కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు టాలీవుడ్ నటుడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ సినిమా హబ్ నిర్మించాలనే ప్రభుత్వం ఆలోచనపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ తెలంగాణలో ఫిల్మ్ సిటీ నిర్మిస్తే.. అందరికీ మంచిదని చెప్పుకొచ్చారు.
ఆమ్రపాలికి హైకోర్టులో బిగ్‌షాక్ తగిలింది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల మాటలు కోటలు దాటాయని.. చేతలు గడప దాటలేదని విమర్శించారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో ముందడుగు పడలేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్థకమని మూడు ముక్కల్లో తేల్చిపారేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి. ఇలాంటి చారిత్రాత్మక సమ్మిట్‌లో పాల్గొనటం తన అదృష్టమన్నారు. ఈ సమ్మిట్ భారతదేశ రూపు రేఖలను మారుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 3 ట్రిలియన్ ఎకానమీ విజన్‌పై ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ విజన్‌ను తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నెరవేర్చి తీరుతుందన్నారు.
ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాఖా పాలేరులో బీఆర్‌ఎస్ వర్గీయుల అరాచకం చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ గ్రామం బీఆర్‌ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామం కావడంతో ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇండిగో సంక్షోభంపై విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. జరిగిన పరిణామాలను రాజ్యసభలో సభ్యులకు వివరించారు ఆయన. ఇండిగో సంక్షోభాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదని చెప్పారు. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే ఇండిగోలో సమస్య తలెత్తిందని క్లారిటీ ఇచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామన్నారు.
మేడ్చల్ జిల్లా పోచారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కొర్రెములలో పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించారని హైడ్రాకు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు పార్క్ స్థలం చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి స్థలాన్ని కాపాడారు.
హవాలా డబ్బు వ్యవహారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కలకలం రేపింది. హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించి.. 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు దుండగులు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సమాచారంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోపిడీ చేసిన దుండగుల కోసం వెతుకుతున్నారు పోలీసులు.
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో భారీ చోరీ జరిగింది. సోంపేటలోని కోర్టుపేట వీధిలో 30 తులాల బంగారం అపహరించారు దుండగులు. మనోజ్ కుమార్ అనే వ్యాపారి ఇంట్లో దుండగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహేందర్ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఝాన్సీరెడ్డి స్వగ్రామం కావడంతోనే తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.
విజయనగరం జిల్లా గుర్లలో ఆందోళన చేస్తున్నారు రైతులు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దంటూ గుర్ల మండలంలో 5 గ్రామాల రైతులు రోడ్డెక్కారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రైతు సంఘాల మద్దతుతో ఆందోళన బాట పట్టిన రైతాంగం.. స్టీల్ ప్లాంట్ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు.
11 ఏళ్ల అంధ బాలుడు మురారి హర్షవర్ధన్ ప్రపంచంలోనే మొదటిసారిగా నాన్-స్టాప్ 200 కిలోమీటర్ల బ్లైండ్ మల్టీ టాస్క్ రోడ్ స్కేటింగ్ మారథాన్కు శ్రీకారం చుట్టాడు. సోమవారం కర్ణాటక బోర్డర్, నంగలి టోల్‌గేట్ వద్ద స్కేటింగ్ ప్రారంభించిన హర్షవర్ధన్ 10 గంటలకు బంగారుపాళ్యం మండలం చేరుకున్నాడు. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ రికార్డు యత్నాన్ని వజ్ర వరల్డ్ బుక్, వండర్ బుక్, జీనియస్ బుక్ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఐ భాను ప్రకాష్ రెడ్డి గన్ మిస్సింగ్ కేసుపై ఆరా తీయడానికి ఈ తనిఖీ జరిగింది. గన్ ఎలా మిస్సయ్యిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలించిన వీసీ, ఎస్ఐ స్వభావం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా చోడవరంలో గొర్రెల వ్యాపారి సాయికుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గొర్రెలు కొనడానికి కోటబొమ్మాలి నుంచి చోడవరం వచ్చిన సాయికుమార్ మృతదేహం కాలువలో కనిపించింది. దీనిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శివారులో పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. ముంబై నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ. 1 కోటి 1.20 లక్షల హవాలా నగదును ఓ కారులో గుర్తించి సీజ్ చేశారు. ఈ కేసులో కారులో ప్రత్యేక చిన్న అరలు ఏర్పాటు చేసి డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. హరిపురం శివారులో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లిన ఘటనపై దర్యాప్తు చేస్తుండగా ఈ పట్టివేత జరిగింది. మొత్తం రూ. 20 కోట్లకు పైగా నగదు తరలింపుపై అనుమానాలతో పోలీసులు బెంగళూరు, చెన్నైల్లో దర్యాప్తు చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి దిలీప్ ప్రతిష్ఠాత్మక ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన దిలీప్ 2025 గేట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 296వ ర్యాంకు సాధించి, ఇంటర్వ్యూలో 22వ ర్యాంకుతో ఈ గొప్ప ఉద్యోగాన్ని పొందాడు. గతంలో 2023లో 542వ ర్యాంకు సాధించినా, ఇస్రో లక్ష్యంతో పట్టువదలక ప్రయత్నించి విజయం సాధించిన దిలీప్‌ను గ్రామస్తులు అభినందించారు.
భారత్‌తో బంధాన్ని అమెరికా బలోపేతం చేసుకోవాల్సిందే అని అమెరికా నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2026 నొక్కి చెప్పింది. దీనిని అమెరికా చట్టసభ సభ్యులు విడుదల చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పొత్తులు, భాగస్వామ్యాల ఆవశ్యకతపై ఇందులో పేర్కొన్నారు. చైనాతో వ్యూహాత్మక పోటీలో భాగంగా.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని వివరించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందేందుకు భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు పేర్కొంది. ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ -2026ను కాంగ్రెషనల్ నాయకులు విడుదల చేశారు. దీనిలో అమెరికా రక్షణ మంత్రి భారత్‌తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకుతీసుకెళ్లాలని సూచించారు. ఇందుకోసం విదేశాంగశాఖ మంత్రితో సమన్వయం చేసుకోవాలని వెల్లడించింది.
వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయాంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో ప్రధాని మోదీ దాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించాడు.
కథానాయకుడు వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఈనెలలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ చిత్ర టైటిల్‌ను ఈనెల 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.