Pakistan fails to pay Hotel Bills: పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇరకాటంలో పడేసింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, ఇస్లామాబాద్‌లోని విలాసవంతమైన సెరెనా హోటల్ (Serena Hotel) వేదికగా పాక్ ప్రభుత్వం చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే, దాదాపు 21 గంటల పాటు సాగిన ఈ అత్యున్నత స్థాయి చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే. ఆ హోటల్ బిల్లును చెల్లించలేక పాక్ ప్రభుత్వం చేతులెత్తేసిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి పాకిస్థాన్ ప్రభుత్వం సెరెనా హోటల్‌లో బస, విందు ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రతినిధుల స్థాయికి తగ్గట్టుగా భారీ ఎత్తున భద్రత, ఇతర వసతులు కల్పించారు. కానీ, చర్చలు ముగిసిన తర్వాత హోటల్ యాజమాన్యం సమర్పించిన భారీ బిల్లును చూసి పాక్ విదేశీ వ్యవహారాల శాఖ విస్తుపోయిందని సమాచారం. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న పాకిస్థాన్ ఖజానాలో ఈ బిల్లులు కట్టడానికి కూడా నిధులు లేకపోవడంతో, చెల్లింపుల విషయంలో హోటల్ యాజమాన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హోటల్ బిల్లుల చెల్లింపు విషయంలో పరిస్థితి చేయి దాటిపోయింది. చివరకు హోటల్ యాజమాన్యానికి అనుబంధంగా ఉన్న ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రతినిధులు జోక్యం చేసుకుని, ఆ ఖర్చులను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు పాకిస్థాన్ పరువు గంగలో కలిసిన ఈ ఘటనపై దౌత్య వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. “దౌత్యపరమైన విజయం అని చెప్పుకుంటున్న దేశం, కనీసం హోటల్ బిల్లు కూడా కట్టలేకపోవడం విడ్డూరం.” అని ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యాఖ్యానించడం పాక్ దుస్థితికి అద్దం పడుతోంది.
ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిబంధనల కింద నలుగుతున్న పాకిస్థాన్, దేశంలో ద్రవ్యోల్బణం 7 నుంచి 9 శాతం వరకు ఉన్నా.. ఇటువంటి ఆడంబరాలకు పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య శాంతి దూతగా తనను తాను నిరూపించుకోవాలని పాక్ చేసిన ప్రయత్నం, కనీస నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించలేక ఆగిపోయింది. ఇది కేవలం ఒక బిల్లు పెండింగ్ అంశం మాత్రమే కాదని, ఒక దేశం యొక్క పరిపాలనా మరియు ఆర్థిక వైఫల్యానికి చిహ్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటన పాకిస్థాన్ విశ్వసనీయతను అంతర్జాతీయ సమాజంలో మరింత తగ్గించింది.
సెరెనా హోటల్ వంటి ప్రతిష్టాత్మక వేదికను ఎంచుకోవడం ద్వారా పాక్ తన సామర్థ్యాన్ని చాటుకోవాలని చూసింది. అయితే.. ఆర్థిక సంక్షోభం ఎంతలా వేధిస్తోందంటే, ఒక అంతర్జాతీయ ఈవెంట్‌ను నిర్వహించే కనీస సోకు కూడా ఆ దేశానికి లేదని స్పష్టమైంది.. “ప్రపంచ శాంతి కోసం చర్చలు జరిపారు సరే.. కనీసం తాము తిన్న తిండికి, ఉన్న గదికి బిల్లు కట్టలేని స్థితిలో దేశం ఉందా?” అని పాకిస్థాన్ ప్రతిపక్షాలు, విదేశీ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, ఆహార పదార్థాల ధరలతో అల్లాడుతున్న పాక్ ప్రజలు, ప్రభుత్వం ఇలాంటి అనవసరపు ఆడంబరాలకు పోయి అప్పులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి కోసం ప్రయత్నించి, చివరకు తన ‘శాంతి’ని హోటల్ బిల్లు రూపంలో పోగొట్టుకుంది పాకిస్థాన్.
Read Also: హర్మూజ్ గుండా భారత్ నౌకలకు అనుమతి.. ఇరాన్ రాయబారి కీలక ప్రకటన