్తున్న ప్రాంతీయ సాయుధ గ్రూపులు కలిసి, ఇప్పుడు ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేశాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్యపై ప్రతిస్పందించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ హత్యపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకూ పెద్దగా వ్యాఖ్యానించనప్పటికీ.. హనియే హత్య ఇజ్రాయేలే చేసిందని శత్రువులు బలంగా నమ్ముతున్నారు. అందులోనూ, ఇరాన్‌కి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ను పదవీ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరైన కొద్ది గంటల తర్వాత ఇరాన్ రాజధాని నడిబొడ్డున ఇస్మాయెల్ హనియెను లక్ష్యంగా చేసుకోవడం మరింత రెచ్చగొట్టింది.
Also Read: ఆ డిసీజ్ తో యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కి కన్నుమూత
ఈ చర్య ఇరాన్, దాని శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చాలా అవమానకరంగా మారింది. ఇది ఇరాన్ భద్రతకు ప్రధాన బాధ్యత వహిస్తుంది. దీనికి తోడు, ఇటీవల బీరుట్‌లో మరో సీనియర్ హిజ్బుల్లా నాయకుడి మరణానికి ఇజ్రాయెల్ బాధ్యత వహించింది. దీనితో ఇరాన్, దాని సహకార గ్రూప్‌ల కోసం నషాళానికి అంటింది. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలన్నీ యుద్ధం చేయాల్సిందేనని ఇరాన్‌ను ఒత్తిడి చేస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే ఈ సంక్షోభాన్ని మరింత పెంచడానికి ఇరాన్ ఆసక్తి చూపడం లేదన్నది కూడా నిజం.
అలాగని, ఏమీ చేయకపోతే దేశం తన మద్దతుదారుల్లో ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉంది. పోనీ, చర్య తీసుకుంటే, ఉద్రిక్తతలు తీవ్రమవుతాయి. మిగిలిన గ్రూపుల ఆవేశంతో అది అదుపు తప్పే ప్రమాదం కూడా ఉంది. అందుకే, ఈ సంక్లిష్టతలతో సంబంధం లేకుండా, ఇరాన్‌లో ప్రతీకార ప్రకటనలు మాత్రం బలంగా నడుస్తున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు, అయతుల్లా అలీ ఖమేనీ.. హనియే హత్యను ఇరాన్‌లో సంఘర్షణను పెంచడానికి ఒక రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు. హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం ఇరాన్ విధి అని పేర్కొన్నారు.
సెక్యూరిటీ అనాలసిస్ గ్రూప్ అయిన ఆక్సియోస్ ప్రకారం.. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అదే స్థాయిలో ఇరాన్ ప్రతీకార చర్య ఉంటుందని అమెరికన్ అధికారులు భావిస్తున్నారు. సిరియాలో వైమానిక దాడి చేసి ఇరాన్ టాప్ జనరల్‌ను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ తన గడ్డపై నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటి సారి. కానీ అది పరిమిత ప్రతిస్పందన. కానీ, ఇప్పుడు హనియే హత్య భిన్నంగా ఉంది. శక్తివంతమైన IRGC రక్షణలో ఉన్న హనియె హత్య ఇరాన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనికి ప్రతిస్పందించినా.. మౌనంగా ఉన్నా దాని ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుందని ఇరాన్‌కు తెలుసు. అయితే, ఇరాన్ పరిధి చాలా పెద్దది. ఇది లెబనాన్‌లోని హిజ్బుల్లాతో కలిసి దాడికి దిగుతుంది. అది మిడిల్ ఈస్ట్‌లో మరింత ఘెరమైన పరిస్థితులకు దారితీస్తుంది.
ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధమే అనివార్యమైతే.. అది భారతదేశంపై ప్రభావం చూపిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాల వ్యవహారంలో ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేగాక, 9 మిలియన్ల మంది భారతీయులు మిడిల్ ఈస్ట్‌లో ఉంటున్నారు. అలాగే, వాణిజ్య సంబంధాలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలతో ఈ ప్రాంతంతో లోతైన సంబంధాలు ఉండటం వల్ల భారతదేశం ఒక ప్రేక్షకుడిలా ఉండలేని పరిస్థితి.
ఇంధనం కొనుగోలును కాస్త మార్చుకున్నప్పటికీ భారత్ తన చమురు దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడటం కొనసాగిస్తోంది. భారత్ చమురు అవసరాలలో 50% కంటే ఎక్కువ వాటా మిడిల్ ఈస్ట్‌లోనే ఉంది. కాగా యుద్ధం కారణంగా సరఫరా గొలుసుల్లో అంతరాయాలు ధరలను విపరీతంగా పెంచుతాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అస్థిర పరిస్థితులు దిగుమతి ఖర్చులను పెంచుతాయి. దీనితో, ఆర్థిక వృద్ధి తగ్గుతుంది. అలాగే, ద్రవ్యోల్బణ ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉంది. తద్వారా భారత్ ఇంధన భద్రత బలహీనపడుతుంది.