IBPS PO Recruitment 2026: బ్యాంక్ ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. అలాంటి వారి కలలను నిజం చేయడానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న 11 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దీనికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు , ముఖ్యమైన తేదీలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ బ్యాంకుల్లో ఆఫీసర్ హోదాలో సెటిల్ అవ్వడానికి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఏకంగా 6,715 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల్లో కొత్త జోష్ నింపింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రతిష్టాత్మక బ్యాంకుల్లో ఆఫీసర్‌గా కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
అర్హతలు, వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరంలో ఉండి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు, దరఖాస్తు గడువు ముగిసే నాటికి ఫలితాలు వస్తేనే అర్హులవుతారు. వయస్సు విషయానికి వస్తే జూలై 1 నాటికి కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
జీతం:
ఐబీపీఎస్ పీవో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే దాదాపు రూ. 48,480 గా ఉంటుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సిటీ అలవెన్స్ , మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కలిపి నెలకు సుమారు రూ. 76,000 వరకు గ్రాస్ శాలరీ లభిస్తుంది. దీంతో పాటు పెట్రోల్ అలవెన్స్, లీజ్డ్ అకామడేషన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను మూడు దశల పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది కేవలం క్వాలిఫైయింగ్ రౌండ్ మాత్రమే. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ (Mains) నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కులే తుది ఎంపికకు చాలా కీలకం. చివరిగా మూడో దశలో పర్సనాలిటీ టెస్ట్ , ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్ మార్కులు, ఇంటర్వ్యూ స్కోర్ రెండింటినీ కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు:
ఐబీపీఎస్ పీవో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే జులై 1 నుండి ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ,ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జులై 21. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 850 కాగా, ఎస్సీ, ఎస్టీ ,దివ్యాంగులకు రూ. 175 గా నిర్ణయించారు.