మానవాళికి మరో ముప్పు పొంచి ఉంది. అది ఇంకెవరితోనో కాదు, మనతో మనకే ఉన్న ముప్పు. అవును, పెళ్లి-సంతానం విషయంలో మనుషుల ఆలోచనా ధోరణిలో వస్తున్న విపరీత మార్పులే దీనికి కారణం. భారత్ లో పర్లేదు కానీ.. ఇతర దేశాలు అల్ప జనాభాతో కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో జనాభా నియంత్రణకు ఆయా దేశాలు తీసుకున్న చర్యలే దీనికి ప్రధాన కారణం. జపాన్, ఇటలీ, మొనాకో, చైనా వంటి దేశాలు వృద్ధ జనాభాతో నిండిపోతున్నాయి. అక్కడ పెళ్లి, పిల్లలు అనేవి యువతకు ఫస్ట్ ప్రయారిటీ ఎంతమాత్రం కావు. కెరీర్, డబ్బు అనేవాడి వెంట పరిగెడుతూ, పెళ్లి, పిల్లలు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పిల్లలు, యువత సంఖ్య దారుణంగా పడిపోయి వృద్ధుల సంఖ్యలో రికార్డుల మోత మోగిస్తున్నాయి జపాన్, ఇటలీ, చైనా. 65 ఏళ్లు నిండిన జనాభా విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది జపాన్.
🇬🇷 More than 700 schools have been closed in Greece due to a prolonged demographic crisis
Greece has one of the lowest fertility rates in the European Union – around 1.3 births per woman, far below the replacement level of 2.1.
The population is rapidly aging, while young… pic.twitter.com/WvS0RIbwWQ
— Visegrád 24 (@visegrad24) September 1, 2025
సంతానోత్పత్తి రేటు తక్కువ..
ఐస్ లాండ్, జర్మనీ, పోర్చుగల్ దేశాలు కూడా సంతానోత్పత్తి రేటులో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. దీంతో అక్కడ పిల్లలు, యువత జనాభా తక్కువగా ఉంటోంది. వృద్ధుల జనాభా రోజు రోజుకీ పెరిగిపోతోంది. యువత కూడా ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్తుండటంతో కొన్ని దేశాల్లో కేవలం వృద్ధులే కనపడుతున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న గ్రీస్ దేశం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ బడికి వెళ్లేందుకు పిల్లలు లేక బడులే మూతపడుతున్నాయి. అలాంటి విచిత్ర పరిస్థితి ఇప్పుడు గ్రీస్ లో ఉంది. గ్రీస్ తో పాటు, శాన్ మారినో, బెలారస్, బోస్నియా, హెర్జెగోవినా, అల్బేనియా, కొసావో వంటి దేశాల్లో జనాభా పెరుగుదల తిరోగమన దిశలో ఉంది.
స్కూల్స్ మూసివేత..
దీర్ఘకాలిక జనాభా సంక్షోభం కారణంగా గ్రీస్‌లో 700 కి పైగా పాఠశాలలను మూసివేశారు. యూరోపియన్ యూనియన్‌లో గ్రీస్ అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉంది. ప్రతి మహిళకు సగటున 1.3 జననాలు అక్కడ నమోదవుతున్నాయి. అయితే గ్రీస్ జనాభా స్థిరీకరణ రేటు దీనికంటే చాలా ఎక్కువ. అక్కడ జనాభా స్థిరీకరణ రేటు 2.1 గా ఉంది. అంటే ప్రతి మహిళ సగటున 2.1 పిల్లలను కని పోషిస్తేనే గ్రీస్ జనాభా స్థిరంగా ఉంటుంది. కానీ జననాల రేటు కేవలం 1.3 గా ఉండటంతో చిన్నారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎంతగా అంటే ఏకంగా స్కూల్స్ మూసివేసేంతలా. గ్రీస్ లో స్కూల్స్ నిర్వహించాలంటే కనీసం అందులో 15మంది విద్యార్థులు ఉండాలి. కానీ 2025–2026 విద్యా సంవత్సరానికి చాలా స్కూల్స్ లో అలాంటి పరిస్థితులు లేవు. దీంతో ఏకంగా 721 పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది.
వృద్ధుల జనాభా అధికం..
పుట్టుకలు లేకపోవడం, జీవన ప్రమాణాలు మెరుగై సగటు జీవిత కాలం పెరగడంతో గ్రీస్ లో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు ఉపాధి అవకాశాల కోసం యువకులు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్లిపోతున్నారు. దీంతో అటు పిల్లలు లేక, ఇటు యువత లేక గ్రీస్ వృద్ధులతో సతమతం అవుతోంది. ఒక్క గ్రీస్ విషయంలోనే కాదు, ఇలాంటి పరిస్థితికి చేరువవుతున్న మిగతా దేశాల పరిస్థితి కూడా భవిష్యత్ లో ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు భారత్ కి ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు కానీ, జనాభా విషయంలో ఇప్పుడే ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోకపోతే, జననాల రేటు ఇలాకే తక్కువగా ఉంటే.. రాబోయే రోజుల్లో భారత్ లో కూడా పిల్లలు, యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది.