అమెరికాకు భారత్ శత్రుదేశమేమీ కాదు, యూఎస్ కి వ్యతిరేకంగా మనం ఎలాంటి వ్యూహాలు అమలు చేయడం లేదు. అయినా సరే శత్రుదేశాలకంటే ఎక్కువగా భారత్ పై కక్షగట్టినట్టు అమెరికా ప్రవర్తిస్తోంది. సుంకాలను 25 శాతానికి ఆ తర్వాత 50శాతానికి పెంచింది. అదేంటని అడిగితే రష్యా వద్ద చమురు కొంటున్నారు, ఆ లాభాలతో ఆ దేశం ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోందని వితండవాదానికి దిగారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య చర్చల నేపథ్యంలో మరోసారి ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. భారత్ పై సుంకాల పెంపు గురించి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యాపై ఒత్తిడి కోసమే..
ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధానికి రష్యా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆ దేశంపై మరింత ఒత్తిడి అవసరం అని అమెరికా భావించినట్టు తెలుస్తోంది. రష్యాపై భారత్ ద్వారా ఒత్తిడి తెచ్చేందుకే సుంకాలను భారీగా పెంచినట్టు కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఆంక్షల వెనుక ఉద్దేశ్యం రష్యాపై ద్వితీయ ఒత్తిడి తీసుకురావడమేనని ఆమె స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన ప్రజా ఒత్తిడి తెచ్చారని ఆమె గుర్తు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం తర్వాత రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిగిన సమావేశం ఈ దిశగా పడిన మరో పెద్ద ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. అమెరికా-రష్యా-ఉక్రెయిన్ ఉమ్మడి సమావేశం అవసరమని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇది తనకు చాలా విజయవంతమైన రోజు అని కూడా ఆయన తెలిపారు. ఇక అమెరికా అధ్యక్షుడితో ఇప్పటివరకు తాను జరిపిన ఉత్తమ సంభాషణ ఇదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొనడం విశేషం.
శాంతికోసం..
ప్రపంచ శాంతి కోసం ట్రంప్ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు లీవిట్. పుతిన్‌తో సమావేశం అయిన 48 గంటల్లోనే యూరోపియన్ నాయకులు వైట్ హౌస్‌లో ఉండేలా చేయడం సామాన్య విషయం కాదన్నారు. వారంతా రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాకు రావడం ఆయన సాధించిన విజయం అన్నారు. తాజా చర్చలు యుద్ధాన్ని ఆపేందుకు సహకరిస్తాయని, ఆ దిశగా మరింత పురోగతి సాధించామని తెలిపారు.
ఆయనే ఉండిఉంటే..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే సమయంలో అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదని ట్రంప్ అభిమానులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పుతిన్ కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ వార్తలను లీవిట్ ధృవీకరించారు. చర్చల్లో పుతిన్ కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నట్టు తెలిపారు. అప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్ తో యుద్ధమే మొదలయ్యేది కాదని పుతిన్ అన్నట్టు చెప్పారు. ట్రంప్ శాశ్వత శాంతి అవసరాన్ని అర్థం చేసుకున్నారని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి యూరోపియన్ నాయకులు, నాటోతో చర్చలు జరుపుతున్నారని లీవిట్ తెలిపారు. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.