మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. మృతుల వివరాలను వారి కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబీకులు ఇవాళ రానున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు సిట్ అధికారులు.నెయ్యి కల్తీ అని ప్రోక్యూర్‌మెంట్ అధికారులకు ముందే తెలుసని.. వారి ద్వారా పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే సరఫరా కంపెనీలతో మాట్లాడారని తెలిపారు. ప్రొక్యూర్‌మెంట్ అధికారుల సలహాతోనే మైసూర్ ల్యాబ్‌లో పరీక్షలు జరిగాయని చిన్నప్పన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో వైవీ సుబ్బారెడ్డిని రేపు విచారణ చేయనుంది సిట్.
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో హిడ్మా భార్య కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కి ఈ నెల 27న వివాహం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి రాహుల్ సిప్లిగంజ్ ఆహ్వానించారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. బహిర్భూమికని వెళ్లిన అయ్యప్ప స్వాములపైకి కారు దూసుకెళ్లింది. స్పాట్ లో హరి అనే అయ్యప్ప మాలధారుడు మృతిచెందాడు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రేపు ఇరుముడి కట్టుకొని శబరికి ప్రమాణం కానున్న తరుణంలో ప్రమాదం జరిగింది. కారును డ్రైవ్ చేస్తున్నది కురుపాం జనసేన నియోజకవర్గం ఇంచార్జి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ మల్లేశ్వరరావుగా గుర్తించారు.
హైదరాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు అన్ని అనుమతులు ఇస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు. విస్తరణకు అడ్డంకులు తొలగించినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశంసించారు. మూసీ నది శుద్ధీకరణతో పాటు రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు మనోహర్‌లాల్ ఖట్టర్.
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 లక్షల 80 వేల విలువైన 7.8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత నెల 12న నారాయణాద్రి, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లలో వీరు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు జీఆర్పీ డీఎస్పీ జావేద్.
ఏపీలో మావోయిస్టుల అరెస్టుల పర్వం ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. ఇవాళ మావోయిస్టుల అరెస్టులపై వివరాలు వెల్లడించనున్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్, ఐజీ ఎస్వీ రాజశేఖర్ బాబు.
తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయించి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. పెదజీయర్ మఠం ఉద్యోగి రవికుమార్ 900 అమెరికన్ డాలర్లు దొంగిలించిన కేసును లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకుని, ఆ రాజీ భాగంగా 14.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా ఇచ్చిన వ్యవహారం వెనుక ఉన్న లోతైన కుట్రను పూర్తిగా బయటపెట్టేందుకు కొత్త క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్నారు నిర్మాత సి.కల్యాణ్. కడుపు మంట, బాధతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని అన్నారు. ఇక రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఛాంబర్ తరఫున త్వరలో సత్కరిస్తామని నిర్మాత చెప్పారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత, గిరిజన, మైనారిటీల పై దాడులు విపరీతంగా పెరిగాయని సీపీఐ నేతలు ఆరోపించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపుతో శ్రీకాకుళం జిల్లా సారవకోట తహసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వ సాధన, ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్త ఆందోళన చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి తాడిపత్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వాదనలు విని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇచ్చాపురంలో రజస్వల అయిన కుమార్తెను మూఢనమ్మకంతో తల్లి చీకటి గదిలో బంధించింది. స్థానికుల సమాచారంతో కోర్టు జడ్జి, పోలీసుల బృందం జోక్యం చేసుకుని బాలికను రక్షించారు. బాలిక మానసిక స్థితి కూడా బాలేదని గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 9.2, మెదక్ జిల్లా నార్లాపూర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జాతీయ ప్రధాన రహదారులపై పొగ మంచు కమ్మేయడంతో.. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి.
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది. దర్శనం క్యూలైన్లో కుప్పకూలిపోయి ఓ మహిళ(58) మరణించారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణ భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో భారీ స్థాయిలో జనసమూహాన్ని ఎప్పుడూ చూడలేదని టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్ తెలిపారు.
ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002లోని సెక్షన్ 19 కింద అల్ ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్టు చేసింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ అరెస్టు జరిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ అరెస్టుతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. ఈ కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
పశ్చిమాసియా పవర్ బ్యాలెన్స్‌లో కీలక మార్పు రాబోతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలను పొందిన ఏకైక దేశం ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాకు కూడా ఈ జెట్‌లను అమ్మడానికి సిద్ధమయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ మొదలైంది.
డెఫ్‌లింపిక్స్‌లో హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు మరో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం 10మీ ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో ధనుష్, మహిత్ సంధు జంట బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ధనుశ్ జోడీ 17-7తో దక్షిణ కొరియాకు చెందిన జియాన్ డైన్, కిమ్ వూరిమ్ జంటను ఓడించింది. కాంస్య పతక పోరులో వానియా, మిలింద్ జోడీ 16-12తో ఉక్రెయిన్ ద్వయంపై గెలిచింది. డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్లు ఇప్పటివరకు 9 పతకాలు సాధించారు.
తాను ఇప్పటి వరకు వరుసగా మాస్ సినిమాలు చేశాను.. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చాలా భావోద్వేగభరితమైన సినిమా అని హీరో రామ్ అన్నారు. ఈ చిత్రానికి ఫీల్ అయినంత ఎమోషన్‌ను ఇంతవరకు ఏ సినిమాకి అనుభూతి చెందలేదన్నారు. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కర్నూల్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.