అమెరికాలో రాజ్యం, చర్చ్ వేర్వేరుగా ఉంటాయి. అంటే అమెరికాకి అధికారిక మతం అంటూ ఏదీ లేదు. అమెరికా రాజ్యాగంలోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. పలు సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఇదే విషయాన్ని ఉటంకించాయి. అయితే తాజాగా అమెరికాను క్రైస్తవ దేశమని పేర్కొంటూ టెక్సాస్ రిపబ్లికన్ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ పేర్కొనడం సంచలనంగా మారింది. అదే సమయంలో ఆయన హిందూమతంపై విషం కక్కడాన్ని ప్రపంచంలోని హిందువులంతా ముక్త కంఠంతో ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
Hello @TexasGOP, will you be disciplining your senate candidate from your party who openly contravenes your own guidelines against discrimination—displaying some pretty sordid anti-Hindu hate—not to mention disrespect for the 1st Amendment’s Establishment Clause? https://t.co/5LItlu7Zu2 pic.twitter.com/oqZkZozUBR
— Hindu American Foundation (@HinduAmerican) September 22, 2025
హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు..
టెక్సాస్ రిపబ్లికన్ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. షుగర్ ల్యాండ్‌లోని 90 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని కించపరుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షుగర్ ల్యాండ్ పట్టణంలో అష్టలక్ష్మీ దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం ఆవరణలో గతేడాది 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికి నిత్యపూజలు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద క్రేన్ లలో భక్తులు ఎక్కి హనుమంతుడికి సమీపంగా వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ తతంగమంతా అక్కడివారికి కాస్త కొత్తగా ఉంది. అయినా సరే హిందూ సంప్రదాయాలను అక్కడి స్థానికులు గౌరవిస్తున్నారు. టెక్సాస్ రిపబ్లికన్ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. అమెరికా క్రైస్తవ దేశమని, అలాంటి తమ దేశంలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఎందుకంటూ ప్రశ్నించారు. ఆ విగ్రహ నిర్మాణాన్ని ఆయన వ్యతిరేకించారు. అంతే కాదు, స్థానికుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
క్రైస్తవ దేశం..!
షుగర్ ల్యాంగ్ లోని హనుమంతుడి విగ్రహాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ డంకన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బైబిల్ లో ఉన్న కొన్ని వాక్యాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “నేను తప్ప నీకు వేరే దేవుళ్ళు ఉండకూడదు. పైన ఆకాశమందుగాని, క్రింద భూమియందుగాని, భూమిక్రిందనున్న నీళ్ళయందుగాని యుండు ఏ రూపమునైనను నీవు విగ్రహముగా చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు” అని నిర్గమకాండము 20:3-4 పేర్కొంటున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. “ప్రజలు సృష్టికర్తగా ఉన్న దేవుని సత్యాన్ని వదిలేసి, సృష్టిని పూజించి సేవించడం ద్వారా ఆయనను మోసగించారు.” అంటూ రోమీయులు 1:25 వాక్యాన్ని కూడా ఉటంకించారు.
విమర్శలు..
డంకన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF).. ఆయన్ని హిందూ వ్యతిరేకిగా అభివర్ణిస్తూ విమర్శించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదు చేసింది. టెక్సాస్ ప్రభుత్వాన్ని కోట్ చేస్తూ సోషల్ మీడియాలో HAF కొన్ని పోస్ట్ లను ఉంచింది. వివక్షకు వ్యతిరేకంగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న మార్గదర్శకాలను ఆయన బహిరంగంగా ఉల్లంఘించారని, ఆయన్ను మీరు క్రమశిక్షణలో పెడతారా అని ప్రశ్నించింది.
అమెరికా రాజ్యాంగం ఏం చెప్పింది..?
అమెరికా రాజ్యాంగం ఆ దేశాన్ని ఏ మతానికి పరిమితం చేయలేదు. పౌరులందరికీ మత స్వేచ్ఛను ప్రసాదించింది. ఏదైనా ఒక మతాన్ని అనుసరించేవారు ఇతరులకు హాని కలిగించకుండా, ఇతర మతాలను అణచివేయకుండా ప్రవర్తిస్తున్నట్టయితే.. వారి మతం US రాజ్యాంగం ప్రకారం రక్షించబడుతుంది. ఇలాంటి ఉదాహరణలన్నిటితో డంకన్ ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో హిందూ సంఘాలు పెద్ద ఉద్యమమే మొదలు పెట్టాయి. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.