అయ్యప్ప దీక్ష సమయంలో పోలీస్ అధికారులపై నిబంధనలు విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. రూల్స్ హిందువులకేనా, ముస్లింలకు లేవా అని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో రోజా పాటించే ముస్లిం అధికారులకు లేని ఫ్రీడమ్.. హిందువులకు ఎందుకు ఇవ్వరని పోలీసులను నిలదీశారు రాజాసింగ్.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కళానగర్‌కు చెందిన యువకుడు ఆడెపు సన్నీ.. స్నేహితుడు హెల్మెట్ లేకుండా ప్రమాదంలో మరణించారు. దీంతో రోడ్డు భద్రత కోసం సన్నీ వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తన వస్త్ర దుకాణానికి వచ్చే యువతకు, మహిళలకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాడు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. 28వేల 500 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఉన్నతాధికారులు.. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు కార్మికులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన రైతు ఏదుల సత్తమ్మకు పత్తి అమ్మగా వచ్చిన 2.14 లక్షల నగదు ఆమె సొంత ఖాతాలో కాకుండా, రాజన్న దేవస్థానం ఖాతాలో జమయ్యాయి. వంట గ్యాస్ సబ్సిడీ కూడా ఆలయ ఖాతాకే వస్తోంది. తమ నగదును ఇవ్వాలని ఈవోని అడుగితే తమ తప్పు కాదని.. బ్యాంకు వారిని అడగాలన్నారు. దీంతో బాధితురాలు తన డబ్బుల కోసం సీసీఐ, ఆలయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ హయాంలో ఆప్షన్-3 స్కీంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో రాక్రీట్ నిర్మాణ సంస్థ 47,850 ఇళ్లు నిర్మించుకుని ఎక్కడా పూర్తి చేయకుండా 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేసిందని ఆయన ఆరోపించారు. సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు మంత్రి.
అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలపై కలెక్టర్ ఆనంద్‌ను కలిశారు వైసీపీ నాయకులు. అరటి, మొక్కజొన్న రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించారు అనంత వెంకట్రామిరెడ్డి, సాకే శైలజానాథ్, విశ్వేశ్వర రెడ్డి. అరటి రైతులని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మొక్కజొన్న రైతులను కూడా ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
అనంతపూరం జిల్లా నార్పలలో యువతి బిల్డింగ్ ఎక్కి హల్‌చల్ చేసింది. కుటుంబ కలహాల కారణంగా వేద కృషి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు విడిపోవడం, తల్లి తనను చూసుకోనని చెప్పడంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. యువతికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దింపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఇందిరా నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఉన్న కృష్ణుడి విగ్రహం చుట్టూ ఉన్న నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తొలగించారు. దీంతో అధికారులు తొలగించిన స్థలాన్ని బుధవారం పరిశీలించనున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మాగంటి అన్నపూర్ణ దేవి ఓరియంటల్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్న హాసిని తీవ్ర గాయాలపాలైంది. కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ టీచర్లు పరామర్శకి రాకపోవడం తమని మరింత బాధిస్తుందని, సుమారు పది లక్షల రూపాయలు ఆసుపత్రి ఖర్చు అయిందని ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంటున్నారు హాసిని తల్లి తండ్రులు.
అనంతపురంలోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై దాడి చేసిన వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో అడ్వకేట్, వైసీపీ లీగల్ సెల్ సత్యనారాయణ రెడ్డితో సహా 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్‌నర్స్ మధ్య విభేదాల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు వివరించారు. హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడికి ఉపయోగించిన మారణాయుధాలు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ మండల అధ్యక్షుల పదవుల పంపకం ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఈ పదవుల కోసం నాయకుల మధ్య తీవ్ర కొట్లాటలు, సిగపట్లు జరిగాయి. చివరికి, టీడీపీ జోనల్ ఇంచార్జ్ కోవెలమూడి నాని జోక్యం చేసుకుని ఆరు మండలాలకు అధ్యక్షులను ప్రకటించారు. దీంతో, సింగనమల టీడీపీలోని అంతర్గత విభేదాలు తగ్గుతాయని తెలుగు తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. పావులూరు రోడ్డులోని రావిచెట్టు డొంక మలుపు సమీపంలో క్షద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ బొమ్మలు ప్రత్యక్షమవడంతో భయబ్రాంతులకు గురయ్యారు పొలానికి వెళ్లిన రైతులు. క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో.. గో అక్రమ రవాణాని అడ్డగించారు. గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను హిందూ సంఘాలు అడ్డగించాయి. అదేవిధంగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి.. కంటైనర్‌ను గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ పాత బస్టాండ్ పశువుల సంతను తలపిస్తోంది. స్థానికులు రోడ్లపై విచ్చలవిడిగా వదిలేయడంతో మూగ జీవాలు బస్టాండ్‌కు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అటు కాశి బొగ్గ బస్టాండ్‌లో బైకు, ఆటో పార్కింగ్ ప్రాంతాలు మూగజీవాలతో నిండిపోతున్నాయి. అధికారులకు చెప్పిన స్పందించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వైటల్ ఆధ్వర్యంలో మదీనాగూడలోని కళ్ళం అంజిరెడ్డి విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ అంజిరెడ్డి కూతురు లయన్ అనురాధతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
నమో భారత్ రైళ్లలో ఇకపై పుట్టినరోజు వేడుకలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు జరుపుకునేందుకు అవకాశం కల్పించింది. ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో సేవలందిస్తున్న నమో భారత్ కోచ్‌లను ప్రైవేట్ వేడుకలకు ఎన్‌సీఆర్‌టీసీ అందుబాటులోకి తెచ్చింది. మాకప్ కోచ్ గంటకు 5వేలు ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. ఈ వినూత్న సేవ ప్రయాణికులను ఆకర్షించే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో పిట్‌బుల్ జాతి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దానిని తప్పించడానికి స్థానికులు ప్రయత్నించినా వీలుపడలేదు. దీంతో బాలుడి కుడి చెవిని తెగిపోయేలా కరిచింది ఆ కుక్క. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అనంతరం కుక్క యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
సభా కార్యకలాపాల సజావు నిర్వహణకై కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరిగే శీతాకాల సమావేశాల్లో, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండటంతో, సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌తో పాటు రవితేజ అభిమానులను అలరించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని లాక్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించారు. నేటి ఉదయం సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా..సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో భారత బౌలర్‌గా నిలిచారు. దీంతో భారత మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, అశ్విన్ వంటి బౌలర్ల సరసన రవీంద్ర జడేజా చేరారు.