TG EAPCET 2026: తెలంగాణలో బీటెక్ చేయాలనుకునే విద్యార్థులకు అలర్ట్. అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘టీజీ ఈఏపీసెట్’ ఇంజనీరింగ్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం అయింది. ర్యాంకులు సాధించి, ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు జులై 1వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలను ఆన్‌లైన్‌లో లాక్ చేసుకోవచ్చు. వీటి ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈఏపీసెట్ సీట్ల జాతర:
తెలంగాణ ఉన్నత విద్యామండలి అప్‌డేట్ ప్రకారం.. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్ బరిలో నిలిచాయి. వీటిలో మొత్తం 1,14,007 సీట్లు ఉంటే.. వాటిలో 81,620 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇక యూనివర్సిటీల విషయానికి వస్తే జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 3,150 సీట్లు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 630 సీట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 84 వేల మందికి పైగా విద్యార్థులు ఫీజులు కట్టి స్లాట్స్ బుక్ చేసుకోగా.. ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాని వారికి జూన్ 29 వరకు గడువు ఉంది.
కంప్యూటర్ సైన్స్,ఐటీ కోర్సులు:
ఈసారి కూడా విద్యార్థులంతా కంప్యూటర్ సైన్స్ (CSE), ఐటీ అనుబంధ కోర్సుల వైపే పరుగులు తీస్తున్నారు. దానికి తగ్గట్టే.. కాలేజీల్లో కూడా ఈ విభాగాల సీట్లే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం అందుబాటులో ఉన్న సీట్లలో సింహభాగం అంటే దాదాపు 81,768 సీట్లు సీఎస్ఈ, ఐటీ గ్రూపుల్లోనే ఉన్నాయి. వీటిలో కేవలం ప్యూర్ సీఎస్ఈ కోర్సులోనే 27,431 కన్వీనర్ సీట్లు ఉన్నాయి. ఇక నెక్ట్స్ జనరేషన్ క్రేజీ కోర్స్ అయిన సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (CSE AIML) లో 13,537 సీట్లు ఉన్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్ (ECE) విభాగంలో 10,851 కన్వీనర్ సీట్లు రెడీగా ఉన్నాయి.
ఈ తప్పులు అస్సలు చేయొద్దు:
మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే, వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు చిన్న పొరపాటు చేసినా టాప్ కాలేజీలో సీటు మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే స్మార్ట్‌గా ప్లాన్ చేయండి. ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి ముందే ఒక పేపర్ మీద ‘మాన్యువల్ ఆప్షన్స్ ఎంట్రీ ఫామ్’ తరహాలో మీకు నచ్చిన కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్‌లను ప్రాధాన్యత క్రమంలో రాసి పెట్టుకోండి. ఆ తర్వాతే అఫీషియల్ వెబ్‌సైట్ [https://tgeapcet.nic.in](https://tgeapcet.nic.in) లోకి లాగిన్ అయి వాటిని ఎంటర్ చేయండి. గుర్తుంచుకోండి. ఆప్షన్ల సంఖ్యపై ఎలాంటి లిమిట్ లేదు. కాబట్టి మొదటి విడతలోనే బెస్ట్ కాలేజీలో సీటు కొట్టాలంటే వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఎంచుకోవడం మంచిది.