E-Paper
Advertisement

Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

1. క్యాలెండర్ ఆవిష్కరణ

సచివాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డైరీ, క్యాలెండర్‌లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జోగారెడ్డి, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.

2. కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్

జనగామ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ శవయాత్ర నిర్వహించారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి డిమాండ్ చేశారు.

3. జి చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా, సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఒట్టెం కరివెన రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని ఆయన సూచించారు. ఏదుల నుంచి నీటి తరలింపునకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అన్యాయమని అన్నారు.

4. ట్రాక్టర్ బ్రోల్తా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి పదిమంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చీపురుగూడెం నుంచి పొలం పనులకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

5. మృతదేహం లభ్యం

కాకినాడ జిల్లా జగ్గంపేట పోలవరం కాలువలో నైనపు వెంకటరమణ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్రప్పాలెం వెళ్లే దారిలో నీటిపై మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అతను ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డాడా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

6. ఖమ్మం వైఎస్సార్ కాలనీలో దొగలు బీభత్సం

ఖమ్మం వైఎస్సార్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి, అడ్డుకోబోయిన వృద్ధ దంపతులపై కత్తితో దాడి చేసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

7. యువకుల హల్‌చల్

సూర్యాపేట జిల్లా కోదాడ-ఖమ్మం జాతీయ రహదారిపై కొందరు యువకులు ప్రమాదకరమైన బైక్ విన్యాసాలతో హల్చల్ చేస్తున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా స్టంట్లు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ పోకిరీల చేష్టల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

8. బీఆర్ఎస్ నేతల నిరసన

హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేయవద్దని, సర్కిల్‌ను సైబరాబాద్ జోన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆరంఘర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాను పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్ట్ చేశారు.

9. జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

సంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ ఎదుట జీవో 229 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఈ జీవో వల్ల వైద్యుల ప్రాధాన్యత తగ్గి.. బ్యూరో క్రాట్ల ప్రాధాన్యత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ను సర్కార్ నిర్వీర్యం చేసి.. టీజీఎంసీ అధికారులను తమ గప్పిట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు.

10. భారీ బైక్ ర్యాలీ

మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. కోనేరు సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఆయన.. స్వయంగా హెల్మెట్ ధరించి సిబ్బందితో కలిసి బైక్ నడిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్పీ కోరారు.

11. హైస్కూల్‌లో ఆందోళన

విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేట జెడ్పీ హైస్కూల్‌లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు ఆశీర్వాద్‌ను తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో నిలదీశారు. బాధితులు కన్నీరు పెట్టుకోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంకు ఫిర్యాదు చేసి, ఆందోళన చేపట్టారు.

12. కార్డెన్ సెర్చ్

పల్నాడు జిల్లా బలిజేపల్లిలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 31 బైకులు, 4 ఆటోలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.

13. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

విజయవాడలో నరేడ్కో సెంట్రల్ జోన్ డైరీ-2026ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ‘ఛాంపియన్ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ రిఫార్మ్స్’ బిరుదుతో సత్కరించారు. భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు సులభతరం చేశామని మంత్రి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

14. 60 శాతం పనులు పూర్తి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తామన్న మంత్రి ప్రకటన తమ ఉద్యమ ఫలితమేనని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 60 శాతం పనులు పూర్తి చేశామని, ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడంతో తాము ఒత్తిడి తెచ్చామన్నారు. ఈ విజయం పల్నాడు ప్రాంత ప్రజలకే చెందుతుందని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

15. సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కూనా రాజు చందు, ఎస్.నంజప్ప వద్ద నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి తెలిపారు.

16. ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇందులో 31 ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, 35 ఇతర సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.

17. వ్యాఖ్యలు హాస్యాస్పదం

భారత్‌తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు గిరాకీ పెరిగిందని, ఇక ఐఎంఎఫ్ అప్పులు అవసరం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్భాలు పలికారు. అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్, నిధుల కోసం తన విమానయాన సంస్థను అమ్మేందుకు సిద్ధమైంది. కేవలం కొన్ని దేశాలే వీటిపై ఆసక్తి చూపుతుండగా, ఖవాజా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

18. ఆభరణాల వర్తక సంఘం కీలక నిర్ణయం

బిహార్‌లోని ఆభరణాల వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా మాస్కులు, హిజాబ్, హెల్మెట్‌లతో ముఖం కప్పుకొని వచ్చే వారికి ఆభరణాలు చూపించకూడదని, విక్రయించకూడదని నిర్ణయించింది. వినియోగదారులు, దుకాణదారుల రక్షణ కోసమే ఈ నిబంధన తెచ్చామని ఏఐజేజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ వర్మ స్పష్టం చేస్తూ వెంటనే అమలులోకి తెచ్చారు.

19. భారత్‌కు ఎదురుదెబ్బ

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఈనెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో పాక్‌పై అద్భుత ప్రదర్శన చేసిన తిలక్.. కోలుకోవడానికి సమయం పట్టనుండటంతో మెగా టోర్నీలో అతని లభ్యతపై ఆందోళన నెలకొంది.

20. అరుదైన ఘనత

ధురంధర్‌ చిత్రంతో ఆకట్టుకున్న సారా అర్జున్ అరుదైన ఘనత సాధించారు. ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్, విజయ్‌లను వెనక్కి నెట్టి ఆమె టాప్ వన్ స్థానంలో నిలిచారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సారా, ఈ సినిమాతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసి ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ పొందుతున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×