తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు రూ.1685 కోట్లు అందించింది. గతంలో ఏటా రూ.450 కోట్లు ఇస్తే, కాంగ్రెస్ హయాంలో ఏడాదికి రూ.850 కోట్లు అందించినట్లు సీఎంవో తెలిపింది. అలాగే, 27 వేల మందికి రూ.533 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఇచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 3.5 లక్షల మందికి రీయింబర్స్‌మెంట్‌గా రూ.1153 కోట్లు చెల్లించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో నిలబడి ఓటర్లకు తమ ఎన్నికల గుర్తులను చూపిస్తూ ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, కార్యకర్తలు పోలీసుల సూచనలను పట్టించుకోకపోగా, వారిపై తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్లలో తొలి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, అదనపు బలగాలను మోహరించారు.
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో ప్రవేశించిన నేపాలీ గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చోరీలో 50 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండిని దుండగులు అపహరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఉల్లిగడ్డ లక్ష్మీపూర్లో ఎన్నికల ధావత్‌లో ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కళ్యాణ్ అనే వ్యక్తి కత్తితో తమ్ముడు శ్రీనివాస్ పై, అడ్డువచ్చిన తల్లి లతపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్ లేరని చెప్పడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.
కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాములేరు బ్రిడ్జి వద్ద యాసిడ్ ట్యాంకర్ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. రాజమండ్రి నుండి రాయపూర్ వెళ్తున్న ట్యాంకర్‌ను, 8 గంటల పాటు రెస్క్యూ చేసి అగ్నిమాపక సిబ్బంది డ్రైవర్‌ను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాచలం ఏజెన్సీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుండే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు తమ పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, బూత్‌ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొండ వనమాల గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సింగాల వెంకటేశ్వర్లు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉన్న రాజకీయ కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల స్వయంగా మద్రాస్ బస్టాండ్, VRC సెంటర్, మార్కెట్ మీదుగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. మహిళలు, బాలబాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలలో ధైర్యాన్ని, భద్రతా వాతావరణాన్ని నింపడమే లక్ష్యమన్నారు. ఆకతాయిలపై, ఓపెన్ డ్రింకింగ్ చేసేవారిపై, అలాగే గంజాయి విక్రయించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు రాళ్లు, కత్తులతో దాడి చేయడంతో నలుగురు బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ శరత్ పవర్ స్వయంగా కొర్లపహాడ్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
మహబూబాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను, 9 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, 1338 వార్డుల్లో 266 ఏకగ్రీవం కాగా, అధికారులు ప్రస్తుతం 146 గ్రామ పంచాయతీలు, 1072 వార్డులలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లొంగిపోతుండటంతో, పల్నాడులో పోలీసులు ముందస్తు చర్యగా పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చిలకలూరిపేటలో విడదల రజిని, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డిలను గృహనిర్బంధం చేశారు.తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖ గిరిజన సంక్షేమ శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ గా రిటైర్డ్ అయిన శ్రీనివాస్ పై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆగస్టు 7న రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీనివాస్, జైల్లో ఉండగానే ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. నిన్న, బెయిల్ పై ఉన్న ఆయన ఇళ్లు విశాఖ, హైదరాబాద్, ఏలూరులో 7 చోట్ల దాడులు చేసి, డాక్యుమెంట్లు, 10 స్థిరాస్తుల పత్రాలు, నగదు, బంగారు, వెండి నగలు, ఇన్నోవా కారును ఏసీబీ సీజ్ చేసింది.
కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు నగర మేయర్‌ను ఎన్నుకోనున్నారు. వైసీపీ ఇప్పటికే తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కార్పొరేటర్లతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.
పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఈరోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్, పోలీసు 30 యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు.
అమరావతిలో జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. లోక్ భవన్ రూ.169 కోట్లు, జ్యుడిషియల్ అకాడమీ రూ.163 కోట్లు నిర్మాణాలకు, రూ.7380.70 కోట్ల నాబార్డు రుణానికి ఆమోదం తెలపనున్నారు. అలాగే, రూ.532 కోట్లతో సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం, రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన SIPB నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు.
లాస్ ఏంజెలెస్ నుంచి నేషనల్ గార్డులను ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ను ఫెడరల్ కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వలస సేవల్లో బలగాలను వినియోగించడంపై కాలిఫోర్నియా అధికారుల విజ్ఞప్తి మేరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని యూఎస్ జిల్లా జడ్జి ఛార్లెస్ బ్రేయర్ ఈ తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుండి అమలులోకి వస్తాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీలు వేర్వేరు సందర్భాల్లో ఓటుచోరీకి పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించారు. నెహ్రూ ప్రధాని కావడం, ఇందిరా తన ఎన్నిక రద్దు కాగా చట్టపరమైన రక్షణ కల్పించుకోవడం, సోనియా పౌరసత్వం రాకముందే ఓటరుగా నమోదు కావడం ఈ మూడు చోరీలని షా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ లోపమే కారణమని, ఈవీఎంలు, జడ్జీలపై నిందలు వేయడం ఆపాలని ఆయన విమర్శించారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సి రెండోసారి భారత్‌కు రాబోతున్నాడు. ఈ పర్యటనకు శతద్రు దత్తా ప్రధాన కారణం. పీలే, మారడోనాలాంటి దిగ్గజాలను గతంలో భారత్‌కు తీసుకొచ్చింది కూడా ఈయనే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీకి చెందిన శతద్రు, మొదట్లో క్రికెట్ ప్రేమికుడు, సౌరభ్ గంగూలీకి వీరాభిమాని.
రోషన్ కనకాల హీరోగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మోగ్లీ 2025. ఈ సినిమాలో సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయిక. అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమా డిసెంబర్ 12కు బదులుగా, కొన్ని కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా 13న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.