Earthquake: దక్షిణ అమెరికా-అంటార్కిటికా మధ్య డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు అయ్యింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే-USGS ఈ విషయాన్ని వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 8 తీవ్రత ఉంటుందని అంచనా వేసింది.
ఇండియా భూకంప శాస్త్ర కేంద్రం-NCS దీని తీవ్రత 7.4 గా ఉంటుందని పేర్కొంది. భూకంపం 10.8 కిలోమీటర్ల లోతులో డ్రేక్ పాసేజ్‌లో గుర్తించింది. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం చిలీ వంటి దేశాలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. అయితే అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు.
అయితే చిలీ నావికాదళ హైడ్రోగ్రాఫిక్-ఓషనోగ్రాఫిక్ సర్వీస్.. చిలీ- అంటార్కిటిక్ ఖండాలను ముందుగా హెచ్చరించింది. ఈ భూకంపం వల్ల భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. భూకంపం వచ్చిన ప్రాంతం జనావాసాలు లేకపోవడంతో నష్టం తగ్గిందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సివుంది.
శుక్రవారం ఉదయం 7.46 గంటలకు దక్షిణ అక్షాంశం మరియు 61.85 పశ్చిమ రేఖాంశం వద్ద 10.8 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయబడలేదు. సౌత్ అర్జెంటీనా సిటీ ఉషుయాకు ఆగ్నేయంగా 700 కి.మీ. దూరంలో భూకంపం సంభవించింది. అక్కడ దాదాపు 57,000 జనాభా ఉంటుంది.
ALSO READ: జలదిగ్భంధంలో కరాచీ సిటీ, భారీ వర్షాలతో విద్యుత్‌కు అంతరాయం
గతనెల రష్యా తూర్పు కమ్చట్కా ప్రాంతంలో 8.8 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ ప్రాంతమంతా సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రష్యాలో 9.8 అడుగుల నుండి 13.1 అడుగుల మధ్య సునామీ అలలు ఎగసిపడ్డాయి. కమ్చట్కా రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ తీరానికి 74 మైళ్ల దూరంలో 13 మైళ్ల లోతులో సంభవించింది.
ఈ నెల ప్రారంభంలో టర్కీలోని బలికేసిర్ ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో వందలాది భవనాలు కూలిపోయాయి. అనేక మంది గాయపడిన విషయం తెల్సిందే. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు.