దేశంలో జనగణన తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు గృహాల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు బాబు. వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేయాలని కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు చంద్రబాబు.
ఐడెన్ ఏఐ హైదరాబాద్ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు చేతులమీదుగా ప్రారంభించారు. అధునాతన కృత్రిమ మేధస్సుకు ప్రపంచ కేంద్రంగా తెలంగాణ పోషిస్తున్న.. కీలక పాత్రలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. రాష్ట్రంలోని సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, ప్రతిభావంతుల బృందం విధానాల పట్ల.. ఐడెన్ ఏఐ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ కంపెనీలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందంటూ ట్వీట్ చేశారు.
భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనీపత్ మార్గంలో పరుగులు తీసేందుకు సర్వం సిద్ధమైంది. నార్తర్న్ రైల్వేస్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ పర్యావరణ హిత రైలును జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.
గ్రామీణ భారతాన్ని బలోపేతం చేసేందుకు ఇండియా పోస్ట్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు చేతులు కలిపాయన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ భాగస్వామ్యం ద్వారా ఎరువుల డిజిటల్ ట్రాకింగ్ చేపట్టి నకిలీల నుంచి రైతులకు రక్షణ కల్పిస్తామన్నారు.
సంక్రాంతి సమరానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. బాదం, పిస్తా, కీమా వంటి రాజభోగంతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఈ పుంజులు ఆంధ్రా బరిలో సత్తా చాటేందుకు రెడీ అయ్యాయి. లక్షల రూపాయల గిరాకీ పలుకుతున్న ఈ కోళ్ల పెంపకం, వాటికి ఏర్పాటు చేసిన హైటెక్ భద్రత ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న అంబేడ్కర్ యూనివర్సిటీ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
జనగామ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్‌పై యువకుడు హల్‌చల్ చేశాడు. రైలు కింద పడి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ట్రైన్లను అడ్డుకొని హంగామా సృష్టించాడు. రైల్వే శాఖ సిబ్బంది సమాచారంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరీతలపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వర్ల జాషువా ప్రేమ పేరుతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో జనజీవనం స్తంభించింది. కనుచూపు మేర దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మంచు ప్రభావంతో పగలు కూడా రాత్రిని తలపిస్తోంది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పట్టపగలే చోరీకి యత్నించిన దొంగను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆల్విన్ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా తెరుస్తుండగా, యజమాని అప్రమత్తమై కేకలు వేయడంతో దొంగ చిక్కాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సాహసంపై కాలనీ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలిపై మామ కత్తితో దాడి చేసిన ఘటన మచిలీపట్నంలోని పరాసుపేటలో చోటు చేసుకుంది. మెడికల్ షాపు నుంచి బయటకు వస్తున్న నాగశ్వేతపై మామ సోమరాజు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఒడిశాలోని గంజాం జిల్లాలో బేర్హంపూర్ పోలీసులు భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో బైక్‌పై తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 18 లక్షల విలువైన 156 గ్రాముల హెరాయిన్‌ను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి.. బైక్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు కాశీబుగ్గ పోలీసులు. ఒడిశా నుంచి పలాసకు గంజాయిని తరలిస్తూ విక్రయిస్తున్న నలుగురు స్నేహితులను కంబిరిగాం వంతెన వద్ద పట్టుకున్నారు. వారి నుంచి 3.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని, వారిని కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ వెల్లడించారు.
కోల్‌కతా నుంచి వారణాసికి రైలులో అక్రమంగా తరలిస్తున్న 400 రామ చిలుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న జాహిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విదేశాలకు ఈ పక్షులను తరలించి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మూగజీవాల అక్రమ రవాణాపై కేసు నమోదు చేసిన అధికారులు ముఠా గుట్టురట్టు చేసేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
రైళ్లలో శుభ్రతకు సంబంధించి ఇటీవల భారీ సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్, నవంబర్‌లలో కోచ్‌ల శుభ్రత, బెడ్ రోల్స్ గురించి రైల్ మదద్ యాప్‌లో ఫిర్యాదుల సంఖ్య 50శాతం పెరిగినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అదే సమయంలో అద్భుతం, సంతృప్తికరం ఫీడ్‌బ్యాక్‌లు సైతం తగ్గినట్లు పేర్కొంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళనగా మాట్లాడారు. ప్లీజ్ డొనాల్డ్ అంటూ మెక్రాన్ ప్రాధేయపడ్డారని రిపబ్లికన్ చట్టసభ సభ్యుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం.. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించారు అగ్రహీరో బాలకృష్ణ. సనాతన ధర్మం, భారతీయుల నమ్మకాలు లాంటి అంశాలతో రూపొంది ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సినీప్రియుల్ని మెప్పించింది. ఇప్పుడీ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించడానికి సిద్ధమైంది.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్దకు వస్తున్న సినిమాలన్నీ హిట్ కావాలి, నిర్మాతలు సుభిక్షంగా ఉన్నప్పుడే అసలైన సంక్రాంతి అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆయన కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారత అండర్-19 స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి శతక్కొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో నాటి మూడో యూత్ వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇరవై నాలుగు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.