E-Paper
Advertisement

Top 20 News Today: ఆర్టీసీపై భట్టి సమీక్ష – గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు – పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు

Top 20 News Today: ఆర్టీసీపై భట్టి సమీక్ష – గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు – పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు

1. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి: డిప్యూటీ సీఎం భట్టి

ప్రజాభ‌వ‌న్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని.. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని తెలిపారు.

2. గాంధీ పేరు తొలగింపుపై నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి ధర్నా

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరు తొలగించడంపై మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలపై బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

3. సైబరాబాద్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 409 మంది అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 409 మంది పట్టుబడ్డారు. ఇందులో 290 బైకులు, 95 కార్లు ఉన్నాయి. మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమైతే కొత్త చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరిస్తూ అందరినీ కోర్టులో హాజరుపరిచారు.

4. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడంపై రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. గాంధీ పేరు వింటేనే బీజేపీ ఉలిక్కి పడుతోందని, పథకాల్లో గాంధీ పేరు మార్చినంత మాత్రాన జాతిపితగా ప్రజల గుండెల్లో ఉన్న పేరును మార్చలేరని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు.

5. పరిగిలో డీసీఎం బోల్తా.. స్థానికుల్లో భయాందోళన

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగిలోని బహార్ పేట్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన ఐరన్ స్క్రాప్ డీసీఎం బోల్తా పడింది. ఫుట్‌పాత్‌పై ఉన్న బైకులు, ఆటోల మీద వాహనం పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

6. కాల్చుకున్న హైడ్రా ఎస్ఐ పరిస్థితి విషమం.. కొనసాగుతున్న చికిత్స

హైదరాబాద్ హయత్‌నగర్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ కృష్ణచైతన్యకు కామినేని ఆసుపత్రి వైద్యులు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. బుల్లెట్ మెదడులోకి దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ స్పష్టత రాదని వైద్యులు తెలిపారు.

7. భువనగిరిలో కాంగ్రెస్ నిరసన.. పేరు మార్పుపై మండిపాటు

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం సరికాదన్నారు యాదాద్రి డిసిసి అధ్యక్షుడు బీర్ల ఐలయ్య. టీపీసీసీ ఆదేశాలతో భువనగిరిలోని గాంధీ పార్క్ ఎదుట రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ బండ్రు శోభారాణి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.

8. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 47 వద్ద మూడు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.

9. నిర్మల్‌లో ధాన్యం లారీ బోల్తా.. రైతుల ఆందోళన

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాల్ ఐకేపీ కేంద్రం నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ధాన్యం లారీ దేవునిగూడెం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న 659 ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10. కొమురవెళ్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెళ్లి మల్లన్న ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. రద్దీ కారణంగా ధర్మ దర్శనానికి ఆరు గంటలు పడుతుండగా.. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో ప్రతిధ్వనించాయి.

11. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్

మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు నాంపల్లి NIA కోర్టు రిమాండ్ విధించింది. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారన్న ఆరోపణలపై ఇన్నయ్యను అరెస్ట్ చేసిన NIA అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

12. ఏలూరు జిల్లాలో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి

ఏలూరు జిల్లా కలిదిండి మండలం మద్దవానిగూడెం వద్ద చేపల కూలీల బొలెరో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆటోను ఓవర్ టేక్ చేయబోయి అతివేగంతో వాహనం తిరగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను టి. ఆంజనేయులు, కె. వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

13. గుంటూరులో రూ.9 కోట్లతో వాటర్ ట్యాంకులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన

గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం, ఉద్యోగ నగర్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 9 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన వాటర్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని మంత్రి, మేయర్ కోవెలమూడి స్పష్టం చేశారు.

14. గిరిజనుల కోసమే వైద్య సేవలు: భువనేశ్వరి

అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ క్యాంప్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.

15. మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటలు ధ్వంసం

మన్యం జిల్లా శివన్నపేట, మాదలంగి గ్రామాల్లో గజరాజులు బీభత్సం సృష్టించి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు టపాసులు పేల్చి ఏనుగులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

16. దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 9 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. జొహన్నెస్‌బర్గ్‌ శివారులోని బెకర్స్‌డాల్‌ టౌన్‌షిప్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పుల చప్పుడుతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు.

17. ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. జమ్మూకాశ్మీర్, హిమాచల్‌లో హిమపాతం

ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో తాజా హిమపాతం మొదలైంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే దిగువకు పడిపోయాయి. జలవనరుల ఉపరితల భాగాల్లో పలుచని మంచు పొరలు కనిపిస్తున్నాయి.

18. 40 ఏళ్ల సేవలకు వీడ్కోలు.. నిష్క్రమించిన ఐఎన్‌ఎస్‌ సింధుఘోష్‌

భారత నౌకాదళానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సింధుఘోష్‌ ఇక శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది. దీన్ని లాంఛనంగా నేవీ నుంచి ఉపసంహరించారు. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో నౌకాదళ పశ్చిమ విభాగం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్, నేవీ పూర్వ అధిపతి వి.ఎస్‌.శెఖావత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

19. ప్రపంచ కప్ ముంగిట ఫామ్‌లోకి వస్తా: సూర్యకుమార్ యాదవ్ ధీమా

ప్రపంచ కప్ ముంగిట తప్పకుండా ఫామ్‌ అందుకుంటానని సూర్యకుమార్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ విరామంలో ఫామ్‌ అందుకోవడంపై దృష్టిపెడతానని భారత కెప్టెన్ పేర్కొన్నాడు.

20. నెట్‌ఫ్లిక్స్‌లో కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’

నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే వారిలో కీర్తి సురేశ్‌ ఒకరు. ఆమె నటించిన లేటెస్ట్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ రివాల్వర్‌ రీటా. నవంబరులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ తాజాగా ఖరారైంది. ఈ నెల 26 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×