US Student Visa: అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు యుఎస్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలలో అత్యంత కీలకమైన మార్పులకు శ్వేతసౌధం ఆమోదం తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించిన ఈ కొత్త వీసా నిబంధనల తుది ముసాయిదాను ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్’ (OMB) క్లియర్ చేసింది. ఇది ఫెడరల్ రిజిస్టర్‌లో అధికారికంగా ప్రచురితమైన వెంటనే అమలులోకి రానుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం అమెరికాలో చదువుకునే కాలపరిమితిపై ఎలాంటి గడువు ఉండేది కాదు. కానీ తాజా నిర్ణయం వల్ల ఇకపై విద్యార్థులు అక్కడ ఉండటానికి కఠినమైన కాలపరిమితులు ఎదుర్కోవాల్సి రానుంది.
ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఐ-94 ఫామ్‌పై ఎటువంటి నిర్దిష్ట ముగింపు తేదీని వెల్లడించాల్సిన అవసరం లేదు. దీనిని ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ అంటారు. అంటే విద్యార్థి పూర్తి సమయం చదువుకుంటూ వీసా రూల్స్ పాటిస్తున్నంత కాలం… ఆ కోర్సు ఎన్ని సంవత్సరాలైనా అమెరికాలో చట్టబద్ధంగా ఉండవచ్చు. కానీ కొత్త రూల్ ప్రకారం ఈ సౌలభ్యాన్ని రద్దు చేస్తున్నారు. దీని స్థానంలో గరిష్టంగా 4 సంవత్సరాల స్థిర కాలపరిమితిని (Fixed Stay Limit) ప్రవేశపెడతారు. ఒకవేళ కోర్సు లేదా రీసెర్చ్ 4 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సాగితే విద్యార్థులు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కు మళ్లీ దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టి, బయోమెట్రిక్స్ ఇచ్చి వీసా పొడిగింపు (Extension of Stay) సాధించాల్సి ఉంటుంది.
కొత్త వీసా నిబంధనల ప్రకారం విద్యార్థుల గ్రేస్ పీరియడ్ సగానికి తగ్గించారు. కోర్సు పూర్తయిన తర్వాత లేదా ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లడానికి, వేరే వీసాకు మారడానికి ఇప్పటివరకు 60 రోజుల సమయం (Grace Period) ఉండేది. కొత్త నిబంధన ప్రకారం దీనిని 30 రోజులకు కుదించారు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ చదువు మధ్యలో వేరే సబ్జెక్టులకో, కోర్సులకో మారడాన్ని పూర్తిగా నిషేధించారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా మొదటి సంవత్సరంలో కాలేజీ లేదా కోర్సు మార్చడానికి వీల్లేదని కొత్త వీసా నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుడా ఒక విద్యార్థి అమెరికాలో ఒక మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక మళ్లీ అదే స్థాయిలో మరో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అనుమతించరు. చదువుకోవాలనుకుంటే అంతకంటే పై స్థాయి డిగ్రీ (పీహెచ్‌డీ)కి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం దాదాపు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. అంటే మొత్తం విదేశీ విద్యార్థుల్లో దాదాపు 31 శాతం మనవాళ్లే. అందువల్ల ఈ నిబంధనల దెబ్బ ఎక్కువగా భారతీయులపైనే పడనుంది. ముఖ్యంగా డాక్టరేట్ (PhD), సుదీర్ఘ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు చేసేవారికి సహజంగానే 5 నుండి 7 సంవత్సరాల సమయం పడుతుంది. కొత్త వీసా నిబంధనల అమల్లోకి వస్తే.. వీరంతా 4 ఏళ్లు పూర్తి కాగానే మళ్లీ పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ పొడిగింపు తిరస్కరణకు గురైతే చదువు మధ్యలోనే ఆపేసి వెనక్కి రావాల్సి వస్తుందన్న ఆందోళనలు ఉన్నాయి.
కొత్త రూల్స్ ప్రకారం వీసా గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే విదేశీ విద్యార్థులను అక్రమ నిర్వాసితులుగా పరిగణిస్తారు. ఒకవేళ ఇలా 180 రోజులకు పైగా ఉంటే భవిష్యత్తులో 3 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించే అవకాశాన్ని కొత్త వీసా చట్టం కల్పిస్తోంది. విదేశీ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పటిష్టం చేయడానికి ఈ స్థిర కాలపరిమితిని తెస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) వాదిస్తోంది. కొందరు విద్యార్థులు ‘లైఫ్‌లాంగ్ స్టూడెంట్స్’గా మారుతూ దశాబ్దాల తరబడి అమెరికాలోనే ఉండిపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!
అయితే కొత్త వీసా నిబంధనలను అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, వైద్య రంగానికి చెందిన అసోసియేషన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులపై అనవసరమైన ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి పెరుగుతాయని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రతిభావంతులైన విద్యార్థులు అమెరికా వైపు చూడటం తగ్గిస్తారని హెచ్చరిస్తున్నాయి. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించే అమెరికా సామర్థ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: ఒకే ఒక్క గ్యాడ్జెట్.. నాలుగు అద్భుతాలు.. బుర్ర బద్దలయ్యే డివైజ్ భయ్యా!