
Visa Free Tourism : తమ దేశంలో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారత్ కింది దేశం కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకూ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన శ్రీలంక.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో ఆ దేశ పర్యాటక రంగంపై దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో.. భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని శ్రీలంక నిర్ణయించింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్ లాండ్ దేశాలతో పాటు భారత్ టూరిస్టులు కూడా శ్రీలంక వెళ్లాలంటే వీసా అవసరం లేదు. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ తెలిపారు. మొదట దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టనుందని పేర్కొన్నారు.
ఇప్పటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందన్న ఆయన.. 2024, మార్చి 31 వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు. శ్రీలంక ఒక ద్వీప దేశం. ఆ దేశానికి ఆదాయం తెచ్చిపెట్టేది పర్యాటకమే. విదేశాల నుంచి వచ్చే డబ్బు ద్వారానే ఇది సాధ్యమవుతోంది. కరోనాకు తోడు అక్కడ నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యాటకుల రాక తగ్గింది. ఈ క్రమంలోనే పర్యాటక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టాలని నిర్ణయించింది. 2023లోనే సుమారు 20 లక్షల మంది టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే శ్రీలంక ఈ వీసా ఫ్రీ టూరిజం నిర్ణయం తీసుకుంది. తొలుత ఇది 5 దేశాలకే ఉండగా.. తాజాగా దానిని 7 దేశాలకు పెంచుతూ శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకుంది.