E-Paper
Advertisement

Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

1. తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్

కోనసీమలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. తెలంగాణ మంత్రుల విమర్శలకు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. “గతంలో కేసీఆర్ ‘ఆంధ్ర దొంగలు’ అనలేదా? ఏపీ వాళ్లను తరిమికొట్టాలని స్టేట్‌మెంట్లు ఇవ్వలేదా?” అని శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. తెలంగాణ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

2. మంత్రి పొన్నం పూజలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వరాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేపు హుస్నాబాద్ లో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలో స్టేజి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణం మొత్తం పార్టీ జెండాలతో అలకరించాలని పార్టీ నేతలకు సూచించారు.
పొన్నం పూజలు

3. ప్రాణాలతో ఇంటికి.. మెుహమ్మద్ అబ్దుల్ సోహెబ్

ఉమ్రా బస్సు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ సోహెబ్ ఈరోజు చికిత్స పూర్తిచేసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. జిరాలోని నటరాజ్ నగర్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్న వెంటనే బంధువులు, మిత్రులు, ప్రాంతీయులు అతన్ని కలిసి పరామర్శించారు. ప్రమాదం తర్వాత తనను సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి సోహెబ్ కృతజ్ఞతలు తెలిపారు.

4. టీటీడీ శ్రీవారి సేవలకు సీఎం సలహాలు

శ్రీవారి సేవకులను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దడానికి సీఎం సలహాలు ఇచ్చారన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. టీటీడీ శ్రీవారి సేవకులను మరింత పటిష్టం చేసేందుకు ఐఐఎం అహ్మదాబాద్ సలహాలతో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించిందన్నారు. క్రైసిస్ మేనేజ్‌మెంట్, భక్తుల సమస్యల గుర్తింపుపై శిక్షణనిచ్చి, వారి నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేసి, మరింత నాణ్యమైన సేవలు అందించేలా చేస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు.

5. పుష్పా సీన్ రిపీట్.. ఆవులు తరలింపు

పుష్ప సినిమా రేంజ్‌లో అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని వైజాగ్ నుంచి 10 ఆవులను అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో బాక్స్‌లు ఏర్పాటు చేసి అందులో ఆవులను ఉంచారు.

6. బాండ్ పేపర్ హామీ

మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్ మండలం కాప్రాయిపల్లి సర్పంచ్ అభ్యర్థి కుక్కల మౌనిక, రూ.100 బాండ్ పేపర్‌పై 15 అంశాలతో కూడిన ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేశారు. హామీలు నెరవేర్చకుంటే తనను కలెక్టర్ లేదా న్యాయస్థానం ద్వారా తొలగించవచ్చని బాండ్ పేపర్‌పై పేర్కొనడం స్థానికంగా, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

7. వైద్యుల నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. శరభవరానికి చెందిన కూలీ రాత్రి 3 గంటలకు నీరసంగా ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో చికిత్స అందక బయటే చనిపోయాడు. వైద్యం అందకే మృతి చెందాడని బంధువులు మృతదేహంతో పీహెచ్సీ వద్ద ఆందోళన చేస్తున్నారు.

8. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సీఎం సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారని తెలిపారు.

9. కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త శ్రీనివాసులు భార్య శాంభవి గొంతు కోశాడు. రెండు రోజులుగా ఇంటి నుంచి వెళ్లిన భార్య శాంభవిని ఎక్కడికి వెళ్లావు? అని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో శ్రీనివాసులు ఈ ఘాతుకానికి పాల్పడి పరారయ్యాడు.

10. అఖిలప్రియ ఆగ్రహం

నంద్యాల జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రసాభాస చోటు చేసుకుంది. రబీ పంటలకు నీరు ఇస్తారా, ఇవ్వరా అంటూ ఇరిగేషన్ అధికారులను నిలదీశారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తుంగభద్ర డ్యాం మరమ్మతుల నేపథ్యంలో నీటి విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

11. గుంటూరు జిల్లా బీవీఆర్ హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక బీవీఆర్ జెడ్పీహెచ్‌ హైస్కూల్‌లోని పాత భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్‌లోని విద్యార్థులను ఉపాధ్యాయులు బయటకు పంపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

12. వృద్ధుడి హత్య

బొబ్బిలిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం, సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జ‌రిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ రవీంద్ర దాస్ హాజరయ్యారు. జిల్లాలో కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందన్నారు. నాయకులు లేదా కార్యకర్తలు ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించినా పార్టీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

13. సీపీఎం నేతల మండిపాడు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్డు వెడల్పు పేరుతో దుకాణాల కూల్చివేత, మార్కింగ్‌లపై సీపీఎం నాయకులు మండిపడ్డారు. బాధితులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.

14. కూటమి నేతల ఆందోళన

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై కూటమి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో, వారిపట్ల మర్యాదగా వ్యవహరించడంలో అలసత్వం చూపిస్తున్నారని ఆరోపించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలని నేతలు కోరారు.

15. నెల్లూరు జిల్లాలో గంజాయి కలకలం

నెల్లూరు జిల్లాలో గంజాయి కలకలం రేగింది. కొడవలూరు మండలం గండవరం ఫ్లైఓవర్ వద్ద 7 కేజీల గంజాయిని విక్రయిస్తున్న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన బక్కి చిన్న రాజా, లక్ష్మి అనే దంపతులను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ సురేంద్రబాబు హెచ్చరించారు. గంజాయి విక్రయాలపై సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన రక్షణ కల్పిస్తామన్నారు.

16. కొండెక్కిన రీల్స్ పిచ్చి

తిరుమలలోని మాల్వాడి గుండం వద్ద ప్రమాదకరమైన కొండపై నుంచి రీల్స్ చేస్తున్న ఐదుగురు యువకులను అలిపిరి ఏవీఎస్ఓ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు జీవకోన అటవీ మార్గం గుండా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఏవీఎస్ఓ రమేష్ కృష్ణ వారిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చారు.

17. నర్సింగ్ యువతిపై కెమికల్‌తో దాడి

హనుమకొండ జిల్లాలో నర్సింగ్ యువతిపై కెమికల్‌తో దాడి కలకలం రేపింది. కడిపికొండ వద్ద స్కూటీపై వెళుతున్న సునంద అనే యువతిపై కాలిపై లిక్విడ్ పడినట్లు ఆనవాళ్లు కనిపించాయి. మంటగా ఉండడంతో యువతి కేకలు వేయగా.. స్థానికులు అక్కడికి వచ్చారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో 108లో యువతిని ఎంజీఎం తరలించారు.

18. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అయిదు, పదేళ్లలో అణుయుద్ధం జరగొచ్చని పేర్కొన్నారు. హంటర్‌ యాష్‌ అనే ఓ యూజర్‌ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు. అణ్వాయుధాలు ప్రధాన శక్తుల మధ్య యుద్ధాన్ని, యుద్ధ ముప్పును నిరోధిస్తాయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పిచ్చిగా నమ్ముతున్నాయి. దీనికి ఎలాన్‌ మస్క్‌ బదులిస్తూ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని పేర్కొన్నారు.

19. వైభవ్ విధ్వంసం

14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ T20 క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అతడు ఆడిన 16 ఇన్నింగ్స్‌ల్లోనే 3 సెంచరీలు సాధించడం విశేషం. IPLలో 35 బంతుల్లో, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 32 బంతుల్లో, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 59 బంతుల్లో శతకాలు బాదాడు. త్వరలోనే సీనియర్ జట్టులో చోటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

20. మీడియాపై జాన్వీ ఆగ్రహం

సెలబ్రిటీలు మరణించినప్పుడు మీడియా వ్యవహరిస్తోన్న తీరుపై నటి జాన్వీకపూర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లి శ్రీదేవి మరణించినప్పుడు అందరూ తనను టార్గెట్‌ చేశారని బాధ పడ్డారు. కొందరు తన మాటలను మీమ్స్‌గా కూడా ఉపయోగించుకున్నారని అవి చూసినప్పుడు కలిగిన బాధ మాటల్లో వర్ణించలేనని అన్నారు. తాజాగా ధర్మేంద్ర మృతి చెందినప్పుడు కూడా మీడియా అత్యుత్సాహం చూపించిందని జాన్వీ అసహనం వ్యక్తంచేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×