సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేడు తిరుమలకు రానున్నారు. ఆయన రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు, తదుపరి సీజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ కూడా రేపు తిరుమలకు రానున్నారు.
కాచిగూడ రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి కారు వదిలి వెళ్లడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బాంబు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్య లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.
మేడ్చల్ పీఎస్ పరిధిలో 50 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు.
4. హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా కారు
ఢిల్లీ పేలుడు సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను పటిష్టం చేశారు. నింబోలి అడ్డా రైల్వే అండర్‌పాస్ వద్ద అనుమానాస్పదంగా పార్క్ చేసిన కారు గురించి సమాచారం అందడంతో, ఈస్ట్ జోన్ డీసీపీ బి. బాలస్వామి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. కాచిగూడకు చెందిన సమీర్ మద్యం మత్తులో ఆ కారును పార్క్ చేసినట్లు గుర్తించారు.
నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని దామరమడుగులో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై సంతోష్ రెడ్డి రోడ్డు భద్రత ప్రమాణాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. లైసెన్సులు లేనివారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు.
కర్నూలు జిల్లా అస్పరి మండలం తొగలగల్లులో ఆవు దూడపై చిరుతపులి దాడి చేసింది. రైతు ఈడిగ అహోబిలం పొలంలో ఏర్పాటు చేసిన షెడ్‌లోకి రాత్రి ప్రవేశించిన చిరుత, ఆవు దూడపై దాడి చేసి చంపేసింది. ఉదయం రక్తపు మడుగులో ఉన్న దూడను చూసిన రైతు అటవీ అధికారులకు సమాచారం అందించారు. చాలా రోజులుగా చిరుత సంచారం ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, వెంటనే దాన్ని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాములలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొనడంతో కోదాడకు చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ షేక్ సిరాజ్ అనే వ్యక్తి మృతిచెందాడు. మెరుగైన వైద్యం కోసం సైదాను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా గన్నవరం రోటరీ క్లబ్‌లో టీడీపీ మండల, క్లస్టర్ కమిటీల ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు జగన్ ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని, చిత్తశుద్ధితో పనిచేస్తానని, మల్లవల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా మునగపాకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిమ్మరాజుపేట డావెన్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్థి జనపరెడ్డి మోక్షిత్ మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో స్కూల్ ఆవరణలో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలోని భవానీ ఐలాండ్ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడ్వెంచర్ థ్రిల్ సిటీ నిర్మాణానికి విశ్వనాథ్ స్పోర్ట్స్ సంస్థకు అనుమతినిచ్చింది. ఈ రూ.51.48 కోట్ల ప్రాజెక్టు కోసం 66 ఏళ్ల లీజుకు పది ఎకరాలు కేటాయించింది. దీని ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే చేస్తుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఏడాదిన్నరలో పదికి పైగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నించడానికి వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు.
మదనపల్లి కిడ్నీ రాకెట్‌లో మృతి చెందిన యమున మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళకు ఆపరేషన్ చేసి ఎడమవైపు కిడ్నీ తొలగించగా.. రక్తనాళం తెగి తీవ్ర రక్తస్రావం జరిగిందని గుర్తించారు. కుట్లు వేసినా రక్తస్రావం ఆగకపోవడం, అధిక రక్తస్రావం కారణంగానే యమున మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది మండలాల నూతన అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. బద్వేలు మున్సిపాలిటీకి గుర్రంపాటి వెంగల్ రెడ్డి సహా పలువురు బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని కొత్త అధ్యక్షులు తెలిపారు.
కడప జిల్లా బద్వేల్‌లో విషాదం చోటుచేసుకుంది. భగత్ సింగ్ కాలనీకి చెందిన మనోజ్ కుమార్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేనమామ కూతుర్ని ప్రేమించిన మనోజ్.. పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
నాంపల్లిలో ఒక వ్యక్తి ఒకే స్కూటీపై నలుగురు పిల్లలను ప్రమాదకరంగా తీసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఒకే స్కూటీపై నలుగురు పిల్లలను తీసుకెళ్లిన వ్యక్తి, మరో బాలుడు స్కూటీ వెనక నిలబడి ప్రయాణించాడు. బంపర్ కూడా లేకపోవడంతో ఇది మరింత ప్రమాదకరంగా మారింది. ఇలాంటి ప్రయాణం చేయొద్దు అంటూ ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
హోరాహోరీగా సాగిన బిహార్ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఫలితాలు తేలిపోనున్నాయి. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
తాను క్రికెట్ కోసమే పుట్టానని అనుకుంటున్నట్లు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. మహిళ వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత చెన్నై వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేళతాళాలు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. చెన్నైలోని సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అతిపెద్ద పికిల్ బాల్ టోర్నీ నిర్వహిస్తోంది. అన్ని వయసుల వారు పాల్గొనే టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా వర్సిటీ ఛాన్సలర్ మారియాజీనా జాన్సన్ తదితరులను హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి మాట్లాడారు.
లిటిల్ హార్ట్స్ లాంటి విజయం తర్వాత ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న మరో చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించిన ఈ సినిమాని సాయిలు కంపాటి తెరకెక్కించారు. రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించారు. ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు.