బీఆర్ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేక అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని అది శ్రీనివాస్ విమర్శించారు. సొంత పార్టీ నేత కవిత చేసిన అవినీతి ఆరోపణలకే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు ముఖం చాటేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌పై నిందలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లా బ్లో అవుట్ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సందర్శించారు. బాధితులను పరమార్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక.. ఎవరిళ్లకు వారిని పంపుతామని చెప్పారు. బాధితులకు అందిస్తున్న వసతి సౌకర్యాలపై ఎమ్మెల్యే, తదితర నాయకులు ఆరా తీశారు.
జనగామ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ రైతు తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నారు. జఫర్‌గఢ్ మండలానికి చెందిన ఆయన.. వినతిపత్రం అందజేసిన అనంతరం ఇలా ఆవేదన వ్యక్తం చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్సై చిరంజీవి పట్టుకున్నారు. వర్ధమానుకోట, పేరబోయినగూడెం ప్రాంతాల్లో దాడులు చేసి మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా రాజీవ్ నగర్ కాలనీలోని ఓ ఫాంహౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. బాతులు నీళ్లు తాగే తొట్టిలో పడి రన్విత్ కుమార్ అనే బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు పనిలో ఉండగా.. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు తొట్టిలో పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్‌లో యాకుబ్ షావలి బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మత పెద్దల ఆధ్వర్యంలో గంధం ఊరేగింపు నిర్వహించి, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక పశువుల సంత వద్ద విగతజీవిగా పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదానికి పాల్పడే 12 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వీరికి సీఐ శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇచ్చి, సత్ప్రవర్తన కోసం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పండుగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.
సిద్దిపేట జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో కుల వివక్షే పెళ్లి నిరాకరణకు కారణమని తేలింది. ప్రేమికుడు ప్రణయ్ తిరస్కరించడంతో మనస్తాపం చెందిన ఆమె ఈ నెల 2న ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రణయ్‌ను అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
మద్రాస్ హైకోర్ట్‌లో తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపంపై ఏకసభ్య ధర్మాసనం తీర్పును సమర్థించింది మద్రాస్ హైకోర్ట్. ఈ మేరకు మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. తిరుప్పరంకుండ్రం వద్ద ఉన్న గుట్టపై ద్వీపం వెలిగించవద్దని ఆగమశాస్త్రంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు పిటిషనర్లు. దీంతో..జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ తీర్పునిచ్చారు.
టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడి,ఏసీబీ అధికారులకు సూచించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు, సలహాలు ఇవ్వాలంది
తిరుపతి మారుతీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమశేఖర్ అనే వ్యక్తి తనతో వివాహేతర సంబంధం ఉన్న సాంబలక్ష్మి అనే మహిళను గొంతు కోసి చంపి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదమే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతికత పెరిగినా సహజ వాయువు బావులపై ఇంకా పూర్తి నియంత్రణ సాధించలేకపోవడంపై సైంటిస్ట్ డా. సి.వి. సర్వేశ్వర శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పాశర్లపూడి బ్లో అవుట్ కలిగించిన అనారోగ్య సమస్యలను ఆయన గుర్తుచేశారు. గ్యాస్ నిల్వలను వెలికితీసేటప్పుడు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆయన సూచించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో పార్లమెంట్ అగ్రికల్చర్ కమిటీ., సినీ రచయిత విజయేంద్రప్రసాద్, నటి సురేఖ వాణి, సుప్రిత.. ప్రొడ్యూసర్ లోహిత్.. కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత వెంకట్ నారాయణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. సగటు ఏక్యూఐ 354గా నమోదవడంతో ప్రజలు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు జేఎన్‌యూ అధ్యయనంలో వెల్లడైంది. పీఎం 2.5 కణాల ద్వారా ఇవి రక్తంలోకి చేరి న్యుమోనియా, చర్మ వ్యాధులు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల భారత్‌పై సుంకాలు పెంచే అవకాశం ఉందని, ఈ విషయం ప్రధాని మోదీకి తెలుసని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌పై 25శాతం టారిఫ్ విధించామని, ఆ ఒత్తిడి వల్లే భారత్ ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటోందని సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు.
15 వేల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారిని ఈపీఎఫ్‌వో పరిధిలోకి చేర్చే అంశంపై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 11 ఏళ్లుగా వేతన పరిమితి సవరించకపోవడంతో చాలామంది సామాజిక భద్రత కోల్పోతున్నారని ధర్మాసనం పేర్కొంది. కనీస వేతనాలు కూడా 15 వేలు దాటిన నేపథ్యంలో, ఈ పరిమితి పెంపుపై పిటిషనర్ విన్నపాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది.
తమ పార్టీ గీతను తాను ఎన్నడూ దాటలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. తన వ్యాసాలను మీడియా పూర్తిగా చదవకుండా, కేవలం హెడ్‌లైన్ల ఆధారంగా వివాదాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్వానీని కేవలం గౌరవ సూచికంగానే ప్రశంసించానని, మోదీని పొగిడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఖండించారు. పార్టీతో తనకు 17 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరిన ఆయన, అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక వన్డే సిక్సర్ల రికార్డును అధిగమించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని దాటిన రోహిత్, తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో మెరిశారు.
తన పెళ్లిపై వస్తున్న రూమర్లను ఖండించారు నటి మీనాక్షి చౌదరి. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని, అలాంటి వార్తలు విని అలసిపోయానని స్పష్టం చేశారు. అలాగే లక్కీ భాస్కర్ తర్వాత తల్లి పాత్రలు చేయనన్న వార్తల్లో నిజం లేదని, కథ బాగుంటే ఎలాంటి పాత్రకైనా సిద్ధమని తెలిపారు. ఆమె నటించిన అనగనగా ఒక రాజు జనవరి 14న విడుదల కానుంది.