Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 100 శాతం వరకు సుంకాలను విధించేందుకు వీలు కల్పించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రిపబ్లికన్ల ఆధిక్యత కలిగిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ బిల్లును 262-159 ఓట్ల మెజారిటీతో ఆమోదించిన రెండు రోజుల వ్యవధిలోనే ట్రంప్ దీనికి ఆమోదముద్ర వేశారు. ఈ పరిణామంతో భారత్, చైనాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఏర్పడింది.
ఈ చట్టానికి లెండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ (Lindsey O Graham Sanctioning Russia and Iran Act of 2026) అని నామకరణం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పోరాడిన సెనెటర్ లెండ్సే గ్రాహం గుర్తుగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు. గ్రాహం ఈ ఏడాది జూలైలో కీవ్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన కొద్దిరోజులకే కన్నుమూశారు. దీంతో ఆయన జ్ఞాపకార్థం ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా ఈ బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రకారం.. రష్యన్ వస్తువులపై 500 శాతం వరకు సుంకాలు విధించే వెసులుబాటు కలగనుంది. అలాగే రష్యా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు సుంకాలు మోపేందుకు అధ్యక్షుడికి అధికారం లభించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఆ దేశ అత్యున్నత ప్రభుత్వ అధికారులపై కూడా ఆంక్షలు విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.
ఈ ఆంక్షల చట్టం అమల్లోకి రావడంతో భారత్‌కు మరో కొత్త టారిఫ్ ముప్పు వచ్చినట్లైంది. ఇప్పటికే డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు స్టెనీ హోయర్.. భారత్, చైనాతో పాటు యూఏఈ, తుర్కియే, సింగపూర్, అజర్ బైజాన్, కజకిస్తాన్, హంగేరీ, కిర్గిజిస్తాన్, స్లోవేకియా వంటి 10 దేశాలు.. 100% టారిఫ్‌ల పరిధిలోకి తెచ్చేందుకు అర్హమైనవిగా పేర్కొన్నారు. అయితే ఈ బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేరుగా భారత్‌పై 100 శాతం పన్ను పడదు. అధ్యక్షుడు ట్రంప్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సుంకాలు విధించాలని నిర్ణయించుకుంటేనే ఇది అమలవుతుంది.
ఒకవేళ ట్రంప్ ఈ 100 శాతం సుంకాన్ని భారత్ పై అమలు చేయాలని భావిస్తే.. ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. భారత్ ఇప్పటికే ఎదుర్కొంటున్న 10 శాతం అదనపు పన్నుకు ఇది తోడుకానుంది. వాస్తవానికి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గతంలోనే ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్, మరో 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్ విధించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అదనపు టారిఫ్‌ను తొలగించి రెసిప్రోకల్ టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించారు.
అమెరికా కాంగ్రెస్‌లో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే భారత్ స్పందిస్తూ తన వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను కాపాడటానికి భారత్ కట్టుబడి ఉంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ మార్గాల ద్వారా ఇంధన సేకరణను కొనసాగిస్తాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అలాగే, రష్యాతో చమురు వాణిజ్యంపై అమెరికా ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించామని ఇది ఇరుదేశాల సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ఎలా ప్రభావం చూపుతుందో అమెరికాకు స్పష్టంగా వివరించినట్లు వెల్లడించింది.
Also Read: ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!
మరోవైపు రష్యా ఆంక్షల బిల్లుకు ఎక్కువమంది రిపబ్లికన్ ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చినప్పటికీ లోపాయికారీగా కొందరు నేతలు ఈ సుంకాల అధికారాలను ఉపసంహరించుకోవాలని తమ నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధిస్తే.. ఆ ప్రభావం అమెరికాపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనాలు వచ్చాయి. అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమవుతాయని వారు హెచ్చరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య.. నెట్టింట ఇంటర్వ్యూ క్లిప్ వైరల్.. యాంకరే హత్యకు పురిగొల్పిందా?