Saudi Arabia: సౌదీ అరేబియాకు పంట పడింది. ఇప్పటికే తరగని చమురు ఉండగా ఇప్పుడు యురేనియం వంతైంది. మదీనాలోని పర్వత ప్రాంతాల్లో భారీ ఎత్తున యురేనియం నిల్వలు బయట పడినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా స్వయంగా ప్రకటించింది. దాదాపు 110 మిలియన్ టన్నుల ఖనిజం ఉన్నట్లు ఓ అంచనా. దీంతో సౌదీ పంట పండినట్టే.
కాలం కలిసిరావడమంటే ఇదేనేమో. ఏళ్లుగా తరగని చమురు సంపద సౌదీ సొంతం. ఇప్పుడు యురేనియం కూడా తోడైంది. మదీనా ఏరియాలోని సమీప పర్వత ప్రాంతాల్లో భారీగా యురేనియం నిక్షేపాలను కనుగొన్నాడు అక్కడి అధికారులు. సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకారం.. మదీనాలోని జబల్ సయ్యద్ ప్రాజెక్టులో నిర్వహించిన భూగర్భ సర్వేలో సుమారు 110 మిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. అందులో అరుదైన ఖనిజాలతోపాటు యురేనియం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అరబ్ న్యూస్ ప్రస్తావించింది.
యురేనియం, అరుదైన ఖనిజాల ఆవిష్కరణకు సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. ప్రపంచంలోని చమురు ఉత్పాదక దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా మైనింగ్, పునరుత్పాదక ఇంధనం, అణు విద్యుత్ వంటి రంగాలలో పెట్టుబడులు పెంచుతోంది. ఈ క్రమంలో దేశీయ యురేనియం వనరులను అన్వేషిస్తోంది. పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ సమయంలో మదీనాలో యురేనియం నిల్వలు ఉన్నాయన్న వార్త, అక్కడి పాలకుల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.
అణు విద్యుత్ రంగానికి సంబంధించి సహకారం గురించి అమెరికా- సౌదీ అరేబియా మధ్య ఒప్పందాలు జరిగాయి. అణు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం కీలకమైన ముడి సరుకు. దీని నుంచి నేరుగా అణు ఇంధనం ఉత్పత్తి కాదు. అవసరాన్ని బట్టి అనేక దశల ప్రాసెసింగ్ ప్రక్రియ అవసరం. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు యురేనియం అరుదైనవిగా పరిగణిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పవన శక్తి, రక్షణ పరికరాలు, హై టెక్ పరిశ్రమలలో దీన్ని వినియోగం ఉంటుంది. మదీనా ప్రాంతంలో కనుగొన్న వనరులను వాణిజ్యపరంగా వెలికి తీయవచ్చని రుజువైతే సౌదీ అరేబియా ఇంధన భద్రతకే కాదు, ఖనిజ-పారిశ్రామిక వ్యూహానికి కేంద్ర బిందువుగా మారనుంది.
ALSO READ: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో మదీనా ఒకటి. ప్రవక్త ముహమ్మద్ క్రీ.శ. 622లో మక్కా నుండి మదీనాకు వలస వెళ్లారు. ఆ తర్వాత మదీనా తొలి ఇస్లామిక్ సమాజానికి ప్రధాన కేంద్రం అయ్యింది. ఈ ప్రాంతం ఇప్పుడు ముఖ్యమైన ఖనిజ వనరులను కనుగొనడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. భద్రత-అణు కార్యక్రమాలపై మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమైన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాంతీయ అధికార సమతుల్యత సాధించడంలో సౌదీ కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తానికి చమురు మాదిరిగా యురేనియం నిల్వలకు కేరాఫ్‌గా సౌదీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.