మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీపై ప్రొడ్యూసర్ SKN తీవ్ర విమర్శలు చేశారు. శివాజీది రేపిస్ట్ మైండ్‌సేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇంట్లో ఆడవాళ్లకు జాగ్రత్తలు చెప్పేముందు మగవాళ్లకు ఆడవాళ్లను ఎలా గౌరవించాలో చెప్పాలన్నారు ఆయన. శివాజీ లాంటి ఇడియట్స్ చెప్పే మాటలను ఎవరూ వినకూడదన్నారు ప్రొడ్యూసర్ SKN.
మేడారం జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతల ఆలయానికి గ్రానైట్ నిర్మాణాలతో కొత్తరూపు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కాలంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ గత ప్రభుత్వం పెట్టిన కేసు విచారణలో భాగంగా మంత్రి సీతక్క కోర్టుకు హాజరయ్యారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజల పక్షాన నిరసన తెలిపితే.. అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ కాచిగూడలో స్థానిక కార్పొరేటర్ కన్నె ఉమ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 968 గ్రామ పంచాయతీ సర్పంచులకు స్వీట్ బాక్స్, గ్రీటింగ్ కార్డులు పంపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారాయన.
సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలోని ఆటో అదుపు తప్పి అన్నాసాగర్ చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న విజయరావు మృతి చెందారు. ఆసుపత్రికి వెళ్తుండగా కోతుల గుంపు అకస్మాత్తుగా అడ్డురావడంతో.. వాటిని తప్పించబోయి ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్‌ను రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. మారుమూల ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించడంపై సాయి ట్రస్ట్ నిర్వాహకులను వారు అభినందించారు.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ రైతు వేదికలో యూరియా యాప్‌పై రైతులకు లైవ్ డెమో ఇచ్చారు వ్యవసాయ అధికారులు. ఇకపై యాప్‌తోనే యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ చేసుకొన్న 24 గంటల్లో యూరియాను తీసుకోవచ్చంటున్నారు.
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.
హిందూపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌ను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, ఎంపీ బి.కె. పార్థసారథి ప్రారంభించారు. ఏపీలోని తిరుపతి, రేణిగుంట, హిందూపురం వంటి స్టేషన్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించామని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని కొత్తపల్లి, కామరాజుపేటలో కోడి కత్తుల తయారీ కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 200 కోడి కత్తులు, మూడు సానబెట్టే మోటార్లు, ఐరన్ ప్లేట్లను సీజ్ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కత్తులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ నిందితులపై కేసులు నమోదు చేశారు.
విజయనగరం జిల్లా రాజాం-తెర్లాం రహదారిలోని కొత్తపేట సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెర్లాం మండలానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చి.. ఆ రక్తంతో అభిషేకం చేసిన ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ నరసింహ కిషోర్.. ఇలాంటి హింసాత్మక చర్యల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా చింతల బెలగాంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో శ్మశాన వాటిక లేక.. మరణించిన ఓ దళిత మహిళ మృతదేహాన్ని పొరంబోకు భూమిలో ఖననం చేశారు గ్రామస్తులు. అయితే ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయించి మరోచోట పూడ్చిపెట్టించారు రెవెన్యూ సిబ్బంది. ఈ ఘటనపై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఖననం చేశామని.. శ్మశాన వాటికకు స్థలం కేటాయించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
అనంతపురం జిల్లా యాలేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందును అడ్డుకున్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో తమ భూములను లాక్కున్నారని చందుతో వాగ్వాదానికి దిగారు టీడీపీ కార్యకర్తలు. ఇరువర్గాల నాయకులు కర్రలతో హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్ ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.
ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్‌లో 40KGల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 3 టన్నుల పేలుడు పదార్థాలను డిటోనేట్ కాకముందే స్వాధీనం చేసుకున్నామని యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో తెలిపారు. పోలీసులకు అవసరమైన కామన్ ATS విధానాన్ని త్వరలో అమలులోకి తేవాలని డీజీపీలను కోరారు. అందరూ తెలుసుకోవాలి అనే విధానంతో కాకుండా అందరికీ తెలియజేయాలి అనే ప్రిన్సిపల్‌తో ముందుకు సాగాలన్నారు.
ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ రంగం మేక్ ఇన్ ఇండియాతో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ తెలిపారు. 2014-15 మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. 18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి 5.5లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
శ్రీలంకతో జరిగిన 3వ T20లో ఇండియా ప్లేయర్లు పలు రికార్డులు సాధించారు. ఈ గెలుపుతో T20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా హర్మన్ ప్రీత్ నిలిచారు. 77 విజయాలతో మొదటి ప్లేస్‌లో హర్మన్ ఉండగా.. 76 విజయాలతో ఆసీస్ మాజీ ప్లేయర్ మెగ్ లానింగ్ ఉన్నారు. మరోవైపు ఓ T20 మ్యాచ్లో అత్యధిక శాతం పరుగులు బాదిన బ్యాటర్‌గా షెఫాలీనిలిచారు.
ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు అగ్రకథానాయకులు చిరంజీవి, వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్ యూ రెడీ అంటూ సాగే పాట ప్రోమోను తాజాగా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.