NEET-2026 Exam: వైద్య వృత్తిలోకి ప్రవేశించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ-2026 పరీక్షకు అంతా రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా మే 3న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పక్కాగా ఏర్పాట్లు చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందో చూద్దాం.
దేశవ్యాప్తంగా నీట్ యూజీ-2026 ఎగ్జామ్.. మధ్యాహ్నం నుంచి పరీక్ష
దేశంలోని ఎయిమ్స్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేందుకు విద్యార్థులకు నీట్ ఎంట్రన్స్ కు అంతా రెడీ అయ్యింది. ఆదివారం మద్యాహ్నం ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. దేశంలోని 552 నగరాలతోపాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో పరీక్ష జరుగుతోంది.
పరీక్ష ప్రశాంతంగా జరిగేలా పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లోకి వచ్చేసింది. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువమంది గుమిగూడరాదని ఎన్టీఏ ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
విద్యార్థులకు డ్రెస్ కోడ్, కీలక సూచనలు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
నీట్ పరీక్ష కేంద్రాల్లో ఇప్పటికే అధికారులు తనిఖీలు చేశారు. విద్యుత్తు సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాటు, బయో మెట్రిక్ వెరిఫికేషన్, మొబైళ్లు-బ్యాగుల డిపాజిట్ కౌంటర్లు, తాగునీటి సౌకర్యం లాంటి వసతులు ఉండేలా చర్యలు చేపట్టారు.
నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 11 గంటల నుంచి ప్రవేశించవచ్చు. చివరిగా మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చిన విద్యార్థులకు అనుమతి ఉండదు. నీట్ రాసే విద్యార్థులు పక్కాగా పాటించాలి. పురుషులకు డ్రెస్ కోడ్ విధానం తీసుకొచ్చింది.
సాధారణ దుస్తులు ధరించాలి. హాఫ్ హ్యాండ్స్ షర్ట్, టీ-షర్టులు ధరించవచ్చు. సాధారణ ట్రౌజర్లు, ప్యాంటు లేదా జీన్స్ ధరించవచ్చు. పెద్ద లోగోలు, భారీ డిజైన్‌లు ఉన్న దుస్తులను ధరించవద్దు. ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు ధరించడం నిషేధం. ఎంబ్రాయిడరీ దుస్తులకు అనుమతి లేదు. ముఖ్యంగా విద్యార్థులు బూట్లు ధరించేందుకు అనుమతి లేదు.
ALSO READ: డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో, ఎంపిక విధానం ఇదే
స్లిప్పర్లు, శాండిళ్లు, లో హీల్ పాదరక్షలు మాత్రమే వేసుకోవాలి. అలాగే మతపరమైన దుస్తులు ధరించేవారు మధ్యాహ్నం 12.30 గంటల లోపు కేంద్రానికి చేరుకొని తనిఖీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక మహిళల కోసం డ్రెస్ కోడ్ విషయానికి వద్దాం. సాధారణ సల్వార్ సూట్, కుర్తా, లేదా టీ-షర్టులే ధరించవచ్చు.
ఎంబ్రాయిడరీ లేదా డిజైన్ లేని లేత రంగు దుస్తులు పిన్నులు, భారీ ఆభరణాలను ధరించవద్దు. దుస్తులను సరళంగా, సౌకర్య వంతంగా ఉంచుకోవాలి. వాచీలు, షూలు, బెల్టులు, టోపీలు, కళ్లద్దాలు, మొబైల్ ఫోన్లు, బ్లూ టూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్‌లు, కాలిక్యులేటర్లు, నోట్స్, పేపర్లు, పుస్తకాలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, జ్యామితి లేదా పెన్సిల్ పెట్టెలు, ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు నిషేధం.
పరీక్షా హాలులోకి అనుమతించే వస్తువుల జాబితాను చూద్దాం. అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు ఆధార్/పాన్/డ్రైవింగ్ లైసెన్స్ వంటివి మాత్రమే. మంచి నీటి బాటిల్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమిత ఆహార పదార్థాలను అనుమతిస్తే మాత్రమే వెంట తీసుకెళ్లవచ్చు.