Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రెండేళ్ల ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక చిట్ చాట్‌లో ఆయన పార్టీ పరిస్థితులు, ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణపై తన అభిప్రాయాలను బల్లగుద్ది చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న వేవ్‌లెంగ్త్ మ్యాచ్ కావడం వల్లే చిన్న చిన్న సమస్యలను కూడా అత్యంత సులువుగా అధిగమించగలిగామని, ఇద్దరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
పాలనలో ముద్ర.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
గాంధీభవన్‌లో మంత్రుల ‘ముఖాముఖి’ కార్యక్రమాన్ని ప్రారంభించడం తన హయాంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రులే స్వయంగా గాంధీభవన్‌కు వచ్చి నిత్యం ప్రజా సమస్యలు వినడం గతంలో ఎన్నడూ జరగలేదని, ప్రజల నుంచి వచ్చిన వినతులను తానే స్వయంగా నోట్ చేసుకుని పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పారు. సైంటిఫిక్ పద్ధతిలో కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా దేశంలోనే తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించిందని, ఒక రెడ్డి బిడ్డ అయిన రేవంత్ రెడ్డి ఈ సర్వేను ఎంతో సమర్థవంతంగా నిర్వహించగా, ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ మాత్రం కేంద్రంలో కుల సర్వేను తొక్కిపెట్టారని మండిపడ్డారు.
పార్టీ క్రమశిక్షణ, కార్యకర్తల సంక్షేమమే పరమావధి
ఏఐసీసీ ర్యాంకింగ్స్‌లో గతంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ, తన నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరిందని పీసీసీ చీఫ్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, జిల్లాల పర్యటనల ద్వారా కాంగ్రెస్ అంటే కేవలం గాంధీభవన్ మాత్రమే కాదని నిరూపించామన్నారు. అయితే పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హైకమాండ్ గట్టి సంకేతాలు ఇచ్చిందని హెచ్చరించారు. డీసీసీల అధికారాలను పునరుద్ధరించామని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డీసీసీల వద్దే పేర్లు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి వేగవంతం.. ప్రతిపక్షాల వైఫల్యం
గత కేసీఆర్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పేదలకు తీవ్ర ద్రోహం చేసిందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. దార్శనికత కలిగిన నాయకుడైన రేవంత్ రెడ్డి ఆధునిక సదుపాయాలతో ‘ఫోర్త్ సిటీ’ని తీర్చిదిద్దుతుంటే బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా రాకతో నాయకుల గుండెల్లో రైళ్లు..
హైడ్రా రాకతో చెరువులను కబ్జా చేసిన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఆక్రమణల నుంచి చెరువులను కాపాడటంలో హైడ్రా విజయవంతమైందని సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ చేస్తానని, కేబినెట్‌లో ఐదుగురు బీసీలకు స్థానం కల్పించాలని హైకమాండ్‌ను కోరినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ!