ఇప్పుడంటే షాంపులు, సబ్బులు వచ్చేసాయి. కానీ ఒకప్పుడు జుట్టుకు కేవలం శీకాయ, కుంకుడుకాయల్ని వాడేవారు. వాటిని ముందుగానే నానబెట్టుకొని ఆ నురుగు నీటిని జుట్టుకు పట్టించి రుద్దుకునేవారు. కానీ ఇప్పుడు వీటి వాడకం చాలా తగ్గిపోయింది. అలాగే ఆధునిక కాస్మొటిక్ ఉత్పత్తులతో జుట్టు రాలడం కూడా పెరిగిపోయింది. మీకు జుట్టు పొడవుగా పెరగాలని అనుకుంటే కుంకుడుకాయలతో ఇంట్లోనే నూనె తయారు చేసుకోండి.
కొందరికి జుట్టు సన్నగా, పొడిగా మారిపోతుంది. పొడవుగా పెరగదు. అలాంటివారు ఏం చేయాలో తెలియక కాస్మోటిక్ నిపుణులను కలుస్తూ ఉంటారు. ఇంట్లోనే కుంకుడుకాయ నూనె తయారు చేసుకుని వాడితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కుంకుడుకాయ నూనె ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
కుంకుడు కాయలు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి నీటిలో కలిసినప్పుడు నురుగుని ఇస్తాయి. అదే సహజమైన షాంపూలా ఒకప్పుడు ఉపయోగించుకునే వాళ్ళము. కుంకుడు కాయల్లో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి తలపై ఉన్న చర్మాన్ని శుభ్రపరుస్తాయి. జుట్టును కుదుళ్ల నుండి బలోపేతం చేస్తాయి. జుట్టు పెరగడానికి అవసరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తాయి. కాబట్టి కుంకుడుకాయలతో జుట్టును కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. కుంకుడుకాయలతో నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
కుంకుడు కాయల నూనె తయారీ
ముందుగా కుంకుడు కాయలను పరిశుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టండి. ఇవి ఎండినవే కాబట్టి త్వరగానే పొడిగా మారుతాయి. ఇప్పుడు కుంకుడు కాయలను చితక్కొట్టి లోపల ఉన్న విత్తనాన్ని తీసి పడేయండి. మిగతా వాటిని మిక్సీలో వేసి మెత్తటి పొడి చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేయండి. అందులోనే కుంకుడు కాయలు పొడిని కూడా వేసి బాగా మరిగించండి. నూనెలో కుంకుడు కాయల రసం బాగా కలిసిపోయేలా చూడండి. తర్వాత ఆ నూనెను చల్లార్చండి. దాన్ని వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోండి. దీన్ని అప్పుడప్పుడు వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
కుంకుడుకాయలతో జుట్టుకు బాగా మసాజ్ చేసుకొని రాత్రి అంతా అలా వదిలేయండి. ఉదయం లేచాక తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ గోరువెచ్చని నూనె మసాజ్ వల్ల ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది. తలకు రక్తప్రసరణ పెరుగుతుంది. వారానికి రెండు మూడు సార్లు ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
కొబ్బరి నూనె లేదా ఆముదం లేదా బాదం నూనెను తీసుకొని కొద్దిగా వేడి చేయండి. అందులోనే ఈ కుంకుడు కాయలను కూడా వేసి కలపండి. దాన్ని జుట్టుకు పట్టించి ఒక అరగంట పాటు వదిలేయండి. తర్వాత తేలికపాటి షాంపూతో మొత్తం శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న వారైతే అలా వదిలేస్తే సరిపోతుంది. షాంపూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. జుట్టు ఒత్తుగా, మందంగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
కుంకుడు నూనె హెయిర్ మాస్క్
కుంకుడు కాయల నూనెతో హెయిర్ మాస్కు కూడా ప్రయత్నించవచ్చు. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కుంకుడుకాయల నూనె, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూను ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. దాన్ని జుట్టుకు పట్టించి అరగంట పాటు వదిలేయాలి. ఇది తలపై చర్మం పరిశుభ్రంగా ఉండేలా చూస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది. మీరు వాడే షాంపూలో కొన్ని చుక్కల కుంకుడు కాయలను కలుపుకొని వాడినా కూడా ఎంతో మంచిది.