E-Paper
Advertisement

Top 20 News Today: నీటి వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మున్సిపల్ ఆఫీస్‌ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు

Top 20 News Today: నీటి వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మున్సిపల్ ఆఫీస్‌ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు

1. సంక్రాంతి సంబురాలకు సీఎం హాజరు

సీఎం రేవంత్ రెడ్డిని.. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబురాలకు హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు. వారితో పాటు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

2. సీఎంకు ఆహ్వాన పత్రిక

సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఈవో, అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 21 నుంచి 23 వరకు బాసరలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న వసంతపంచమి మహోత్సవాలు-2026కు హాజరుకావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

3. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ ఆఫీసర్లపై మీడియా.. సోషల్ మీడియా లో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదన్నారు. ప్రధానంగా మంత్రులు, ఆఫీసర్ల మీద అభియోగాలు చేయరాదన్నారు.

4. నీటి వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. సముద్రంలో వృథాగా కలిసే 3 వేల టీఎంసీల నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు అందించడమే లక్ష్యమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను తామెప్పుడూ అడ్డుకోలేదన, పోలవరం మిగులు జలాలను తెలంగాణ కూడా వాడుకోవచ్చని సూచించారు. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.

5. మాచర్ల ఎమ్మెల్యే రక్తదానం

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా రక్తదానం చేసి యువతకు స్ఫూర్తినిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఆయన, వివేకానందుని ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సేవ, ఆత్మవిశ్వాసంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

6. చైనా మాంజాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్‌లో నిషేధిత చైనా మాంజాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ దాడుల్లో 6.90 లక్షల రూపాయల విలువైన 345 చైనా మాంజా బండిల్స్‌ను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ దారం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

7. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలాన్ని జడ్చర్ల రెవెన్యూ డివిజన్‌లో కలిపే ప్రతిపాదనను నిరసిస్తూ అఖిలపక్ష జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మండలాన్ని మార్చడం సరికాదని, కల్వకుర్తి డివిజన్‌లోనే కొనసాగించాలని నిరంజన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు.

8. కోడి బరులు ధ్వంసం

ఎన్టీఆర్ జిల్లా ఐతవరం గ్రామంలో కోడి పందాల బరులు ధ్వంసం చేశారు పోలీసులు. గ్రామ శివారులోని మామిడి తోటల్లో..సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు కొందరు వ్యక్తులు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్‌తో బరులను ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంగించి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

9. చెక్కుల పంపిణీ

రాయచోటిలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 150 మంది లబ్ధిదారులకు కోటి 70 లక్షల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే నియోజకవర్గంలో 8.37 కోట్లు పేదలకు అందించిందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

10. ప్రజా సంఘాలు నిరసన

అనకాపల్లి రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టడాన్ని ఖండిస్తూ మచిలీపట్నంలో ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో అప్పలరాజుపై పెట్టిన కేసులు అక్రమమని, తక్షణమే వాటిని తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు.

11. రైలు పట్టాల పక్కన తల లేని మృతదేహం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన యువకుడి మృతదేహం తల లేకుండా పడివుంది. మృతుడిని మొద్దులపల్లెకు చెందిన శివగా గుర్తించారు. తల లేకపోవడంతో ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైలు ప్రమాదమా లేక జంతువుల దాడా అనే కోణంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12. మున్సిపల్ ఆఫీస్‌ని ముట్టడించిన బీజేపీ శ్రేణులు

కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. ఓటరు జాబితాలోని దొంగ ఓట్లను తొలగించాలని.. మున్సిపల్ ఆఫీస్‌ను బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సర్ది చెపుతున్నా బీజేపీ శ్రేణులు వినకపోవడంతో ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

13. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లోయలో పడిన యువకుడు

అన్నమయ్య జిల్లా హార్సిలీ హిల్స్‌లో ప్రమాదం జరిగింది. తిరుపతికి చెందిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ అదుపుతప్పి లోయలో పడిపోయాడు. గమనించిన పోలీసులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీశారు. తీవ్ర గాయాలైన యువకుడిని మెరుగైన చికిత్స కోసం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.

14. పలాస ఆలయంలో భారీ చోరి

శ్రీకాకుళం జిల్లా పలాసలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న సీసీ కెమెరా వైర్లు తొలగించి చోరీకి పాల్పడ్డారు దుండుగులు. ఆలయ తాళాలు పగలగొట్టి స్వామివారి విగ్రహాలకు ఉన్న బంగారు,వెండి నామాలతో పాటు.. రెండు హుండీలలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత.. ఆలయాన్ని మూసేసి ఉంచారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

15. ప్రముఖ కన్నడ రచయిత్రి మృతి

ప్రముఖ కన్నడ రచయిత్రి ఆశా రఘు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మల్లేశ్వరంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. శనివారం ఉదయం ఆమె గది తలుపులు పగులగొట్టి చూడగా నిర్జీవంగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె, సీరియల్స్‌కు సంభాషణలు కూడా రాశారు. పోలీసులు దీనిని అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16. కైట్ ఫెస్టివల్

ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని సబర్మితి నదీతీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలలో మోడీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా పాల్గొన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ, ఛాన్సలర్‌తో కలిసి పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు.

17. ట్రంప్ ఆదేశం

వెనిజుయెవలా ముడి చమురు ఆదాయాన్ని అధ్యక్షుడు మదురో దంపతుల వ్యక్తిగత న్యాయ సహాయానికి వినియోగించకూడదని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ నిధులను ప్రైవేటు అవసరాలకు వాడితే ఆ దేశ సుస్థిరతకు విఘాతం కలుగుతుందని ఆయన చెప్పారు. చమురు ఆదాయం కేవలం ప్రభుత్వ, దౌత్య అవసరాలకే వాడాలని స్పష్టం చేస్తూ ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

18. సీబీఐ విచారణలో హీరో విజయ్

తమిళనాడులో కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో విజయ్ నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. 41 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఇప్పటికే అధికారులు ఒక బస్సును కూడా సీజ్ చేశారు.

19. వివాదంగా మారిన సంజయ్ బంగర్ వ్యాఖ్యలు

భారత్-న్యూజిలాండ్ వన్డేలో వాషింగ్టన్ సుందర్‌కు కె.ఎల్. రాహుల్ తమిళంలో సూచనలివ్వడంపై సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందీ కంటే తమిళంలోనే సుందర్ సూచనలను త్వరగా గ్రహించాడని వరుణ్ ఆరోన్ అనగా, తాను “జాతీయ భాష”కే ప్రాధాన్యమిస్తానని బంగర్ సమాధానమిచ్చాడు. భారతదేశానికి అధికారిక భాషలే తప్ప జాతీయ భాష లేదని నెటిజన్లు ఆయనను విమర్శిస్తున్నారు.

20. తన సత్తాను మరోసారి చాటిన మెగాస్టార్

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన సత్తాను మరోసారి చాటారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన శంకర వరప్రసాద్ సినిమా.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. సినిమా బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×