అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు పేరుతో ఒక డేంజర్ గేమ్ మొదలు పెట్టారు. డేంజర్ గేమ్ అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే ఈ నిర్ణయానికి త్వరలో సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ట్రంప్ నిర్ణయాలను కొట్టిపారేసి, సుంకాలు చట్ట విరుద్ధం అని చెబితే మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద కుదుపు అవుతుంది. అవును, ఇది నిజం. ఒకవేళ సుప్రీంకోర్టు ట్రంప్ కి మొట్టికాయలు వేసి, సుంకాల పెంపు నిర్ణయం తప్పు అని తీర్పునిస్తే మాత్రం అప్పటి వరకూ వివిధ దేశాల వద్ద వసూలు చేసిన సుంకాలను ట్రంప్ ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లింపులు అమెరికా ఖజానా నుంచే ఉంటాయి. అందుకే ఇప్పుడు ట్రంప్ టీమ్ లోని అధికారులు కలవరపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందోనని వారిలో టెన్షన్ మొదలైంది. ఏది ఏమైనా తీర్పు తమకి అనుకూలంగా వస్తుందని అంటున్నారు ట్రెజరీ కార్యదర్శి బెసెంట్. సుప్రీంకోర్టులో ట్రంప్ కేసు గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కోర్టు మొట్టికాయలు..
ట్రంప్ ప్రతీకార సుంకాలపై ఇప్పటికే యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మొట్టికాయలు వేసింది. ట్రంప్ తన అధ్యక్ష అధికారాన్ని అతిక్రమించాడని కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే అప్పీల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోడానికి అవకాశం దొరికింది. అప్పీల్ కోర్టు తీర్పుని అక్టోబర్ 14 వరకు అమలు చేయకుండా నిలిపివేసే వెసులుబాటు కూడా ఉండటంతో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు సుంకాలు వసూలు చేసుకోవచ్చు. చివరిగా సుప్రీం తీర్పుతో అసలు వ్యవహారం తేలిపోతుంది. నవంబర్ ప్రారంభంలో సుప్రీంకోర్టు ట్రంప్ అప్పీల్ పై వాదనలు వింటుంది. ఆ తర్వాత వివాదాస్పద సుంకాల చట్టబద్ధతపై తుది నిర్ణయం తెలియజేస్తుంది.
అదే జరిగితే..
ఒకవేళ సుప్రీం కోర్టు ట్రంప్ సుంకాలను రద్దు చేస్తే భారీగా ఖజానాపై భారం పడుతుందని ట్రెజరీ కార్యదర్శి బెసెంట్ అంటున్నారు. కోర్టు నిర్ణయానికంటే ముందే ట్రంప్ విధించే సుంకాల ప్రభావం దాదాపు 70 శాతం అమెరికా దిగుమతులను ప్రభావితం చేస్తుంది. జూన్ 2026 వరకు సుప్రీంకోర్టు తీర్పు ఆలస్యం అయితే, దాదాపు 750 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల వరకు సుంకాలు వసూలైపోయి ఉంటాయి. ఒకవేళ కోర్టు తీర్పు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే, ఆ సుంకాలలో ఎక్కువ శాతం రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అప్పటి వరకు సుంకాలు చెల్లించిన వ్యాపార సంస్థలకు అది ఊహించని లాభం అవుతుంది. సో.. భారతీయ ఎగుమతి దారులకు మరొక ఆప్షన్ మిగిలే ఉంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ట్రంప్ నిర్ణయం అమలవుతుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తే, సుంకాలు కట్టిన కంపెనీలన్నీ రీఫండ్ లు పొందుతాయి.
ప్లాన్ -బి
సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని బెసెంట్ వంటి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.. వారు ప్లాన్-బి ని సిద్ధం చేసుకుంటున్నారు. ట్రంప్ సుంకాలను సుప్రీంకోర్టు నిరోధిస్తే.. ట్రంప్ కి ఉన్న ఇతర చట్టపరమైన అధికారాలను వారు అంచనా వేస్తున్నారు. సెక్షన్ 232 లేదా సెక్టార్ నిబంధనల ప్రకారం సుంకాలను అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా వాణిజ్య విస్తరణ చట్టం 1962 లోని సెక్షన్ 232 ప్రకారం జాతీయ భద్రతకు అంతగా ముప్పు కలిగించని విధంగా సుంకాలను అమలు చేయడానికి అధ్యక్షుడికి అనుమతి ఇస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ట్రంప్ కి వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ముందుకెళ్లాలని అనుకుంటున్నారు అధికారులు.