జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు.
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 8 నుంచి 9 డిగ్రీలకు పడిపోయాయి. ఇవాళ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన అతిపెద్ద పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ రవికి అంతర్జాతీయ పైరసీ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అతని నివాసం, హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా శివాలయాలు, విష్ణు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి, వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. పవిత్రమైన నదులు, చెరువులు, కోనేరుల్లో దీపాలను వదిలి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో రహమత్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ అదృశ్యమయ్యాడు. 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికైన రమేష్…ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులపాలయ్యాడు. అయితే బ్యాంక్ లోన్ కట్టేందుకు వెళ్తున్నానని చెప్పి.. తిరిగి ఇంటింటి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య మల్లీశ్వరి.. మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం పాతాళ గంగలో ఈ నెల 18న జరగాల్సిన తెప్పోత్సవంను దేవస్థానం వాయిదా వేసింది. పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి కారణంగా నీటి మట్టం హెచ్చుతగ్గులు ఉండటం శ్రేయస్కరం కాదని, డ్యామ్ నిర్వహణ అధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో మధిరకు చేరుకున్నారు. ‘జాగృతి జనం బాట’లో భాగంగా రెండు రోజులు ఖమ్మం జిల్లాలో పర్యటించి, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, ఈ జిల్లా మలిదశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పందిగుంట గ్రామంలో విషాదం నెలకొంది. ఊబిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గోరింటాకు కోసం వెళ్లిన ఏడుగురు చిన్నారులు అక్కడే ఉన్న చిన్న గుంటలో ఆడుతూ పడిపోయి సందీప్, అవినాష్ మృతి చెందారు. మిగిలిన పిల్లల సమాచారంతో తల్లిదండ్రులు గుంట వద్దకు చేరుకునేసరికే వారు మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపుగోదాయవలసలో వైసీపీ నిర్వహిస్తున్న ‘కోటి సంతకాల’ రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టెక్కలి ఇంఛార్జ్ పేరాడ తిలక్ సమక్షంలోనే టీడీపీ వర్గీయులు వైసీపీ నాయకులపై దౌర్జన్యం చేసి, సమావేశంలో గందరగోళం సృష్టించారు.
కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ద్రాక్షారామ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. తెల్లవారుజామున నుంచి భక్తులు విచ్చేసి సప్త గోదావరిలో స్నానమాచరించి, స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అశ్వద్ద శంకర నారాయణ వృక్షం వద్ద ప్రదక్షణ లు చేశారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో కార్తీక మాసం పురస్కరించుకుని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారిని జిల్లా కలెక్టర్ కె. హైమావతి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి తీసుకెళ్లి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వేదపండితులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఎస్పీ టి. శ్రీనివాస రావు పర్యవేక్షణలో గద్వాల్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పూటన్ పల్లి, ఎర్రవల్లి చౌరస్తాలో తనిఖీలు చేసి, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఇప్పటివరకు 42 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
ప్రకాశం జిల్లా కంభంలోని శ్రీకోట సత్యమాంబ ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు దీపాలు వెలిగించి శివ నమస్కరణతో భక్తిని చాటారు. గత ఐదు సంవత్సరాలుగా ఆలయంలో ప్రతి కార్తిక మాసాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ముందుగా ఆలయంలోని కోట సత్యమాంబా దేవిని దర్శించుకుని భక్తులు కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు, కుటుంబ సంబంధాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్రకటించింది. లాలూ మరో ముగ్గురు కూతుళ్లు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కుటుంబంలో పెరుగుతున్న ఉద్రిక్తతలే ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు కేసులో విచారణ జరుగుతోంది. ఫోరెన్సిక్ బృందం అధిక లైటింగ్‌ను ఉపయోగించడం వల్ల పేలుడు జరిగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు అధికారులు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నిపుణులు నౌగామ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి.. నమూనాలు సేకరించారు.
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీజే బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానం ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.
నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేల మంది యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకారులు నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో దాదాపు 120మంది గాయపడగా.. వారిలో 100మంది పోలీసు అధికారులే ఉండటం గమనార్హం.
ఆఫ్రికా కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి సుమారు 32 మంది చనిపోయారు. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓడిపోయింది. 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. కేవలం 93 రన్స్‌కే ఆలౌటైంది. సుందర్ 31, అక్షర్ పటేల్ 26, జడేజా 18 రన్స్ చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ నాలుగు, మార్కో రెండు, కేశవ్ రెండు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రానున్న అఖండ 2 సినిమాను 2డీతో పాటు 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారతీయ సినిమాలో గొప్ప అనుభూతిని పంచే విధంగా ఈ సీక్వెల్ ఉంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 5న విడుదల కానుంది.