గత రెండు రోజులుగా యువత ఆందోళనలతో నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగాయి. సర్కారు తీరుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి దూసుకొచ్చారు. ప్రభుత్వం ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా తమ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు విధించిన నిరవధిక కర్ఫ్యూను కాదని ప్రదర్శనలకు దిగారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఏకంగా 19 మంది చనిపోయారు. 250 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కేపీ ఓలీ శర్మ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లపై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటిచింది. ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది.
ఈ నెల 4న ఇటీవల ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, రెడ్డిట్, యూట్యూబ్, స్పాప్ చాట్ సహా సుమారు 25కు పైగా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను నిషేధించింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అనుమతులు తీసుకున్న తర్వాత యథావిధిగా మళ్లీ ఆయా యాప్ లు పని చేస్తాయని ప్రకటించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యువత రోడ్లెక్కారు. కాలేజీలు, స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. పార్లమెంటును ముట్టడించడానికి ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఆ తర్వాత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో పలువురు చనిపోగా, మరికొంత మంది గాయపడ్డారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. వాస్తవానికి నేపాల్ లో చెలరేగిన ఆందోళనలు కేవలం సోషల్ మీడియా కోసం మాత్రమే కాదు. ఓలీ ప్రభుత్వం అవినీతిని నిరసిస్తూ ఈ ఆందోళనలకు కొనసాగాయి. ఇప్పటికే ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ రాజీనామా చేశారు.
నిజానికి తాజాగా జరిగిన నిరసనల్లో జెడ్ జెన్(1997-2012 మధ్యలో పుట్టిన యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఒక్కసారిగా సోషల్ మీడియా యాప్ లు బ్యాన్ కావడంతో వారంతా అయోమయానికి గురయ్యారు. సోషల్ మీడియా నిషేధం వ్యవహారం కాస్త ఓలీ ప్రభుత్వం అవినీతి వైపు మళ్లింది. 2008లో నేపాల్ లో రాచరికం పోగా అప్పటి నుంచి కేపీ ఓలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పటికి ఆయన నాలుగుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయిందంటూ ఆందోళన బాటపడ్డారు. “షేధించాల్సింది అవినీతిని… సోషల్ మీడియాను కాదు” అంటూ యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులకు దిగారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, రవాణా వ్యవస్థ మూసివేయబడింది. ఖాట్మండులో ఆందోళనలు, నిరసనలు, సమావేశాలు నిరవధికంగా నిషేధించబడ్డాయి. తాజాగా సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా.. సరే పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఓలీ ప్రభుత్వంపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
Read Also: బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!