Iran protests: నిరసనల జ్వాలలతో ఇరాన్ అట్టుడుకుతోంది. అయితే ప్రధానంగా రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి అదుపు తప్పింది. డిసెంబర్ 28 నుండి ప్రారంభమైన ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. ఆర్థిక సమస్యలపై మొదలైన ఈ నిరసనలు, ఇప్పుడు అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా రూపాంతరం చెందాయి.
నిరసనల జ్వాలలతో అట్టుడుకుతున్న ఇరాన్ రాజధాని టెహ్రాన్
భద్రతా దళాలకీ, నిరసనకారులకీ మధ్య ఘర్షణల్లో ఇప్పటి వరకు 45 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. గత 12 రోజులుగా సాగుతున్న నిరసనలు తాజాగా హింసాత్మకంగా మారాయి. అదుపుతప్పిన ఆందోళనలతో టెహ్రాన్ వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం కావడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. టెహ్రాన్‌తో పాటు దేశంలోని దాదాపు 31 ప్రావిన్స్‌లలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. డెత్ టు ఖమేనీ, డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఇరాన్‌లో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు బంద్
దశాబ్దాలుగా గూడుకట్టుకున్న అసహనం ఒక్కసారిగా లావాగా పేలింది. నిన్నటి వరకు ఆకలి కేకలకు అల్లాడిన ప్రజలు.. ఈరోజు విప్లవ నినాదాలు చేస్తున్నారు. టెహ్రాన్ వీధుల్లో ఏం జరుగుతుందో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. భద్రతా దళాలు ఒకవైపు.. వేలాది మంది ప్రజలు మరోవైపు కనిపిస్తున్నారు. గాలిలో భాష్పవాయువు ఘాటు.. చెవుల్లో తూటాల శబ్దం.. ఎటు చూసినా మంటలు, రక్తపు మరకలే కనిపిస్తున్నాయి.ప్రపంచం నుంచి ఇరాన్‌ను వేరు చేసేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించారు.దీంతో ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.
టెహ్రాన్‌కు విమాన రాకపోకలు రద్దు
టెహ్రాన్‌లోని చారిత్రాత్మక గ్రాండ్ బజార్‌లో నిరసనకారులు భారీ ప్రదర్శనలు చేపట్టారు. భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. టెహ్రానతో పాటు ఇతర నగరాల్లో సుమారు 2,000 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రన్‌వేను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.టెహ్రాన్‌కు విమాన రాకపోకలు రద్దయ్యాయి.
అసలు ఈ ప్రజాగ్రహానికి ప్రధానం కారణం చూస్తే…
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, ద్రవ్యోల్బణం 42.5 శాతానికి పెరగడమే. దీంతో సామాన్య ప్రజలు నిత్యావసరాలు కొనలేని స్థితికి చేరుకున్నారు. ముల్లాలు దిగిపోవాలి, సర్వాధికారికి మరణం అంటూ ప్రజలు వీధుల్లో నినదిస్తున్నారు.
Also Read: రష్యా చమురు కొంటే అంతే.. భారత్ పై 500 శాతం సుంకాలు.. ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. నిరసనకారులపై హింస కొనసాగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అటు ఐక్యరాజ్యసమితి కూడా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది.భారత విదేశాంగ శాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప టెహ్రాన్ వెళ్లవద్దని, అక్కడ ఉన్న భారతీయులు ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది.