ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికించేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తొమ్మిది నుంచి పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నవంబర్ నెలలో 13 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ఐఎస్పీఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇండో-యూఎస్ సమ్మిట్ కోసం పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. వారిని తెలంగాణకు రావాలని ఆహ్వానించనున్నారు.
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు. పాతపట్నంలో టీడీపీ పార్టీ నియోజవర్గ స్థాయి అనుబంధ విభాగాల కార్యకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో అనుబంధ విభాగాల కార్యకర్తలు బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీడీపీ పాటకు నాయకులతో కలిసి డాన్స్ చేశారు.
విశాఖకు ఐటీ కంపెనీలు వరుసపెట్టి క్యూ కడుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు నాలుగు ఐటీ కంపెనీలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు భూమిపూజ నిర్వహించనున్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహిన్‌నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సాయిబాబా ఆలయం వెనుక భాగంలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
బహ్రెయిన్లో జగిత్యాల పట్టణానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణానగర్కు చెందిన కల్యాణ్.. పుట్టిన రోజు నాడే సూసైడ్‌కు పాల్పడ్డాడు. కల్యాణ్ ఆత్మహత్యపై తల్లిదండ్రులకు అతని రూంమేట్స్ సమాచారం అందించారు. పుట్టిన రోజునాడే కుమారుడు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో దొంగలు హల్‌చల్ చేశారు. పాపిరెడ్డిపల్లిలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడిపై దాడి చేశారు. కల్లల్లో కారం చల్లి చోరీకి యత్నించారు దుండగులు. సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు.
ఒడిశా నుంచి ఇచ్ఛాపురం మీదుగా తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి ఒడిశాలో 20కిలోల గంజాయిని కొని తరలించే ప్రయత్నం చేశాడు. పోలీసులు ముందస్తు సమాచారంతో తనిఖీలు చేసి నిం అయితే ముందస్తు సమాచారంతో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిందితుడిని పట్టుకొని తనిఖీలు చేశారు. నిందితుడి నుంచి గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీఐ చిన్నమనాయుడు చెప్పారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని రోజు 8 గంటలు విచారించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద సిట్ ఆఫీసులో డీఐజీ మురళీ రాంబా, అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. భోలేబాబా డెయిరీ ద్వారా కల్తీ నెయ్యి సప్లైపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి
హనుమకొండ రాంనగర్‌లో దొంగల హల్‌చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగల ముఠా.. ఓ ఇంట్లో 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 60 వేల నగదును చోరీ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదం చోటు చేసుకుంది. ఎస్వీ నగర్ కాలనీలో నీతమ్మ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు మృతురాలు భర్త తెలిపాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
భద్రాచలం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో నాకాబంద్ నిర్వహించి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపట్టారు. వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి తగు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై రవాణా అవుతున్న వాహనాలలో గంజాయి, మత్తు పదార్థాలతో పాటు అక్రమ రవాణాపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం మధ్యలో సినిమా హాల్ సెంటర్ వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. రోడ్డు మధ్యలో పడుకొని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యువత మద్యం మత్తులో మునిగి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఒడిశాలోని రాయగడ దగ్గర జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కవిటి మండలం గొండ్యాల పుట్టుగకు చెందిన బైరెడ్ల రమేష్ అనే వ్యక్తి జలంత్రకోటకు లారీపై ప్రొక్లయినర్‌ను తీసుకొని వస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యి.. కొండను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు.
పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు సచివాలయంలో సీఎస్ రామకృష్ణా రావుతో పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజనతో కీలక భేటీ జరిగింది. 15వ ఫైనాన్స్ నిధులపైనా చర్చించినట్లు సమాచారం. కేంద్రం నుంచి సుమారు 4 వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది. ఇవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని పంచాయతీరాజ్ అధికారులు భావిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తులో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఫరీదాబాద్ కేంద్రంగా జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారన్న అనుమానాలతో అరెస్టు చేసిన ఎనిమిది మందితో పాటు.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారించడంతో ఈ కుట్ర కోణం బహిర్గతమైనట్లు పేర్కొన్నారు
గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్సాహంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. సఫారీలతో తొలి టెస్టు శుక్రవారం ఆరంభం కానుండగా.. ఈడెన్ గార్డెన్స్‌లో పంత్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో శ్రమించాడు. ఇంగ్లాండ్ పర్యటన మధ్యలో గాయంతో స్వదేశానికి వచ్చేసిన పంత్.. ఆ తర్వాత టెస్టు మ్యాచ్ ఆడబోయేది ఇప్పుడే కావడం విశేషం.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా సక్సెస్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికపై ప్రశంసలు కురిపించారు. ఒక మహిళగా ఇప్పుడు తన కథల ఎంపిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, తన కెరీర్ విషయంలో గర్వపడుతున్నా అని రష్మికను విజయ్ అభినందించారు.
గర్వపడుతున్నా..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాయడం గమనార్హం. నెతన్యాహుపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమవద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.