US Immigrant Cannibal| అమెరికాలో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పట్ల ట్రంప్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అక్రమ వలసదారులనైతే కేసులు లేకుండానే జైళ్లో పెట్టడం, ఆ తరువాత త్వరగా వారిని వారి స్వదేశాలకు తిరిగి సాంగనంపుతోంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వంలోని ఒక కీలక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ మంగళవారం ఒక షాకింగ్ ఘటన గురించి వెల్లడించారు. ఒక వలసదారుడు, డిపోర్టేషన్ విమానంలో తన సొంత చేతులను తినడం ప్రారంభించాడని ఆమె చెప్పారు. ఈ ఘటన ఫ్లోరిడా ఎవర్‌గ్లేడ్స్‌లో కొత్తగా నిర్మించిన “అలిగేటర్ ఆల్కాట్రాజ్” అనే డిటెన్షన్ సెంటర్ (జైలు)ను ఆమె సందర్శించిన సమయంలో వెలుగులోకి వచ్చింది.
క్రిస్టీ నోమ్ మాట్లాడుతూ.. “నేను ఇటీవల యూఎస్ మార్షల్స్‌తో మాట్లాడాను. వారు ఐసీఈ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్)తో కలిసి పనిచేస్తున్నారు. వారు ఒక కానిబాల్‌ను (మనిషి మాంసం తినే వ్యక్తి) అరెస్ట్ చేసి, అతడిని డిపోర్ట్ చేయడానికి విమానంలో ఎక్కించారు. కానీ అతను విమానంలో తన సీట్‌లో కూర్చుని తన సొంత చేతులను తినడం మొదలుపెట్టాడు. వెంటనే అతడిని విమానం నుంచి దించి వైద్య సహాయం అందించారు” అని వివరించారు.
ఈ ఘటన గురించి నోమ్ గత వారం ఫాక్స్ న్యూస్ హోస్ట్ జెస్సీ వాటర్స్‌తో ఇంటర్వ్యూలో మొదటిసారి చెప్పారు. ఒక యూఎస్ మార్షల్‌తో మాట్లాడినప్పుడు, అతను “ఒక విమానంలో చట్టవిరుద్ధ వలసదారులతో పాటు ఒక కానిబాల్ ఉన్నాడు” అని చెప్పాడని ఆమె తెలిపారు. “కానిబాల్ అంటే ఏమిటి?” అని అడిగినప్పుడు.. మార్షల్, “అతను తన సొంత చేతులను తినడం మొదలుపెట్టాడు” అని సమాధానం ఇచ్చాడట. నోమ్ ఈ సంఘటనను గుర్తు చేస్తూ.. “ఈ మార్షల్ ఈ విషయాన్ని సాధారణంగా చెప్పడం నన్ను షాక్‌కు గురిచేసింది. అతను నిజంగా తన చేతులను తిన్నాడు. ఇతరులను తినడంతో పాటు, తనను తాను కూడా తిన్నాడు” అని చెప్పారు.
క్రిస్టీ నోమ్, గతంలో సౌత్ డకోటా గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి, ఈ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ.. ఇమ్మిగ్రేషన్ అధికారులు “అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులను” టార్గెట్ చేస్తున్నారని.. చట్టపాలన పాటించే వలసదారులను కాదని అన్నారు. “ఇలాంటి మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులు మన దేశంలోని రోడ్లపై తిరుగుతున్నారు. వీరిని దేశం నుంచి తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే వీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు” అని ఆమె అన్నారు.
ఈ ఘటన గురించి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యాఖ్యలు.. “అలిగేటర్ ఆల్కాట్రాజ్” అనే కొత్త డిటెన్షన్ సెంటర్‌ను సందర్శించిన సమయంలో వచ్చాయి. ఈ సెంటర్ ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో, మయామీ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం చిత్తడి నేలలు, అలిగేటర్లు, పైథాన్‌లతో నిండి ఉంది. ఈ జైలు చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతంలో ప్రమాదకరమైన షార్క్ చేపలు ఉన్నాయి. కేవలం ఎనిమిది రోజుల్లో నిర్మించిన ఈ 62 చదరపు కిలోమీటర్ల సెంటర్, ట్రంప్ ప్రభుత్వం భారీ ఎత్తున డిపోర్టేషన్‌లు చేపట్టడానికి ఉపయోగపడుతుంది. బుధవారం నుంచి ఈ జైల్లో అక్రమ వలసదారులను తీసుకురావడం ప్రారంభించారు.
Also Read: రష్యా చమురు తక్కువ ధరకు కొంటున్న ఇండియా.. అమెరికా కడుపు మంటతో ఆంక్షలు
గత ఏడాది.. హైతీ వలసదారులు “కానిబాల్ గ్యాంగ్‌ల”లో భాగమని ఎలాన్ మస్క్‌తో పాటు కొంతమంది రైట వింగ్ నాయకులు ఆరోపించారు. మస్క్ సోషల్ మీడియాలో ఈ గ్యాంగ్‌లు అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్నాయని హెచ్చరించారు.