AP DSC Notification 2026: ఏపీ డీఎస్సీ అభ్యర్థులు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. ఇప్పటికే టెట్ పరీక్షలు పూర్తై ఫలితాలు రావడంతో.. డీఎస్సీ ప్రకటనపై అభ్యర్థులు ఆశలు పెరుగుతున్నాయి. ఏపీలో ఇటీవల 16 వేల మెగా డీఎస్సీ నియామకాలు పూర్తయిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీలో కొలువు మిస్సైన అభ్యర్థులు.. ఈసారి జాబ్ కొట్టాలని కోచింగ్, సొంత ప్రిపరేషన్ మొదలుపెట్టారు. గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. వీటితో మరిన్ని పోస్టులు జోడించి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
2026లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని గతేడాదే కూటమి ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల టెట్ పరీక్షలు నిర్వహించింది. ఇప్పటికే టెట్ పరీక్ష ఫలితాలు విడుదల కావడంతో.. అందరి దృష్టి డీఎస్సీ ప్రకటనపై పడింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పదవీ విరమణ కానున్నారు. అలాగే రాష్ట్రంలోని 9,200 ప్రైమరీ పాఠశాలలను మోడల్ స్కూళ్లగా మార్చిన తర్వాత అదనంగా ఉపాధ్యాయులు అవసరం అవుతారని ప్రభుత్వం చెబుతోంది.
మెగా డీఎస్సీలో మిగిలిన పోస్టులతో కలిపి సుమారు 10 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. అయితే మరోసారి ఇంత భారీ నోటిఫికేషన్ ఇస్తారా? అరకొర పోస్టులతో సరిపెడతారా? అనేది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తెలియనుంది. అన్నీ అనుకూలిస్తే.. ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
Also Read: ఏపీ డీఎస్సీపై బిగ్ అప్డేట్.. జనవరిలో నోటిఫికేషన్.. టెట్ ఎప్పుడంటే?
ఈసారి డీఎస్సీలో ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెజ్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా.. బోధన నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అలాగే ఉపాధ్యాయ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని భావిస్తుంది.