విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం అక్రమ నిల్వలు పట్టుబడిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. పట్టుబడిన గోమాంసం నిల్వల వెనుక ఉన్న అసలు మూలాలు గుర్తించి.. ఎవరి ప్రమేయమున్నా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు..? ఎక్కడి నుంచి తెచ్చారు..? నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారు..? దీని వెనుక నిజంగా ఎవరి నెట్‌వర్క్ పనిచేస్తోంది..? అనే అంశాలపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్. డీఆర్‌ఐ అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో అక్రమంగా నిల్వ ఉంచిన లక్షా 89 వేల కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని.. కేసును పోలీస్ శాఖకు అప్పగించినట్లు పవన్‌కు తెలిపారు కమిషనర్. కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు వివరించారు అధికారులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎంకు తెలిపారు విశాఖ పోలీస్ కమిషనర్.
కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు రూ. 41 లక్షల విలువైన 331 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. బంగారం కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్టు చేశారు. ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచాలని ఎస్పీ సూచించారు.
క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. లకడికఫూల్‌లో ఉన్న అశోక హోటల్‌లో క్రిస్మస్ వేడుకలకు స్వాగతం పలుకుతూ కేక్ మిక్సింగ్ ఫెస్ట్‌ను ప్రారంభించారు. హోటల్ సిబ్బందితో కలిసి ఎండీ డాక్టర్ తేజస్విని రెడ్డి, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, వైన్‌తో కేక్ మిక్సింగ్ చేశారు. ఈ మిశ్రమాన్ని నెలరోజులు సోక్ చేసి, డిసెంబర్‌లో కేకులు తయారు చేసి క్రిస్మస్ సంబరాలు జరుపుతారు.
సాక్షి మీడియాలో ప్రచురించిన ‘జనసేనలో భూమి గోల’ వార్తను జనసేన ఖండించింది. వార్తలో పేర్కొన్న సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పేషీలో లేరని స్పష్టం చేసింది. సివిల్ వివాదాన్ని ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ చేయడం దుష్ప్రచారం అని తెలిపింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిష్కారానికి పంపుతామని జనసేన తెలిపింది.
యానాం సీఐ అడలరసన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పుదుచ్చేరి ఐజీ అజిత్ కుమార్ బంగ్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోక్సో కేసులో నిందితుడిని పుదుచ్చేరి జైలుకు తరలించారు. అనంతరం తిరిగి వస్తూ పోలీస్ వ్యానులో సీఐ డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆవీడియోను తానే తన వ్యక్తిగత గ్రూపులో అప్‌లోడ్ చేశారు. అయితే మద్యం తాగి డ్యాన్స్ చేశారని పుదుచ్చేరిలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. అనుమానితుల సంఖ్య 20కి చేరగా, ఫరీదాబాద్‌లోని విద్యార్థులు, సిబ్బందిని విచారిస్తున్నారు. కారు పేలుడులో మరణించిన ఉమర్ నబీ నివాసాన్ని పుల్వామాలో భద్రతా బలగాలు కూల్చేశాయి. మరోవైపు, ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న 350 కేజీల అమోనియం నైట్రేట్‌ను నౌగాం పోలీస్ స్టేషన్‌లో చెక్ చేస్తుండగా పేలడంతో తొమ్మిది మంది మరణించారు.
అక్రమంగా ఇసుక అక్రమార్కులపై నందిగామ పోలీసులు కొరడా ఝలిపించారు. కంచికచర్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను పట్టుకున్నారు. ఎలాంటి అధికారిక బిల్లులు లేకపోవడంతో లారీలను సీజ్ చేసినట్లు సీఐ చవాన్ తెలిపారు. టిప్పర్ యజమాని తో సహా 7గురు పై కేసునమోదు చేశామని వెల్లడించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అక్రమ ఇసుకపై ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రకటించినప్పటికీ, పోలీసులు కేసులు నమోదు చేయడంపై ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడప నగరంలో గంజాయి మత్తు టాబ్లెట్ లను విక్రయిస్తున్న 9 మంది అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ తెలిపారు. వారి నుంచి రూ.లక్ష 15 వేల విలువైన గంజాయి, రూ.96 వేలు విలువైన మత్తు టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సురభి మహేష్‌పై గతంలో రౌడీ షీట్ ఉంది. ఇతను కర్నూలుకు చెందిన మెడికల్ షాప్ యజమాని నాగేంద్రతో కలిసి యువతకు టాబ్లెట్లు అమ్ముతున్నట్లు ఎస్పీ తెలిపారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో బ్రాండ్ ఎక్స్ పరిశ్రమను సందర్శించారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. కేంద్రమంత్రికి ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, కూటమి నాయకులు స్వాగతం పలికారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(90) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్ ఇప్పటివరకు 92 సిక్స్‌లు బాదాడు.
గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దయిన ఇండిగో సింగపూర్ విమాన సర్వీస్‌ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునఃప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఈ సర్వీస్ తిరిగి ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విమానాల సంఖ్య 50% పెరిగిందని, రోజుకు 48 విమానాలు తిరుగుతున్నాయని యార్లగడ్డ తెలిపారు. ఈ అంతర్జాతీయ సర్వీస్ కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాల ఎన్ఆర్ఐలకు ఉపయోగపడుతుంది.
కమల్ హాసన్ – రజనీకాంత్ల మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో ఆయన భార్య ఖుష్బూపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో ఆమెను ఐటెం సాంగ్ చేయమని అడిగారని వచ్చిన పోస్ట్‌లపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు ” నన్ను ఐటెం సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ కుటుంబంలో ఎవరినైనా చేయమన్నారేమో అనుకున్నా” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె ధైర్యవంతమైన సమాధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు.
క్రికెటర్ శ్రీచరణిని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించాడు. ఆమెకు ఛైర్మన్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి శాలువాలు కప్పి, తీర్థప్రసాదాలు అందించి శ్రీచరణిని సత్కరించారు. శ్రీవారి ఆశీస్సులతో క్రికెట్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఛైర్మన్ ఆశీర్వదించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని ఏడో నెంబర్ వార్డు రాయల్ కాంటా దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గుంతల రోడ్డు సరిచేయకపోవడంతో ఆగ్రహించిన కాలనీవాసులు సొంతంగా జేసీబీతో రోడ్డును తవ్వారు. దీంతో అధికారులు, అధికార పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని కేసులు పెడతామని బెదిరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా పామర్రులో ఘోర ప్రమాదం జరిగింది. పాములుపాడు గ్రామంలోని దోసపాడు చానల్‌పై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ వంతెనలో దిగబడగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వంతెన కూలడంతో చుట్టుపక్కల ఐదు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
అనంతపురం జిల్లా టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్‌కుమార్ హత్య కేసుపై పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. అనంతపురంలో మకాం వేసి, పోస్టుమార్టం చేసిన డాక్టర్ల బృందంతో సమావేశమయ్యారు. మృతదేహంపై గాయాలు, ప్రాథమిక నివేదికపై చర్చించారు. ఈ విషయమై ఆయన అధికారులతో మీటింగ్ నిర్వహించారు.
గ్లోబల్ హాస్పిటాలిటీ సంస్థ అట్మాస్పియర్ కోర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటళ్ల విస్తరణపై చర్చించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో ఉన్న ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తామని కంపెనీ వారు తెలిపారు.