Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. శనివారం రాత్రి ఉక్రెయిన్ దళాలు ఏకంగా 1,000కి పైగా డ్రోన్లతో రష్యా భూభాగంపై విరుచుకుపడ్డాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశ రాజధాని మాస్కో లక్ష్యంగా ఈ స్థాయిలో గగనతల దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రధాన భవనాలపై డ్రోన్లు..
ఈ భీకర దాడుల్లో ముఖ్యంగా మాస్కోలోని ఆయిల్ రిఫైనరీకి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో అక్కడి ప్రాంగణంలో పెద్దఎత్తున మంటలు చెలరేగి, ఆకాశాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. రష్యా మేయర్ ఈ దాడి తీవ్రతను ధ్రువీకరిస్తూ, తమ రక్షణ దళాలు మరో 450 ఉక్రెయిన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు తెలిపారు. అయినప్పటికీ, కొన్ని డ్రోన్లు మాస్కోలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంతో పాటు నాలుగు ప్రధాన భవనాలను నేరుగా తాకాయని అధికారులు వెల్లడించారు.
క్రిమియా ద్వీపకల్పంపైకి ..
మరోవైపు ఉక్రెయిన్ తన దాడులను కేవలం మాస్కోకే పరిమితం చేయకుండా క్రిమియా ద్వీపకల్పంపైకి కూడా విస్తరించింది. రష్యా సైనిక సరఫరా మార్గాలను, విద్యుత్ వ్యవస్థలను దెబ్బతీసే వ్యూహంతో ఈ దాడులు నిర్వహించింది. ఈ ఆకస్మిక విమాన దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనేక విమానాలు రద్దు కాగా, మరికొన్ని తీవ్రంగా ఆలస్యమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్యాలో త్వరలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పందన..
ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాస్కోలోని శత్రువుల కీలక సైనిక, ఆర్థిక స్థావరాలను మా దళాలు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి. రష్యాకు చెందిన ఒక ప్రాధాన్య చమురు కర్మాగారాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన మా భద్రతా దళాలు, గూఢచార విభాగం, ప్రత్యేక బలగాల ధైర్యసాహసాలకు ధన్యవాదాలు. రష్యా ఇప్పటికైనా ఈ దాడుల తీవ్రతను గ్రహించి, యుద్ధానికి స్వస్తి చెప్పి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!