Sneezing : ఎవరైనా ఎక్కడికైనా బయలుదేరే ముందు తుమ్మితే చాలు…అపశకునం అని తెగ బాధపడుతుంటారు. తుమ్ము వల్ల ఇక చేపట్టబోయే పనికి ఆటంకం తప్పదని అనుకుంటూ ఉంటారు. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. తుమ్మును మన పెద్దలు బాగా పట్టించుకుంటారు. వాస్తవానికి తుమ్ము అనారోగ్యాలకు సంకేతం. మన శరీరం ఎన్నో రుగ్మతలను కలిగి ఉంటుంది. అనారోగ్యం గురించి తుమ్ము మనకు సంకేతాలిస్తుంది.
చిన్నపిల్లలు తుమ్ముంటే పెద్దలు చిరంజీవి అంటారు. అంటే ఎక్కువకాలం జీవించమని అర్థం. తుమ్ము అనారోగ్య చిహ్నం కావడంతో పెద్దలు పిల్లల తుమ్మును మాత్రమే బాగా పట్టించుకునే వారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు.
పూర్వకాలం ఇంట్లో ఎవరైనా యాత్రలకు వెళితే కాలినడకన బయలుదేరేవారు. రోజుల తరబడి నడిచి వెళ్లి దైవదర్శనం చేసుకుని మళ్లీ ఇంటికి తిరిగొచ్చేవరకూ అప్పట్లో ఎలాంటి సమాచారం వ్యవస్థ ఉండేది కాదు. అందుకే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే ఆగమని చెప్పేవారు. ఎందుకంటే వెళ్లాల్సిన మనిషి వెళ్లిపోతే తుమ్మిన వ్యక్తికి ఆ తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఇంకేదైనా జరిగినా సమాచారం చెప్పే అవకాశం ఉండేది కాదు. ఒక్కోసారి చివరి చూపు కూడా దక్కేదికాదు. అందుకే తుమ్మితే ప్రయాణం వాయిదా వేసుకునే సెంటిమెంట్ మొదలైంది.