E-Paper
Advertisement

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

Top 20 News Today: కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య, అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి చిన్నారులకు అస్వస్థత

1. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషితో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో అమలవుతున్న సన్నబియ్యం పంపిణీ పథకంపై కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌ ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం.

2. ప్రజలకు సీపీ వీసీ సజ్జనార్ వార్నింగ్

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సహా విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

3. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుంది సిట్ అధికారుల బృందం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ చేయనుంది సిట్. ఇప్పటికే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ EO, పలువురు అధికారులను విచారణ చేసింది. వారి స్టేట్‌మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డిని విచారణ చేయనున్నారు.

4. జగన్ రాకతో బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత

బేగంపేట ఎయిర్‌పోర్టులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరయ్యేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.

5. బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవు- ఈటల రాజేందర్

బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ ఈటల రాజేందర్. విభేదాలు అనేవి సోషల్ మీడియా సృష్టియే అన్నారు. అంతర్గత విభేదాలు అనేవి సహాజమని.. అన్ని పార్టీలో ఉంటాయన్నారు. హుజూరాబాద్ లో జరిగే సమావేశాలపై తనకు సమాచారం ఉందన్నారు. అయితే వ్యక్తిగత పనుల ఉండటం వల్ల హాజరుకాలేకపోయానని ఈటల చెప్పారు.

6. దారుణం.. మైనర్ బాలికపై దారుణ హత్య

విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. బాలిక డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా చేసి కప్పరాడ బేత చర్చీ సమీపంలోని కాలువలో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7. మోనాలిసా అరెస్ట్

రహ్మత్‌నగర్‌లో ట్రాన్స్‌జెండర్లను వేధించి, పలువురి ఆత్మహత్యాయత్నాలకు కారణమైన మోనాలిసాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోనాలిసా ఆధ్వర్యంలో పనిచేసిన ట్రాన్స్‌జెండర్లను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేదని బోరబండ పోలీసులు తెలిపారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

8. కుమార్తె వివాహం చేయలేక తండ్రి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా, నస్రుల్లాబాద్ మండలం, నెమ్లి గ్రామంలో కుమార్తె వివాహం చేయలేకపోతున్నాననే ఆవేదనతో చీట్టి వీరయ్య(65) అనే దినసరి కూలీ ఆత్మహత్య చేసుకున్నారు. రెండో కుమార్తె సంధ్యకు పెళ్లి చేయలేని ఆర్థిక ఇబ్బందులు, తోడుగా ఆస్తమాతో బాధపడుతుండటం వలన జీవితంపై విరక్తి చెందారు. ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. మృతుడి భార్య అనూషవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

9. అంగన్ వాడీ స్కూల్‌లో పాలు తాగి 9 మంది చిన్నారులకు అస్వస్థత

అంగన్‌వాడీ స్కూల్‌లో పాలు తాగి 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందల గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం నుంచి చిన్నారులకు వాంతులు, విరేచనాలు విపరీతంగా అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను.. ఆత్మకూరు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

10. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల లీకేజీలు.. ఆందోళనలో రైతులు..

జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల లీకేజీలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు లీకేజీ ఏర్పడడంతో నిల్వ ఉన్న నీరు వృథాగా దిగువకు పోతోంది. ఇప్పటికే పూడిక పేరుకుపోవడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో లీకేజీల ద్వారా నీరు వృథాగా పోతుండటం ఆయకట్టు రైతులను కలవరపెడుతోంది.

11. తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.

12. వైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడు మృతి..

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడు మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందక మల్లయ్య మృతి చెందారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సకాలంలో స్పందించకపోవడం వల్లే చనిపోయాడని ఆరోపించారు.

13. ప్లాస్టిక్ వాడిన, అపరిశుభ్రంగా ఉన్న చర్యలు తప్పవు-కలెక్టర్ లక్ష్మీశా

విజయవాడలోని పటమట రైతు బజార్‌ను కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె రైతు బజార్‌లో ప్లాస్టిక్ వాడకం, పరిసరాల పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్‌ను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. పరిశుభ్రత బాగానే ఉన్నా మరింత మెరుగుపరచాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆమె ఆదేశించారు. పాలిథిన్ కవర్లు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

14. విజయనగరం జిల్లాలో కొండచిలువ హల్‌చల్

విజయనగరం జిల్లా, రాజాం మండలం, బొద్దాంలో కొండచిలువ హల్‌చల్ చేసింది. సింహాచలం అనే రైతు తోటలో సుమారు 12 అడుగుల గల కొండచిలువ సంచరించడంతో అటుగా వెళుతున్న రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీశాఖ అధికారుల ఆదేశాలతో స్నేక్ స్నాచర్ శేఖర్ అప్రమత్తంగా పామును బంధించి మైదాన ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.

15. సుప్రీంకోర్టులో ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురు

రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్డీయేతర రాష్ట్రాలకు చుక్కెదురైంది. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్దేశించలేమని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గవర్నర్‌కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలమని జస్టిస్ బీఆర్ గవాయ్ తేల్చేశారు.

16. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు..

దిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దీనిలో భాగంగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2008లో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు, 2007లో గోరఖ్‌పుర్ పేలుడు కేసుల్లో నిందితుడు షాబాద్ బేగ్ అల్‌-ఫలా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అని దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు. హరియాణా ఫరీదాబాద్‌లోని ఆ విద్యా సంస్థలో 2007లో షాబాద్ బీటెక్ పూర్తి చేశాడు.

17. సంస్థ లైసెన్సును రద్దు చేస్తానని ట్రంప్ హెచ్చరిక..

సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో కలిసి శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఏబీసీ న్యూస్‌ విలేకరి మేరీ బ్రూస్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సంస్థ లైసెన్సును రద్దు చేస్తానని హెచ్చరించారు.

18. వన్డే సిరీస్‌కు పాండ్యా, బుమ్రా దూరం..!

దక్షిణాఫ్రికాతో నవంబర్ 30న మొదలయ్యే వన్డే సిరీస్‌కు సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా హార్దిక్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించి, మొదట సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. పనిభారం కారణంగా బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నారు.

19. నెగెటివ్‌ టాక్‌ వస్తే.. అర్ధనగ్నంగా తిరుగుతానన్నా సాయిలు

రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్‌పేట్‌ సెంటర్‌లో తిరుగుతానంటూ బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు దర్శకుడు సాయిలు కంపాటి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

20. నిర్మాతలకు క్లారిటీ ఇచ్చిన కొరియోగ్రాఫర్లు

అగ్ర హీరోలు అనవసర ఖర్చులు కూడా నిర్మాతలతో పెట్టిస్తున్నారని బాలీవుడ్‌లో ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ సెట్స్‌కు ఫుడ్‌ ట్రక్కు తెచ్చుకుంటారని కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై కొరియోగ్రాఫర్లు పీయూష్‌ భగత్‌, షాజియా సమ్‌జీ క్లారిటీ ఇచ్చారు. అగ్ర హీరోలు వారి ఖర్చులను వారే భరిస్తారని నిర్మాతలకు సంబంధం లేదని చెప్పారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×