కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న విషయాలపై వైసీపీ నేత వంగా గీత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో కుల వివక్ష పెరిగిపోయిందన్నారు వంగా గీత. దళితుల గ్రామ బహిష్కరణ, దాడి, టీచర్లే కులం పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని, చేబ్రోలులో ఓ వ్యక్తి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆకృత్యాలు పెరిగిపోయాయని.. పరిస్థితులను చూస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జైపాల్ నాయక్ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఆయన వినూత్నంగా ప్రచారం చేశారు. ఇప్పుడు తనకు ఉన్న ఆస్తి కన్నా ఒక్క రూపాయి అక్రమంగా ఎక్కువ సంపాదించినా… ఆ ఆస్తిని గ్రామ పంచాయతీ జప్తు చేసుకొవచ్చు అంటూ.. బాండ్ పేపర్ రాసి ప్రజలకు పంచుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. సర్పంచ్ అభ్యర్థి తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
హైదరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చిన్న కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో సామాజిక బాధ్యత పెంచేందుకు సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నిందితులతో కృష్ణ కాంత్ పార్క్‌ను శుభ్రం చేయించారు పోలీసులు. కార్యక్రమంలో మధుర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 25 మంది, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 మంది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెందిన 5 మంది నిందితులు పాల్గొన్నారు.
నారాయణ పేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్కూల్ ఆవరణలో క్షుద్ర పూజలు నిర్వహించారు దుండగులు. ఉదయం స్కూల్‌కు వచ్చిన అటెండర్.. ఈ విషయాన్ని గమనించి హెడ్ మాస్టర్‌కు సమాచారం అందించారు. నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు కుంకుమతో పూజలు నిర్వహించారు. ఓ క్లాస్ రూమ్ తాళానికి బొట్లు పెట్టడం కలకలం రేపుతుంది. ఘటనపై పోలీసులకు, డీఈఓకు ఫిర్యాదు చేశారు హెడ్ మాస్టర్. క్షుద్రపూజల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మెదక్ జిల్లా వెల్దుర్తి తాహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రైతు భూమి డిజిటల్ సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేశారు సర్వేయర్ శ్రీనివాస్. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. ప్లానింగ్ ప్రకారం.. రైతు నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆఫీస్‌లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా కొమరేపల్లి గ్రామపంచాయతీలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్ల కలకలం రేగింది. సర్టిఫికేట్లకు సంబంధించిన ఫిర్యాదులు అందడంతో జిల్లా అధికారులు గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించారు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సరైన ఆధారాలు లేకపోయిన 3891 బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు జిల్లా జనగణన అధికారి సికిందర్ తెలిపారు. పక్క రాష్ట్రం కర్ణాటకకు చెందిన వారికి కూడా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ సెక్రెటరీ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు.. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు కనిపించక పోవడం కలకలం రేపింది. పంచాయతీ తాళం పగులగొట్టి దాదాపు 12 సర్పంచ్, 40 వార్డు అభ్యర్థుల పత్రాలు, హన్మాపూర్ రిజిస్టర్ చోరీకి గురైనట్లు అనుమానిస్తున్నారు. అభ్యర్థులు ఆందోళన చెందగా, విషయం తెలుసుకున్న తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య గొట్లపల్లికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్‌లోని పాత మెజిస్టిక్ హోటల్‌లో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు బీభత్సం సృష్టించారు. మాస్క్‌లు ధరించిన దుండగులు సుత్తి, గడ్డపారతో షట్టర్ పగలగొట్టి లోనికి చొరబడి గోడను కూల్చి, ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని వర్కర్లు తెలిపారు. వర్కర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి బి1 క్యాంపు కార్యాలయంలో మందమర్రి మండల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడ్రన్ చెన్నూరుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై స్పందించారు. వచ్చే సమావేశం నాటికి అన్ని సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకోవాలని, స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని సూచించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఒడ్డుగూడ సమీపంలో పెద్దపులి అడుగుజాడలను అటవీ అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గ్రామాల్లో డప్పు ప్రచారం నిర్వహిస్తూ, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు గుంపులుగా వెళ్లాలని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అటవీ సిబ్బంది పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక పరికరాల వినియోగం, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, నరేంద్రబాబు వివరించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా భద్రతా నిర్వహణపై డ్రైవర్లకు సూచనలు, ప్రమాద తీవ్రతను తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన తెలియజేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంపచోడవరం కరెంట్ ఆఫీస్ వద్ద గోకవరం బస్సును వెనుక నుంచి వస్తున్న యువకులు ఢీ కొనగా ఇద్దరిల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. క్షతగాత్రుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమ పార్టీ నాయకులే తనను మోసం చేశారని రోడ్డెక్కారు సర్పంచ్ అభ్యర్థి కవిత. జనగామ జిల్లా, కూనూరు గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థికి సొంత పార్టీ నాయకుల నుంచే సహకారం కరువైందని వాపోయారు. తనకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో బీజేపీ మండల, గ్రామ నాయకులు మరో అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. పార్టీ నేతలు తనను మోసం చేశారని, అధిష్టానం కల్పించుకోవాలని ఆమె రోడ్డెక్కి విజ్ఞప్తి చేశారు.
విజయవాడ భవానీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీ లక్ష్మిరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాఖలు చేసిన కేసులో కోర్టు తీర్పు మేరకు భవానీపురం, జోజి నగర్ వద్ద 42 ఫ్లాట్లను కూల్చివేశారు. సుమారు 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి. 2 ఎకరాల 40 సెంట్ల భూమికి సంబంధించిన కేసులో సొసైటీ గెలిచింది. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఫ్లాట్ యజమానులు, పోయిన ఇళ్ల కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో పక్క, తమ అపార్ట్‌మెంట్‌కు దారిని మూసివేస్తూ గోడలు కడుతుండడంపై పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు కూడా ఆందోళన చెందుతున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. అలాగే కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజూ, అర్జున్ రామ్ మేగ్వాల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్ నారాయణ సింగ్ తదితరులు పూలమాలలు వేసి గౌరవం ప్రకటించారు.
శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ బోటు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశీయులు వచ్చిన బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు పోలీసులు. కెరటాలకు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని.. మత్స్యకారుల సాయంతో తీసు కొచ్చినట్లు ప్రకటించారు. మూడ్రోజుల కిందట మూడు బోట్ల సాయంతో ఒడ్డుకు చేర్చిన బంగ్లాదేశీయులను.. పోలీసులు నరసన్నపేట జైలుకు తరలించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు సమాచారం. అటు అనుమతులు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వీరిపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
అమెరికా, ఐరోపా దేశాల్లో వలసల ఆంక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే.. వాటి సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందన్నారు. చివరకు ఆ దేశాలే నష్టపోతాయని హెచ్చరించారు. చాలా సందర్భాల్లో వాళ్లే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాయ్‌పూర్ వన్డేలో కోహ్లీ, గైక్వాడ్ సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ.. వరుసగా రెండో మ్యాచ్‌లో కోహ్లీ శతకం సాధించాడు. ఈ సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీతో చెలరేగాడు. 105 రన్స్ చేసి గైక్వాడ్ అవుటయ్యాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు.. 195 పరుగులు జోడించారు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ.
విశాఖపట్నంలో సందడి చేసింది మోగ్లీ సినిమా టీమ్. రోషన్ కనకాల హీరోగా, విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
మా ‘మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిల్మ్ అని, అందరూ ఆదరించాలని కోరారు.