రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్, డీజిల్ కార్లకు గుడ్ బై చెప్పి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చుకునే వాహన యజమానులకు రూ. 50,000 అందించాలని భావిస్తోంది. ఇందుకోసం EV పాలసీ 2.0ను తీసుకురాబోతోంది. ఈ నిర్ణయం కొత్త EV అమ్మకాలను ప్రోత్సహించడంతో పాటు ఉన్న వాహనాలను మార్చడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత EV పాలసీని మార్చి 2026 వరకు లేదంటే సవరించిన పాలసీని నోటిఫై చేసే వరకు ఢిల్లీ ప్రభుత్వం పొడిగించింది. సంప్రదింపుల తర్వాత 2026 ఫస్ట్ క్వార్టర్ లో కొత్త పాలసీని అమలు చేయాలని భావిస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈవీ పాలసీ ప్రకారం.. పెట్రోల్, డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా రీట్రోఫిట్ చేయించుకోవాలి. అలా చేయించుకున్నందుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ. 50,000 అదించాలని భావిస్తోంది. అయితే, ఈ ప్రయోజనం మొదటి 1,000 కార్లకే పరిమితం చేయాలని భావిస్తోంది. రెట్రోఫిట్టింగ్ అంటే, ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ను ఏర్పాటు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాన్ని ఇకపై ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడం అన్నమాట.
రెట్రోఫిట్టింగ్ ప్రజలను కొత్త ఈవీలను కొనుగోలు చేయడానికి బదులుగా, ఉన్న వాహనాలనే కాలుష్యం లేకుండా మార్చుతుంది. అందుకే, గత కొద్ది నెలలుగా ఈ విధానం ప్రజల దృష్టిని బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ ప్రక్రియ కాస్త ఖరీదు కావడంతో, ఎక్కువ మంది అటుగా మొగ్గు చూపడం లేదు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు వాహన యజమానులకు ప్రోత్సాహకాలు అందించి రెట్రో ఫిట్టింగ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయి. రోడ్లపై అధిక కాలుష్య కారకాలను క్రమంగా తొలగిస్తూ, క్లీనర్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
రెట్రోఫిటింగ్ కోసం ఢిల్లీ సర్కారు EV పాలసీ 2.0ను తీసుకొచ్చింది. ఢిల్లీలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడాన్ని వేగవంతం చేయడానికి ఈ ప్రణాళికను తీసుకొచ్చింది. ప్రభుత్వం వినియోగదారుల సబ్సిడీలను పునరుద్ధరించడం, స్థానిక తయారీని పెంచడం, EV వృద్ధికి సపోర్ట్ గా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ఆలోచనలు చేస్తోంది. తొలుత ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ప్రభుత్వం ఫోక్ పెట్టింది. ఈవీలు కొనే వారికి ప్రోత్సహకాలు అందిస్తుంది. ప్రతిపాదిత సబ్సిడీ ఒక్కో వాహనానికి రూ. 21,000 ఇస్తుంది. మహిళా కొనుగోలుదారులకు రూ. 30,000 అందిస్తుంది. ఈ ప్రయోజనాన్ని లక్ష ఈవీల వరకు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. అటు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి సుమారు రూ.1 లక్ష వరకు సబ్సిడీ అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల రుణాలను సులభతరం చేయడంతో పాటు, పాలసీ వడ్డీ రాయితీ పథకాన్ని కూడా సిఫార్సు చేస్తుంది. అర్హత కలిగిన కొనుగోలుదారులకు రుణ వడ్డీలో 5 శాతం వరకు ప్రభుత్వం కవర్ చేస్తుంది.
Read Also: బజాజ్ చేతక్ కొత్త వేరియంట్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!