US Tariff Russia India| అగ్రరాజ్యం అమెరికా త్వరలోనే ఒక కొత్త బిల్లు తీసుకురాబోతోంది. దీని ప్రకారం రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 500 శాతం సుంకం విధించవచ్చు. ఈ బిల్లు ఆమోదం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలను, ముఖ్యంగా చమురు కొనే భారత్, చైనాలాంటి దేశాలను శిక్షించడమే ఈ బిల్లు లక్ష్యం. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడం, ఒంటరి చేయడానికే అమెరికా ఇలా చేస్తోంది.
రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఈ బిల్లు గురించి ఏబీసీ న్యూస్‌తో ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ.. “రష్యా నుంచి చమురు కొనే దేశాలు, ఉక్రెయిన్‌కు సహాయం చేయని దేశాలు.. అమెరికాకు తమ వస్తువులు ఎగుమతి చేస్తే.. వాటిపై 500 శాతం సుంకం విధిస్తాం. రష్యా చమురులో 70 శాతం భారత్, చైనా దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. చమురు ఆదాయంతోనే రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది.” అని అన్నారు. ఈ బిల్లు ఆగస్టు 2025లో సెనేట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారితే, భారత్, చైనా దేశాలకు పెద్ద సమస్యగా మారుతుంది. 500 శాతం సుంకం వల్ల భారత ఔషధాలు, వస్త్రాలు, ఐటీ సేవల వంటి ఎగుమతులు అమెరికాలో ఖరీదైనవి కావచ్చు, దీనివల్ల భారతీయ పరిశ్రమలు నష్టపోవచ్చు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ ఎక్కువ చమురు కొంటోంది. యుద్ధానికి ముందు రష్యా నుంచి 1 శాతం కంటే తక్కువ చమురు దిగుమతి చేసిన భారత్, యుద్ధం తర్వాత రాయితీ ధరలతో రష్యా చమురును ఎక్కువగా కొనడం మొదలుపెట్టింది. 2024లో భారత్.. 49 బిలియన్ యూరోల చమురు దిగుమతి చేసింది. 2022 ఫిబ్రవరి నుంచి 2025 మార్చి వరకు మొత్తం 112.5 బిలియన్ యూరోల (సుమారు 118 బిలియన్ డాలర్లు) చమురు దిగుమతి చేసిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక తెలిపింది.
రష్యా చమురు తక్కువ ధరలో లభించడం వల్ల భారత్‌కు ఆర్థికంగా, ఇంధన భద్రత పరంగా చాలా లాభాలు కలిగాయి. 2022-2025 మధ్య భారత్ 10.5 నుంచి 25 బిలియన్ డాలర్లు ఆదా చేసింది. ఈ చమురు వల్ల భారత్ దేశీయ ఇంధన ధరలను స్థిరంగా ఉంచగలిగింది. రిఫైన్డ్ ఉత్పత్తుల ఎగుమతిని పెంచింది.
ఈ బిల్లు చర్చ జరుగుతున్న సమయంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కాబోతోందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చెప్పారు. కానీ, వ్యవసాయ సమస్యల వల్ల చర్చలు ఆగిపోయాయని సమాచారం. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాతో భారత్ కు ఉన్న వాణిజ్య సంబంధాలను మరింత క్లిష్టంగా మారవచ్చు.
ఈ బిల్లుకు సెనేటర్ గ్రాహమ్, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ మద్దతు ఇస్తున్నారు. 84 మంది సెనేటర్లు కూడా సమర్థిస్తున్నారు. ట్రంప్‌తో గోల్ఫ్ ఆడుతూ గ్రాహమ్.. ఈ బిల్లు గురించి చర్చించగా.. ట్రంప్ దీనికి ఆమోదం తెలిపారు. మొదట 2025 మార్చిలో ప్రతిపాదించిన ఈ బిల్లు, వైట్ హౌస్ వ్యతిరేకతతో ఆగిపోయింది. అయితే బిల్లులో ట్రంప్ ఇటీవల కొన్ని మార్పులు సూచించారు.
Also Read: భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మిస్తున్న పాకిస్థాన్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్
ఈ బిల్లు చట్టంగా మారితే, రష్యా చమురు కొనడం ఆపేయాలని భారత్ లాంటి దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. చమురు కొనడం ఆపేస్తే.. రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది.. తద్వారా రష్యా.. ఉక్రెయిన్ యుద్ధంలో వెనుకంజ వేయాల్సి ఉంటుంది. రష్యా సంగతి పక్కన పెడితే.. భారత్‌కు ఇది పెద్ద నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే భారత్‌కు అమెరికా ప్రధాన ఎగుమతి మార్కెట్, 500 శాతం సుంకం వల్ల ఔషధాలు, ఆటోమొబైల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగి విక్రయాలు తగ్గవచ్చు. ఆర్థిక నష్టాలతో పాటు దౌత్యపరమైన ఒత్తిళ్లను కూడా తెచ్చిపెట్టవచ్చు.
మొత్తంగా చూస్తే.. రష్యా చమురు కొనే దేశాలను లక్ష్యంగా చేసుకున్న ఈ అమెరికా బిల్లు.. భారత్ ఇంధన, వాణిజ్య వ్యూహాలను అస్తవ్యస్తం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.