హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు, దత్తాత్రేయ, రామచందర్‌రావు, శుభలేఖ సుధాకర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సర్పంచ్ ఎన్నికలపై.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తన సొంతూరు.. రంగారెడ్డి గూడ ప్రజలు తనను ఓడించారని వాపోయారు. నా అనుకున్న ప్రజలే తన గుండెలపై కొట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంతూరు డెవలప్‌మెంట్ కోసం కోటి 50లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నది తీరంలో పురాతనమైన అమ్మవారి విగ్రహం లభించింది. నదికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన పీఠాధిపతులు సూచన మేరకు గ్రామస్తులు తవ్వకాలు చేపట్టగా.. భూమిలో నుంచి ఈ శక్తి స్వరూపం బయటపడింది. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
వనస్థలిపురం ఆటో నగర్‌లో నమి శ్రీ కన్‌స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా భారీ సెల్లార్‌ను తవ్వడంపై సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. ఇది స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. మైనింగ్ అధికారులు ముడుపులు తీసుకొని అక్రమ తవ్వకాన్ని పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల ఏర్పాట్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఇతర సదుపాయాలపై అధికారులకు తగు సూచనలు, సలహాలు అందించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య వర్గీయులు, ప్రత్యర్థి బాలరాజు ఇంటిపై ట్రాక్టర్‌తో వెళ్లి దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగాయి.
నిర్మల్ జిల్లాలోని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వగ్రామం ఎల్లపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో ఆయన బలపరిచిన అభ్యర్థికి చుక్కెదురైంది. రెండో విడత ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి మద్దతుతో పోటీ చేసిన సహదేవ్‌పై, ప్రత్యర్థి మాదస్తు భీంరావ్ 31 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్వగ్రామంలో మంత్రి అభ్యర్థి ఓటమి పాలవడం ఇదే తొలిసారి.
ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బిఆర్.నాయుడు తెలిపారు. మొదటి మూడు రోజులు లక్కీడిప్ ద్వారా.. మిగతా ఏడు రోజులు టోకెన్లు లేకుండా సర్వదర్శనం కల్పిస్తామన్నారు. రేపటి పాలకమండలి సమావేశంలో దివ్యవృక్షాల పెంపకంపై చర్చిస్తామని తెలిపారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీలోకి సీనియర్ నాయకుడు బత్తిన గంగయ్య యాదవ్.. స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో చేరారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా జనసేన కార్యాలయంకి వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరానని గంగయ్య యాదవ్ తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురం నియోజకవర్గంపై దృష్టి సారించారు. పవన్ ఆదేశాలతో గ్రామ-వార్డుల పరిధిలో కమిటీలు వేస్తున్నట్లు ఆపార్టీ నేత తాళ్లూరి రామ్ చెప్పారు. పార్టీకి చెందిన నాయకుల్లో విభేదాలు, అసంతృప్తిని తగ్గించేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మార్గంలో ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహిళల ముఠాను ప్రయాణికులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో రద్దీని ఆసరాగా చేసుకొని ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పట్టుకున్న దొంగలను పొన్నూరు రూరల్ పోలీసులకు అప్పగించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అభివృద్ధికి స్వామి ఆశీస్సులు కావాలని విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.
పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం వెలుగు చూసింది. నల్లగా ఉన్నావ్, నీవల్లే అశుభాలు అంటూ భర్తతోపాటు అత్తమామలు వేధిస్తున్నారని ఒక కోడలు అత్తింటి ఎదుట న్యాయపోరాటానికి దిగింది. పెళ్లైన రెండు నెలల నుంచే వేధింపులు మొదలయ్యాయని, అదనపు కట్నం కోసం తన బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి స్వగ్రామం చెర్లపాలంలో.. ఆమె బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఓటమితో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఝాన్సీ రెడ్డి బలపర్చిన కిరణ్ పై.. రెబెల్ నేత తిరుపతి రెడ్డి బలపర్చిన మహేందర్ గెలుపొందారు. తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో.. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైల్వే కోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ దంపతులు మోకాళ్లపై కూర్చొని రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు.
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారత్ హైకమిషనర్ ప్రణయ్ వర్మకు నిరసన తెలిపింది. రానున్న పార్లమెంటు ఎన్నికలను అడ్డుకొవాలనే లక్ష్యంతో.. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనాలని తన మద్దతుదారులకు హసీనా పిలుపునిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
సామాన్యులకు న్యాయం భారం కారాదని.. కేసులు త్వరగా పరిష్కారం కానందున కక్షిదారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సుప్రీం, హైకోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు త్వరగా పరిష్కారం కావాలని సూచించారు.
అఖండ 2 నుంచి మరో పాట విడుదలైంది. గంగాధర శంకర అంటూ సాగే గీతాన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అద్వితీయ రాసిన ఈ పాటను ఎస్.ఐశ్వర్య, ఎస్. సౌందర్య, శ్రుతి రంజని పాడారు. తమన్ సంగీతం అందించారు. దైవిక అంశాలతో.. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1,000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు.