ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగుపెట్టనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. నిన్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీని పట్టాభిపురం వంతెన వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ.. అంబటిపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదు అయింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గంగారం సెంటర్‌లో సీపీ సునీల్ దత్ అధ్వర్యంలో పోలీసులు నాకా బంద్ నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి తరలిస్తున్న గంజాయి, ఇసుక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పది మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
పలాస జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద రక్తపు మడుగులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా జగన్నాథ్ బెహరాగా పోలీసులు గుర్తించారు.
నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున.. మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ జరగనుంది. గతంలో మంత్రి కొండా సురేఖ, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌పై విమర్శలు చేసే సందర్భంలో, నాగార్జున కుటుంబ సభ్యులపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.
విశాఖలో సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఆమె సీఎంతో చర్చించారు. అంతేకాకుండా షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై ఆమె ఆసక్తి కనబర్చారు. గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ మారిందని సీఎం వివరించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. కర్నూలు జిల్లా చిన్నవంగలికి చెందిన హరిప్రసాద్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో డాక్టర్ విజయ్ కుమార్ ఇంట్లో చొరబడి 15 తులాల వెండి, రెండు తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు 10వ వార్డులో మున్సిపల్ అధికారులను స్థానికులు, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. తంభయ్య నాయుడు నడుపుతున్న ప్రైవేట్ స్కూల్‌కు లేని డ్రైనేజీ, రోడ్డు పనులను ఏర్పాటు చేసేందుకు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ పనులను తక్షణమే నిలిపి వేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం షారాఫ్ బజార్‌లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు జ్యూవెలరీ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్‌ను మీడియా వివరణ కోరగా వివిధ దేవాలయాల్లో వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో విచారణ నిమిత్తం వచ్చామన్నారు. అనంతరం 4 కేజీల వెండి ఆభరణాల రికవరీ చేశారు. పట్టణానికి చెందిన ఒక నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుంచి భారీ నిరసన ర్యాలీకి సిద్ధమైమయ్యాయి. స్మైల్ డీజీ స్కూల్ ప్రిన్సిపల్‌పై PDSU విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడులను నివారించాలని నిరసన బాట పట్టాయి.
మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ లో జరిగిన హిజ్రాల దాడి కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. బాధితుడు సదానందం ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా హిజ్రాల కోసం వెతుకుతున్నారు.
ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులు, మంత్రులతో సమీక్షించారు. సీఐఐ మీటింగ్ కోసం వస్తున్న జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో ఈరోజు బిజీబిజీగా ఉండనున్నారు. ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం, పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు.
అనకాపల్లి జిల్లా చోడవరం ద్వారకా నగర్ శివారులో దారుణం జరిగింది. ఆరు నెలల బాబును చంపి పోరెడ్డి వీణ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పూడూరులోని మన్నెగూడా శివారులో లారీ బోల్తాపడింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, ఓనర్ ప్రాణాలతో పడ్డారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీని పోలీసులు పక్కకు తొలగిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సీనియర్స్ దాడి చేయడంతోనే సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు నిరసన చేపట్టారు. సృజన్‌పై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూటాన్ ఆర్థిక ఉద్దీపన కార్యక్రమంతో పాటు ఆ దేశ 13వ పంచవర్ష ప్రణాళికకూ సాయం అందిస్తామని భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భూటాన్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భారత్-భూటాన్ మైత్రీబంధానికి సింగ్యే వాంగ్‌చుక్ విశేష కృషి చేశారంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు.
దక్షిణాఫ్రికా దేశం బోట్స్ వానాతో భారత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రోజుల బోట్స్‌వానా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకోతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌కు మరో 8 చీతాలను అప్పగించనున్నట్లు గిడియోన్ అధికారికంగా ప్రకటించారు.
టీమ్ ఇండియా మాజీ కెప్టన్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264* చేసి ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యింది. 2014, NOV 13న ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై రోహిత్ ఈ అద్భుతాన్ని సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దశాబ్ద కాలంగా ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడం విశేషం.
తను రాసిన పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు లిరిసిస్ట్ బాలాజీ. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్‌లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు.