
Computer Science Engineering(CSE) : ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ)కి మంచి గిరాకీ ఉంది. బీటెక్/బీఈలో చేరే విద్యార్థులు ఎక్కువ ఎంచుకుంటున్న బ్రాంచి ఇదే. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రక్రియల్లో సమాచార వ్యవస్థల డిజైన్, అమలు, నిర్వహణకు సంబంధించిన కోర్సు ఇది. ఈ డిగ్రీ పూర్తిచేసి ఐటీ పరిశ్రమ, సంబంధిత రంగాల్లోని వివిధ ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు పొందవచ్చు.
అవకాశాలు అధికం
ఇప్పుడున్న పరిశ్రమల్లో అధునాతన వ్యవస్థలు, ఆటోమేషన్ పురోగతి సీఎస్‌ఈ రంగం గిరాకీని పెంచుతోంది. ఈరోజుల్లో మనం ఉపయోగించే ప్రతి అప్లికేషన్‌లో డేటా ప్రధాన అంశం. సీఎస్‌ఈ అనేది డేటాసైన్స్, ఎంఎల్ అనుబంధిత సబ్‌డొమైన్లతో కూడిన పెద్ద డొమైన్. ఏఐ, బ్లాక్‌చెయిన్ లాంటి అధునాతన టెక్నాలజీలు ప్రపంచ రూపురేఖలను మారుస్తున్నాయి. ప్రతి రంగంలో కంప్యూటర్ల వినియోగం ఉన్నందున సీఎస్‌ఈకి ఎంతో ప్రఖ్యాతి లభిస్తోంది.
పట్టు సాధిస్తేనే..
కంప్యూటర్ సైన్స్-ఇంజినీరింగ్..సాహసోపేతమైన రంగం. దీనిలో ప్రతి త్రైమాసికంలో వినూత్నమైన సాంకేతికతలను ప్రవేశపెడతారు. విద్యార్థులు వీటిపై పట్టు సాధిస్తేనే ముందంజలో ఉంటారు. ఈ బ్రాంచిలో ప్రధానమైన అంశం ‘ప్రోగ్రామింగ్’. దీన్ని వ్యవహారికంగా ‘కోడింగ్’ అంటారు. ముందుగా ఈ కోడింగ్ భాషలపై విద్యార్థులు పరిచయ కోర్సులు చదివి, తగినంత పట్టు సాధించాలి. ఈ అభ్యాసం వారిని సులువుగా కోడ్‌చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో వారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతారు.