E-Paper
Advertisement

Top 20 News Today: మేడారం.. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, హరీష్ రావు విమర్శలపై అద్దంకి స్పందన

Top 20 News Today: మేడారం.. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, హరీష్ రావు విమర్శలపై అద్దంకి స్పందన

1. మేడారం.. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు

మేడారం జాతరలో చిన్నారుల రక్షణ కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సు ఎక్కే సమయంలోనే పిల్లలకు QR కోడ్ ట్యాగ్‌లు కడతామని, దీనివల్ల తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. కుల గణన ఆధారంగానే పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.

2. జగన్ పై మంత్రి కొల్లు ఫైర్

అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే తుక్కు రేగ్గొడతాం అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గత ఐదేళ్ల పాలనలో భూకబ్జాలు, బియ్యం దోపిడీ జరిగాయని ఆరోపించారు. సర్వే రాళ్ల పేరుతో జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

3. హరీశ్ రావు ఆరోపణలు

సింగరేణి టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.

4. హరీష్ రావు విమర్శలపై అద్దంకి స్పందన

హరీష్ రావు విమర్శలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు బొగ్గు టెండర్లు ఎలా దక్కాయని ప్రశ్నించారు. హరీష్ రావు, కేటీఆర్ మాటలను సీఎం పట్టించుకోరని, అబద్ధాలను ఎన్నిసార్లు చెప్పినా అవి నిజం కావని ఆయన స్పష్టం చేశారు.

5. పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద డ్రగ్స్ తీసుకుంటూ ఒకే కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 10 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

6. యజమానిపై క్రిమినల్ కేసు

నాంపల్లి ప్రమాదంలో ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ చేయడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమాని సతీష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

7. బీఆర్ఎస్ సంచలన ప్రకటన

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌ను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ సంచలన ప్రకటన చేసింది. ఈనెల 23న జరిగిన డిబేట్‌లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావును యాంకర్ వెంకటకృష్ణ అవమానించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏబీఎన్ యాజమాన్యం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

8. రథసప్తమి వేళ ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి వేళ ఉద్రిక్తత నెలకొంది. జిల్లా యంత్రాంగం పోలీసుల సమన్వయ లోపంతో క్యూలైన్లు గంటల తరబడి నిలిచిపోయాయి. టిక్కెట్లు ఉన్నా అనుమతించకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు తక్షణమే స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

9. వేటకొడవలితో అన్నను నరికి చంపిన తమ్ముడు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో పొలం గట్ల వివాదం దారుణ హత్యకు దారితీసింది. సరిహద్దు గొడవతో తమ్ముడు ఈరెగౌడ, తన అన్న రాధాకృష్ణను వేటకొడవలితో నరికి కిరాతకంగా చంపాడు. తలను వేరు చేసి, మరికొందరిని చంపుతానని బెదిరించి నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

10. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్లలో కరెంట్ షాక్ ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. కంది చేను రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి గణేష్, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. వీరి బైకు కూడా పూర్తిగా దగ్ధమైంది.

11. అంబులెన్స్‌లో ప్రసవం

గుంటూరు జిల్లా తెనాలిలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో, ఈఎంటి మల్లెల శంకర్ అంబులెన్స్‌లోనే గర్భిణీకి సురక్షితంగా ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

12. 3 కే రన్

రిపబ్లిక్ డే పురస్కరించుకుని హనుమాన్ జంక్షన్‌లో డ్రగ్స్ & మద్యపాన రహిత సమాజం కోసం 3కే రన్ నిర్వహించారు. విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం ఈ పరుగును ప్రారంభించారు. ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామాన్ని అలవరచుకోవాలని వారు పిలుపునిచ్చారు.

13. భక్తజన సంద్రం

రథసప్తమి, ఆదివారం కలిసి రావడంతో శ్రీకాకుళం జిల్లా శివసాగర్ బీచ్‌కు భక్తులు పోటెత్తారు. ఇసుకతో లింగాకారం చేసి పాయసం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

14. బైక్‌పై వెళ్తుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన నల్లమిల్లి శ్రీనివాసరావు బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. తాళ్లపాలెం వద్ద గుండెపోటుతో అదుపుతప్పిన బైక్.. నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టి పడిపోయింది. స్థానికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

15. తలొగ్గేది లేదు.. టీవీకే అధినేత

ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, దేనికీ రాజీపడే ప్రసక్తే లేదని టీవీకే అధినేత విజయ్ అన్నారు. టీవీకేపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. తమిళనాడులో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు.

16.మోదీ పిలుపు

దేశంలో నిర్వహించే అన్ని ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని.. దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన్న బాధ్యత అని అన్నారు.
మోదీ పిలుపు

17.మరో చిన్నారి నిర్భందం

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరు సంచలనంగా మారింది. ఐదేళ్ల బాలుడి ఘటన మరువకముందే.. ఈక్వెడార్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి క్లోయి రెనెటాను, ఆమె తండ్రి ఎల్విస్ జోయెల్‌ను అధికారులు నిర్బంధించారు. అక్రమంగా దేశంలో ఉన్నారనే కారణంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.

18. స్వరం మార్చిన ట్రంప్

అఫ్గానిస్థాన్ యుద్ధంపై నాటో దేశాలను విమర్శించిన డొనాల్డ్ ట్రంప్ తన స్వరం మార్చారు. యూకే సైనికుల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అఫ్గాన్‌లో ప్రాణాలర్పించిన 457 మంది యూకే సైనికులు, గాయపడిన వారిని గొప్ప యోధులుగా అభివర్ణించారు.

19. జకోవిచ్ ఘనత

గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 400 మ్యాచ్‌లు నెగ్గాడు సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరే క్రమంలో మూడో రౌండ్‌లో బొటిక్‌ వాండిపై గెలిచాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా జకోవిచ్‌ ఘనత సాధించాడు.

20. డ్యాన్స్ అదుర్స్

మన శంకరవరప్రసాద్‌ గారులో చిరంజీవి, వెంకటేశ్‌ కాంబోలో రూపొందిన అదిరిపోద్ది సంక్రాంతి సాంగ్ ఫుల్ వీడియో రిలీజైంది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను నకాశ్‌ అజీజ్‌, విశాల్‌ దడ్లానీ పాడారు. చిరు, వెంకీల స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×