అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఓ యువకుడు ఏకంగా తన ఫ్రెండ్ ను దారుణంగా చంపేశాడు. వేగంగా వస్తున్న రైలు కిందికి తోసి హత్య చేశాడు. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు అనుమానం కలగడంతో లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో అసలు విషయం బయటకు రావడంతో అందరూ షాకయ్యారు.
చిత్రదుర్గకు చెందిన పునీత్, ప్రతాప్ ఇద్దరూ ఫ్రెండ్స్. బయ్యప్పనహళ్లిలో పేయింగ్ గెస్ట్ హాస్టల్ లో ఉంటున్నారు. వీరిద్దరితో కలిసి విజయపురకు చెందిన ఇస్మాయిల్ పటవేగర్ కూడా ఉంటున్నాడు. ఈ ముగ్గురూ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. పునీత్ రీసెంట్ గా తన స్నహితురాలిని ఇస్మాయిల్ కు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ ఆమె నెంబర్ తీసుకుని, తరచుగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఈ విషయం పునీత్ కు తెలిసింది. ఇస్మాయెల్ ను ఈ విషయం గురించి నిలదీశాడు. ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ ముగ్గురూ రాత్రిపూట మద్యం తాగి రైల్వే ట్రాక్ దగ్గర గొడవపడ్డారు. పునీత్, ప్రతాప్.. ఇస్మాయిల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వస్తున్న రైలు ముందుకు ఇస్మాయిల్ ను తోసేశాడు పునీత్. రైలు తాకిడికి ముక్కలు ముక్కలయ్యాడు. ఈ ఘటన బయ్యప్పనహళ్లి రైల్వే పోలీసు పరిధిలోని దొడ్డనేకుండి సమీపంలో జరిగింది.
ఇస్మాయిల్ స్పాట్ లోనే చనిపోవడంతో హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు పునీత్, ప్రతాప్. ఇద్దరూ అతడి మృతదేహాన్ని పట్టాల మీద పడేశారు. ఉదయం రైల్వే సిబ్బంది పట్టాల మీద మృతదేహం పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వాళ్లు జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఇది ఆత్మహత్యకాదని అనుమానించారు. అంతకాదు, పట్టాల నుంచి సుమారు 10 అడుగుల దూరంలో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో పోలీసులు నిందితుడి సెల్ ఫోన్ డేటా పరిశీలించారు. ఇస్మాయిల్ చివరి ఫోన్ కాల్ నిందితులలో ఒకరికి చేసినట్లుగా తేలింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు కథ బయటపడింది. పునీత్ నేరాన్ని అంగీకరించాడు. ఇస్మాయిల్ తన స్నేహితురాలితో మాట్లాడటం తట్టుకోలేక ఈ పని చేసినట్లు వెల్లడించాడు. సోషల్ మీడియా రీల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఇస్మాయిల్ ను రైలు ఢీకొట్టిందని అధికారులకు చెప్పడానికి తాను, ప్రతాప్ ఒక స్టోరీని క్రియేట్ చేసినట్లు చెప్పాడు.
అటు గతంలోనూ ఇస్మాయిల్ ను చంపేందుకు పునీత్, ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని అంశాలను నిందితుల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మరో నిందితుడు ప్రతాప్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందం అతడి కోసం గాలిస్తోంది. త్వరలోనే రెండో నిందుతుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Also: బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!